రేప్ కేసులో నిందితుడి భార్యకు బీజేపీ టికెట్

by Shamantha N |
రేప్ కేసులో నిందితుడి భార్యకు బీజేపీ టికెట్
X

లక్నో : దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఉన్నావో లైంగికదాడి కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ భార్యకు బీజేపీ టికెట్ ఇచ్చింది. త్వరలో జరగనున్న జిల్లా పరిషత్ ఎన్నికలలో ఆమె పోటీ చేయనున్నారు. ఈ మేరకు కుల్దీప్ భార్య సంగీతకు టికెట్ కన్ఫర్మ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర శాఖ చేసిన ప్రకటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంగీత ఉన్నావో జిల్లా పంచాయత్ చైర్ పర్సన్‌గా ఉన్నారు. మైనర్ పై లైంగికదాడికి పాల్పడ్డారనే ఆరోపణతో సెంగార్ రెండేళ్లుగా జైళ్లో ఉన్న విషయం తెలిసిందే. సెంగార్ పై ఆరోపణలు వెల్లువెత్తిన తర్వాత బీజేపీ ఆయనను పార్టీ నుంచి బహిష్కరించగా.. అసెంబ్లీలో సభ్యత్వం కూడా కోల్పోయారు. కాగా.. తాజాగా ఆయన భార్యకు ఉన్నావ్ జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఫాతేపూర్ చౌరాసీ నుంచి బీజేపీ టికెట్ ఇచ్చింది. 2016 లో ఆమె జిల్లా పరిషత్ చైర్మన్‌గా గెలుపొందడం గమనార్హం. సంగీతకు పార్టీ టికెట్ ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో బీజేపీ ఎంపీ, రాజ్యసభలో ఆ పార్టీ చీఫ్ విప్ శివ ప్రతాప్ శుక్లా స్పందిస్తూ.. అందులో తప్పేం ఉందని ప్రశ్నించారు. సుదీర్ఘ చర్చల అనంతరమే కుల్దీప్ సింగ్ సెంగార్ భార్యకు బీజేపీ టికెట్ ఇచ్చామని తెలిపారు. ఆమెకు ప్రజాదరణ ఉందోలేదో చూడాలే తప్ప… నేరస్తుడి భార్య కాబట్టి టికెట్ ఇవ్వకూడదా..? అని ప్రశ్నించారు.

Advertisement

Next Story