- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉత్కంఠకు తెర.. నిజామాబాద్ ఎమ్మెల్సీ బరిలో కవిత
దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి పోటీపై ఉత్కంఠకు తెర పడింది. నామినేషన్ల ప్రక్రియ గడువు మరో 24 గంటలు ఉండగా అధికార పార్టీ అభ్యర్థి ప్రకటన తీవ్ర ఉత్కంఠకు తెర లేపింది. అందుకు కారణం ఇక్కడి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న కల్వకుంట్ల కవిత ఈసారి బరిలో నిలుచుండడం లేదని, రాజ్యసభకు వెళ్తారని ఊహగానాలు చెలరేగాయి. ఇటీవల రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీకి ఎదురు దెబ్బలు తగిలిన నేపథ్యంలో రాజకీయ సమీకరణాల కారణంగా కవిత పెద్దల సభకు వెళ్తారని ప్రచారం జరిగింది. ఎంపీగా ఓటమి, ఎమ్మెల్సీ ఉప ఎన్నికల తర్వాత మంత్రి పదవి ఆశించిన కవితకు పదవీకాలం ముగిసినా ఆశమాత్రం నెరవేరలేదు. తాజాగా.. ఇటీవల రాష్ట్రంలో ఖాళీ అయిన గవర్నర్ కోటా, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికను ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి చేశారు. అయితే నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవీకాలం జనవరి 4కు ముగియనుండగా జరుగనున్న ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఖరారును సీఎం కేసీఆర్ ఆలస్యం చేశారు.
ఆదివారం ఢిల్లీ వెళ్తూ రాష్ట్రంలోని అన్ని స్థానాల అభ్యర్థులను ఖరారు చేస్తూ అందుకు సంబంధించిన సమాచారాన్ని మీడియాకు అందించారు. పార్టీ ప్రకటించిన జాబితాలో ఎమ్మెల్సీ కవిత స్థానంలో మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత పేరు వచ్చింది. దాంతో రాజకీయ వర్గాల్లో ఈ అంశం మరింత చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్సీగా ఆకుల లలితనే పోటీ చేస్తారని కవిత ఢిల్లీ రాజకీయాలకు వెళ్లడం ఖాయమన్న సంకేతాలు వెళ్లాయి. రాష్ట్రంలో ఆదివారం ప్రకటించిన అభ్యర్థులు సోమవారం నామినేషన్ దాఖలు చేయడానికి సమాయత్తం కాగా, నిజామాబాద్ ఎమ్మెల్సీగా ప్రచారంలోకి వచ్చిన ఆకుల లలితకు మాత్రం పూర్తి సమాచారం అందలేదని తెలిపింది. మీడియా ద్వారానే తన పేరు వచ్చిందని, సీఎంవో కార్యాలయం నుంచి గానీ, పార్టీ నుంచి గానీ ఆకుల లలితకు నామినేషన్ వేయాలని, బీఫాం అందజేయాలని ఆదేశాలు అందలేదని స్పష్టం చేసింది. దాంతో ఆకుల లలిత పార్టీ పెద్దలను కలిసి తన రాజకీయ భవితవ్యంపై ఆరా తీశారు. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ మధ్యాహ్నం తర్వాత సీన్ మారింది. మళ్ళీ ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవితనే బరిలో దిగుతారని సమాచారం అందింది. అందుకనుగుణంగానే నిజామాబాద్‌లో ఎమ్మెల్సీ కవిత అనుచరులు మంగళవారం కవితక్క నామినేషన్ వేస్తారని ప్రచారం ముమ్మరం చేశారు. అధికారికంగా ఉత్తర్వులు రాకపోయినప్పటికీ ఎమ్మెల్సీ కవిత కార్యాలయం నుంచి కూడా కవితనే ఎమ్మెల్సీగా బరిలో ఉంటారని వెల్లడించారు. అంతే కాకుండా మంగళవారం కవిత నామినేషన్ ప్రక్రియలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి వేసేందుకు సమాయాత్తం అయ్యారు. ఎమ్మెల్సీ అభ్యర్తిగా కవితను ప్రకటించారని నేతలు శుభాకాంక్షలు చెప్పడం విశేషం.
