- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
PM Narendra Modi: గోద్రా అల్లర్లపై ఎన్నో దుష్ప్రచారాలు, నాపై మరెన్నో ఆరోపణలు.. కానీ..: ప్రధాని నరేంద్ర మోడీ

దిశ, నేషనల్ బ్యూరో: గుజరాత్‌లో గోద్రా అల్లర్లే(Godhra Riots) అతి పెద్దవని, అది వరకెప్పుడు అంతటిస్థాయిలో అల్లర్లు జరగలేవని కొందరు దుష్ప్రచారం చేశారని, ఈ అల్లర్లను ఆధారంగా చేసుకుని ప్రత్యర్థులు తనపై ఎన్నో విఫల కుట్రలు చేశారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఈ అల్లర్లు జరిగినప్పుడు కేంద్రంలో తమ ప్రత్యర్థి పార్టీ అధికారంలో ఉన్నదని, అందుకే తనపై ఎన్నో ఆరోపణలు చేశారని, దుష్ప్రచారం చేశారని, కానీ, న్యాయవ్యవస్థ క్షుణ్ణంగా పరిశీలించి తనను నిర్దోషిగా రెండు సార్లు ప్రకటించిందని వివరించారు. అమెరికన్ కంప్యూటర్ సైంటిస్టు, ఏఐ రీసెర్చర్, పాడ్‌కాస్టర్(Podcast)తో ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) మూడు గంటలకు పైగా మాట్లాడిన పొడ్‌కాస్ట్ వీడియోను ఆదివారం సాయంత్రం విడుదల చేశారు. ఈ సంభాషణలో ప్రధాని నరేంద్ర మోడీ తన వ్యక్తిగత వివరాలు, దేశ రాజకీయాలతోపాటు అంతర్జాతీయ విషయాలనూ పంచుకున్నారు.
పతంగి పోటీలు, సైకిళ్లు ఢీకొట్టుకున్నా అలర్లే
గుజరాత్‌లో తరుచూ అల్లర్లు జరిగేవని ప్రధాని మోడీ తెలిపారు. ‘2002 అల్లర్ల కంటే ముందటి గుజరాత్ కాలాన్ని జాగ్రత్త సమీక్షిస్తే ఈ విషయం బోధపడుతుంది. తరుచూ అల్లర్లు జరిగేవి. కర్ఫ్యూలు నిత్యం ఏదోచోట అమలయ్యేవి. పతంగి పోటీలకు, రెండు సైకిళ్లను ఢీకొట్టుకున్నాయన్న చిన్న కారణాలతోనూ అల్లర్లు జరిగిన చరిత్ర ఉన్నది. 1969లో జరిగిన అల్లర్లు ఆరు నెలలకు పైనే కొనసాగాయి. అప్పుడు నేను రాజకీయరంగంలోనే లేను. నేను ఎమ్మెల్యేగా గెలిచిన మూడు రోజులకే గోద్రా అల్లర్లు జరిగాయి. ఆ విషాదాన్ని ఊహిస్తేనే గుండె తరుక్కుపోతుంది. ప్రజలను సజీవదహనం చేశారు. కాందహార్ హైజాక్, పార్లమెంటుపై దాడి, 9/11 దాడి వంటివి ఓ సారి గుర్తు చేసుకోండి. అలాంటి పరిస్థితి ఏర్పడింది. గోద్రా అల్లర్ల సమయంలో ఎంతటి భావోద్వేగభరిత వాతావరణం ఉండేదో పై ఘటనలతో అర్థమైపోతుంది.’ అని ప్రధాని మోడీ వివరించారు. తనపై కుట్రలు వేసే ప్రయత్నాలు విఫలమయ్యాయని, ఆసక్తికరమైన విషయం ఏమిటంటే తాను గుజరాత్ సీఎంగా మారిన తర్వాత ఇప్పటి వరకు అల్లర్లు జరగలేవని చెప్పారు. ఇప్పుడు గుజరాత్ శాంతియుతంగా ఉంటున్నదని పేర్కొన్నారు.
పాకిస్తాన్ నాయకులు ఆలోచిస్తారని అనుకుంటున్నా
పాకిస్తాన్ గురించి ప్రధాని మాట్లాడుతూ చరిత్ర నుంచి నేటి వరకు వివరాలు పంచుకున్నారు. దేశ విభజన భారతీయులను తీవ్రంగా గాయపరిచిందని, తమ బంధువుల శవాలు గుట్టలుగా పాకిస్తాన్ నుంచి ట్రైన్‌లో వచ్చిన ఘటనలు ఇప్పటికీ బాధిస్తూనే ఉంటాయని అన్నారు. ఆ బాధను భారతీయులు చాలా మంది ఇప్పటికీ మోస్తున్నా కలిసి జీవించాలనే ఆశనూ కలిగి ఉంటారని వివరించారు. కానీ, పాకిస్తాన్‌కు గాయాలను మరిచి ఎవరికి వారు సంతోషంగా జీవించాలనే ఆలోచనలు లేవన్నారు. పాకిస్తాన్ వక్రబుద్ధి వల్ల కొన్ని దశాబ్దాలుగా ఉభయ దేశాల మధ్య సంబంధాలే నిలిచిపోయాక.. తాను గెలిచిన తర్వాత పాకిస్తాన్ వెళ్లి అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్‌ను తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించానని వివరించారు. తాను స్నేహ హస్తం అందించి ఉభయ దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొల్పే ప్రయత్నం చేశానని తెలిపారు. కానీ, పాకిస్తాన్ తన బుద్ధి మార్చుకోలేదని, స్నేహానికి బదులు ద్రోహాన్నే చూపిందని చెప్పారు. ఆ తర్వాత కూడా ఉగ్రఘటనలకు తెరలేపిందని, ఆ దేశ నాయకుల ఆలోచనలు శాంతి వైపు పయనించడం లేదని, ఉగ్రవాదం, భయోత్పాతాల చుట్టే వారి ఆలోచనలు సాగుతున్నాయని మండిపడ్డారు. దశాబ్దాలుగా బీభత్సానికి గురవుతున్న అక్కడి ప్రజల యాతనపడుతున్నారని చెప్పారు.
