- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
గ్రూప్స్ పేపర్లను రీవాల్యూయేషన్ చేయాలి: ఎమ్మెల్సీ కవిత

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రూప్స్ పరీక్షల పేపర్లను రీవాల్యూవేషన్ చేయాలని, అభ్యర్థులు అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నారని, వాటిని ప్రభుత్వం, పబ్లిక్ సర్వీస్ కమిషన్ నివృత్తి చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. సోమవారం శాసన మండలిలో మాట్లాడుతూ గ్రూప్స్ పరీక్షలు రాసిన విద్యార్థులు పలు అనుమానాలు లేవనెత్తుతూ తెలంగాణ విద్యార్థుల జేఏసీ విద్యార్థులు తనకు పిటిషన్ అందించారని తెలిపారు. గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ జాబితాను వెల్లడించకపోవడం నోటిఫికేషన్ నిబంధనలకు విరుద్ధమని ఎత్తిచూపారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలకు వేర్వేరు హాల్ టికెట్ నెంబర్లు కేటాయించడంతో కూడా విద్యార్థులు అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నారని సభ దృష్టికి తీసుకొచ్చారు. కేటగిరీ వారీగా వెబ్ నోట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రెండు మూడు రోజుల క్రితం వెబ్ నోటి పెట్టి మళ్లీ తొలగించారని, దీంతో విద్యార్థుల అనుమానాలు బలపడుతున్నాయని వివరించారు. గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలకు దాదాపు 5 లక్షల మంది దరఖాస్తు చేస్తున్నారని, అందులో 2.3 లక్షల మంది పరీక్షలు రాశారని తెలిపారు. 13315 ఓఎంఆర్ షీట్లు ఇన్వాలిడ్ అయ్యాయని పబ్లిక్ సర్వీస్ కమిషన్ చెబుతోందని, కానీ అందుకు కారణం చెప్పకపోవడం తో విద్యార్థుల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారన్నారు. కమిషన్ విడుదల చేసిన ప్రాథమిక కీ కి ఫైనల్ కీ కి చాలా వ్యత్యాసాలు ఉన్నాయని, దాంతో మార్కులు తగ్గి ఉద్యోగావకాశాలకు గండి పడిందని తెలిపారు. తెలుగు మీడియం అభ్యర్థుల విషయంలోనూ అన్యాయం జరిగిందని అంటున్నారని, ముఖ్యంగా తెలుగు రాని అధ్యాపకులు పేపర్లు దిద్దడంతో ట్రాన్స్ లేషన్ సమస్య ఏర్పడి మార్కులు తక్కువ వచ్చాయన్నారు. గ్రూప్ 4 విషయంలోనూ అనుమానాలను అభ్యర్థులు వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. లోకల్, నాన్ లోకల్ ఆప్షన్ లేదని, దాంతో మల్టీజోన్ లో ఎక్కడ నియామకాలు చేపడుతారో స్పష్టత ఇవ్వలేదని తెలిపారు.