కష్టపడి కాదు... ఇష్టపడి చదవండి..: మెదక్ ఎంపీ

by Aamani |
కష్టపడి కాదు... ఇష్టపడి చదవండి..: మెదక్ ఎంపీ
X

దిశ,మిరుదొడ్డి : విద్యార్థిని, విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని, ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని ఎంచుకొని, లక్ష్యసాధనలో ముందుకు సాగాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. సోమవారం మిరుదొడ్డి మండల కేంద్రంలో సంకల్ప్ సేవా ఫౌండేషన్ మరియు ఎస్ఆర్కే ట్రస్ట్ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష సామగ్రి పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..స్వామి వివేకానందుడు చెప్పినట్లుగా ఒక దేశ భవిష్యత్తు నాలుగు గోడల మధ్య నిర్ణయించబడుతుందని, ఆ నాలుగు గోడలే తరగతి గది అని అన్నారు. వివేకానందుని అడుగుజాడల్లో నడిచి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. విద్యార్థి భవిష్యత్తు అనేది పదవి తరగతి లోనే నిర్ణయించబడుతుంది కాబట్టి, పరీక్షల సమయంలో స్మార్ట్ ఫోన్లకు, సామజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలని, బలవంతపు చదువులు చదవకుండా, ఏకాగ్రతతో చదివి 100 శాతం ఉత్తిర్ణత సాధించాలన్నారు.

విద్యార్థినిలు.. సునీత విలియమ్స్, మేరీకోమ్, నిఖత్ జరీన్, ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది మూర్ము, అత్యంత చిన్న వయసులోనే సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదివి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మాలావత్ పూర్ణ లను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని అన్నారు. తల్లిదండ్రుల తరువాత గురువులే మార్గ నిర్దేశం చేసేవారు కాబట్టి గురువులను గౌరవించాలన్నారు. అనంతరం మిరుదొడ్డి రైతులు స్థానిక నాగయ్య వాగుపై బ్రిడ్జి నిర్మించాలని ఎంపీకి వినతి పత్రం అందించగా సానుకూలంగా స్పందించి బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేస్తానని అన్నారు. అలాగే అద్దె గదుల్లో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రాలకు శాశ్వత భవనాలు నిర్మించాలని ఎంపీ కి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో దక్షిణ మధ్య క్షేత్ర, ధర్మ జాగరణ మంత్రి అమర్ లింగం, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్, బిజెపి మిరుదొడ్డి మండల పార్టీ అధ్యక్షుడు జిగిరి అమర్, బీజేపీ సీనియర్ నాయకులు, మండల విద్యాధికారి ప్రవీణ్ బాబు, ట్రస్టు నిర్వాహకులు, మండల పరిధిలోని ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Next Story