ఈ-స్లాట్ తో రిజిస్ట్రేష‌న్ ప్రక్రియ మరింత సులువు : మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి

by M.Rajitha |
ఈ-స్లాట్ తో రిజిస్ట్రేష‌న్ ప్రక్రియ మరింత సులువు : మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రస్తుతం ఒక డాక్యుమెంట్ రిజిస్ట్రేష‌న్ కు క‌నీసం 45 నిముషాల నుంచి గంట‌కు పైగా స‌మ‌యం ప‌డుతుంద‌ని, ఈ స్లాట్ బుకింగ్ విధానం ద్వారా ప‌ది నుంచి 15 నిముషాల‌లోనే రిజిస్ట్రేష‌న్ ప్రక్రియ పూర్తవుతుంద‌ని రెవెన్యూ ,హౌసింగ్, స‌మాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి తెలిపారు. ఈ స్లాట్‌బుకింగ్ విధానాన్ని ఏప్రిల్ మొద‌టివారంలో పైల‌ట్ ప్రాజెక్ట్ కింద కొన్ని స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లో అమ‌లుచేయ‌బోతున్నామ‌ని వెల్లడించారు. స‌చివాల‌యంలో స్టాంప్స్ రిజిస్ట్రాష‌న్ శాఖపై స‌మీక్షా స‌మావేశం సోమ‌వారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ . నిషేధిత జాబితాలో ఉన్న గజం స్థలం రిజిస్ర్టేషన్ చేసిన కఠిన చర్యలు తప్పవని సబ్ రిజిస్ర్టార్లను హెచ్చరించారు. భూ భార‌తి త‌ర‌హాలో ప్రత్యేకంగా ఒక పోర్టల్‌ను ఏర్పాటు చేసి నిషేధిత ఆస్తుల‌ వివ‌రాల‌ను అందులో పొందుప‌ర‌చి రెవెన్యూశాఖ‌కు అనుసంధానం చేయాల‌ని సూచించారు.

డాక్యుమెంట్ రిజిస్ట్రేష‌న్ కోసం సామాన్యులు నిరీక్షించే ప‌రిస్ధితి లేకుండా సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని ఉప‌యోగించి స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల‌ను ఆధునీక‌రిస్తున్నామ‌ని ప్రకటించారు. ఆర్టిఫీషియ‌ల్ ఇంటిలిజెన్స్‌, చాట్ బోట్స్ సేవ‌ల‌ను వినియోగించుకోవాల‌ని సూచించారు. ల‌క్షలాది కుటుంబాల‌కు మేలుచేసే ఎల్.ఆర్.ఎస్. ప్రక్రియ‌ను మ‌రింత వేగ‌వంతం చేయాల‌ని అధికారుల‌కు సూచించారు. జిల్లా రిజిస్ట్రార్‌లు ద‌ర‌ఖాస్తుల‌ను పెండింగ్‌లో పెట్టకూడ‌దని తెలిపారు. ఎల్ ఆర్ ఎస్ కోసం ప్రజ‌లు రెండు మూడు సంవ‌త్సరాల నుంచి ఎదురు చూస్తున్నార‌ని వారి ఆవేద‌న అర్ధం చేసుకొని నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా ద‌ర‌ఖాస్తులు ప‌రిష్కరించాలన్నారు. కానీ త‌ప్పుచేసి ప్రజ‌ల‌ను ఇబ్బంది పెట్టే ప్రయ‌త్నం చేయ‌వ‌ద్దని హిత‌వు ప‌లికారు. జిల్లా సబ్ రిజిస్ట్రార్లు ఆఫీసుకే ప‌రిమితం కాకుండా ప్రతివారం స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల‌ను సంద‌ర్శించాల‌ని ఆదేశించారు.

Next Story