Bangladesh: టెర్రరిస్టులకు సహకరించిన భారత వ్యతిరేకిని నిర్దోషిగా ప్రకటించిన బంగ్లాదేశ్ కోర్టు

by S Gopi |
Bangladesh: టెర్రరిస్టులకు సహకరించిన భారత వ్యతిరేకిని నిర్దోషిగా ప్రకటించిన బంగ్లాదేశ్ కోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్‌లో ఏర్పాటైన తాత్కాలిక యూనస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌పై దాడి చేసేందుకు పాకిస్థాన్‌కు చెందిన హర్కత్-ఉల్-జిహాద్-అల్-ఇస్లామీ (హుజీ) వంటి తీవ్రవాద గ్రూపులకు నిధులు సమకూర్చడం, సహాయం చేయడం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) సభ్యుడు, మాజీ మంత్రి అబ్దుస్ సలామ్ పింటూను బంగ్లాదేశ్ కోర్టు విడుదల చేసింది. 17 సంవత్సరాలుగా జైలు శిక్ష అనుభవిస్తున్న అబ్దుస్‌ను స్థానిక కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అబ్దుస్ పీఓకేలోని శిబిరాల్లో రిక్రూట్‌మెంట్, శిక్షణా కార్యక్రమాలను కూడా నిర్వహించాడు. అంతేకాకుండా 2004లో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాపై గ్రెనేడ్ దాడికి కుట్ర పన్నేందుకు హుజీకి ఆయుధాలు సమకూర్చడంలో అబ్దుస్ సహాయం చేశాడు. ఈ కేసులో అతనికి మరణశిక్ష పడింది. ప్రస్తుతం నిర్దోషిగా తేలడంతో జైలు నుంచి విడుదలయ్యాడు. హసీనాపై హత్యాయత్నానికి పాల్పడిన మరో వ్యక్తి లుత్‌ఫోజామన్ బాబర్ కూడా పింటూతో పాటు విడుదలయ్యాడు. అయితే, బంగ్లాలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం భారత్‌కు వ్యతిరేకంగా వ్యవహరించడం ఇదే తొలిసారి కాదు. గతంలో అస్సాం సాయుధ వేర్పాటువాద సంస్థగా పేరున్న ఉల్ఫాకు ఆయుధాల అక్రమ రవాణా కేసులో బంగ్లాదేశ్ హైకోర్టు ఊరట కల్పించింది. ఈ కేసులో ఉల్ఫా నేత పరేశ్‌కు మరణశిక్ష నుంచి జీవితఖైదుగా మార్చడంతో పాటు ఆరుగురిని నిర్దోషులుగా ప్రకటించింది.

Advertisement

Next Story

Most Viewed