ఎమ్మెల్సీ స్థానంపై గంపెడాశలు పెట్టుకున్న ఆకుల లలిత ఆశలు అడియాశలయ్యాయి. ఎమ్మెల్సీగా ఆకుల లలితకు పోటీ చేస్తారని ఇచ్చిన లీకులు గంటల వ్యవధిలోనే తారుమారయ్యాయి. ఆదివారం బరిలో ఉంటుందని ప్రచారం జరిగినా సోమవారం వరకు అందులో ఎలాంటి పురోగతి లేకపోవడం మధ్యాహ్నం తర్వాత కవిత బరిలో ఉంటారని ప్రచారం జోరందుకుంది. ఎమ్మెల్సీగా తన స్థానం రెన్యూవల్ అవుతుందని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటారని గవర్నర్ కోటాలోనో లేదా ఎమ్మెల్యే కోటాలోనో స్థానం దక్కుతుందని లలిత ఆశపడింది. చివరకు ఆమెకు భంగపాటు తప్పలేదు. చివరికి ఎమ్మెల్సీ కోసం చివరివరకూ ప్రయత్నించినా సక్సెస్ కాలేదు. ప్రస్తుతానికి పదవులు లేకపోయినా ఏదో ఒక నామినేటెడ్ పదవి ఇచ్చి ఆకుల లలితను ఖుషీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. అధికార టీఆర్ఎస్ పార్టీలో ఎప్పుడు ఏదైనా జరుగొచ్చని ప్రచారం జరుగుతుంది.
ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవమేనా?
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియలో కీలకమైన నామినేషన్‌ల దాఖలు ఆలస్యం అవుతుండటంతో ఎన్నికలు ఏకగ్రీవమేనా అన్న సందేహలు వ్యక్తం అవుతున్నాయి. మంగళవారం నామినేషన్ల గడువు ముగియనుండగా అధికార పార్టీ మినహా ఏ పార్టీ కూడా పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. మంగళవారం ఎమ్మెల్సీగా కవిత నామినేషన్ వేయడం ఖరారైంది. కానీ కాంగ్రెస్, బీజేపీలు మాత్రం పోటీ చేస్తాయన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 820 మంది ఓటర్లు ఉన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్‌కు 720, కాంగ్రెస్‌కు 44, బీజేపీకి 54 మంది ఓటర్లు ఉన్నారు. గడిచిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పోటీ చేయగా రెండు పార్టీలకు సంబంధించిన సుమారు 200 మంది ఓటర్లు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. దీంతో పోటీ చేసినా రెండు పార్టీల అభ్యర్థులకు డిపాజిట్లు దక్కలేదు. కవిత ఎమ్మెల్సీగా బంపర్ మెజార్టీతో గెలుపొందారు. ఈసారి తగినంత సంఖ్యాబలం లేనందున ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయబోమని బీజేపీ ఆదివారం ప్రకటన జారీ చేసింది. కాంగ్రెస్ పోటీపై ఆందోళన పడుతోంది. మంగళవారం వరకు ఆ పార్టీ నుండి కామారెడ్డి జిల్లాకు చెందిన వారు పోటీ చేస్తారా? లేదా? తప్పుకుంటే మాత్రం ఎన్నికలు ఏకగ్రీవమే. ఎంపీటీసీల సంఘం నుండి నామినేషన్లు దాఖలు చేస్తారని, అందుకు అనుగుణంగా సోమవారం నామినేషన్ల పత్రాలను తీసుకెళ్లినట్లు ప్రచారం జరిగినా నామినేషన్ల విత్ డ్రా వరకు పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఒకవేళ ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవమైతే 2020లో జరిగిన ఉప ఎన్నిక మాదిరి ఓటర్లకు తాయిలాలు, క్యాంపు రాజకీయాలకు అవకాశం ఉండదు. ఇది లోకల్ బాడీ ఓటర్లకు షాక్ అని చెప్పవచ్చు.