విభేదాలు వివాదాలు కాకూడదు.. చైనాతో పోటీ మంచిదే
2020లో గాల్వన్ లోయ గాయాలు ఇప్పుడిప్పుడే సద్దుమణిగిపోయాయని, చైనాతో మళ్లీ సహజమైన, బలమైన సమన్వయానికి పునాదులు పడుతున్నాయని ప్రధాని వివరించారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో సమావేశం తర్వాత సరిహద్దులో సాధారణ వాతావరణం నెలకొంటున్నదని తెలిపారు. భారత్, చైనాల మధ్య సమన్వయం ఈ రెండు దేశాలకే కాక.. యావత్ ప్రపంచ సుస్థిరత, సుభిక్షతకు ఆవశ్యకమని వివరించారు. 21వ శతాబ్ది ఆసియా దేశాలదేనని, అందుకే భారత్, చైనాలు ఆరోగ్యపూరిత, సహజమైన పోటీని కోరుకుంటున్నాయని, పోటీ పడటం తప్పు పనేమీ కాదని చెప్పారు. అయితే.. విభేదాలు వివాదాలుగా మారకుండా చూసుకోవాలని తెలిపారు. చైనా, భారత్‌ల మధ్య సంబంధాలు ఈనాటివి కావని, పురాతన కాలం నుంచే బలమైన సంబంధాలున్నాయని, ఆధునిక ప్రపంచంలోనూ ఈ దేశాలవి కీలక పాత్ర అని వివరించారు. చైనా, భారత్‌లు ఒక దేశం నుంచి మరోటి నేర్చుకుంటాయన్నారు.
మా ఇద్దరికి దేశాలే ఫస్ట్ ప్రయారిటీ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో తనది ప్రత్యేక బంధమని, తామిద్దరి మధ్య అచంచల విశ్వాసమున్నదని ప్రధాని తెలిపారు. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికి ముందే స్పష్టమైన దృక్కోణంతో చాలా ప్రిపేర్ అయ్యారని వివరించారు. బలమైన నిర్ణయాలు స్వతంత్రంగా తీసుకోగల నాయకుడు ట్రంప్ అని పొగుడుతూ.. ఈ సారి తన టీమ్ కూడా శక్తివంతంగానే ఉన్నదని తెలిపారు. ట్రంప్, తనకు మధ్య ఓ స్పష్టమైన పోలిక ఉన్నదని, తామిద్దరికీ స్వదేశమే ఫస్ట్ ప్రయారిటీ అని, తాను ఏ నిర్ణయం తీసుకున్నా.. అది దేశానికి ఏ మేరకు ప్రయోజనకరంగా ఉంటుందనేది తొలిగా చూసుకుంటానని వివరించారు. ఈ సందర్భంగా 2019లో హూస్టన్ నగరంలో నిర్వహించిన హౌడీ మోడీ కార్యక్రమాన్ని గుర్తు చేసుకున్నారు. తాను వేదిక మీది నుంచి మాట్లాడుతుంటే ట్రంప్ ప్రేక్షకుల మధ్య కూర్చుని ఆలకించారని, అది తనకెంతో విలువైన క్షణమని వివరించారు. ఆ తర్వాత తనతోపాటుగా అక్కడి ప్రజల మధ్యకు రావాలని కోరగా.. క్షణమైనా ఆలోచించకుండా సెక్యూరిటీని పక్కనపెట్టారని, తన ప్రతిపాదనను స్వీకరించారని, ఇది ట్రంప్ తనకు ఇచ్చే ప్రయారిటీ అని పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యానికి విమర్శే ఆత్మ
భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశమని నరేంద్ర మోడీ వివరించారు. ప్రజాస్వామ్యానికి విమర్శే ఆత్మ అని, ఆ విమర్శ పదునుగా, సమాచారయుక్తంగా ఉండాలని తెలిపారు. అలాంటి విమర్శలతోనే పాలన సుపరిపాలనగా మారుతుందని, ప్రజలకు ఉపకరిస్తుందని చెప్పారు. గత లోక్‌సభ ఎన్నికల్లో 98 కోట్ల మంది ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని, ఈ సంఖ్య ఉత్తర అమెరికా, ఐరోపా సమాఖ్యల ఉమ్మడి జనాభా కంటే కూడా ఎక్కువ అని వివరించారు. తమ దేశంలో ప్రతి ఒక్క ఓటుకు ఒకే విలువ ఉంటుందని, ఆ ఓటు కోసం అన్ని రకాల ఏర్పాటు చేస్తామని, గుజరాత్ గిర్ ఫారెస్ట్‌లో ఒక్క ఓటు కోసం ప్రత్యేకంగా ఒక పోలింగ్ బూత్‌నే ఏర్పాటు చేసినట్టు వివరించారు. తాను 140 కోట్ల మంది ప్రజల ప్రతినిధి అని, అంతర్జాతీయ నాయకుడితో తాను కరచాలనం చేశానంటే.. అది తన కరచాలనం కాదని, 140 కోట్ల మంది భారతీయుల కరచాలనం అని వివరించారు.