కొత్త సంవత్సరంలో కొవిడ్ అంతం కావాలి : గవర్నర్

by Anukaran |
Ugadi celebrations at Raj Bhavan
X

దిశ, తెలంగాణ బ్యూరో : కొత్త సంవత్సరంలో కొవిడ్ అంతం కావాలని, ప్రజలంతా ఆరోగ్యంతో, సిరి సంపదలతో సంతోషంగా ఉండాలని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఆకాంక్షించారు. రాజ్ భవన్ లో జరిగిన శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది వేడుకలల్లో గవర్నర్ పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా నివసిస్తున్న తెలుగు ప్రజలందరికీ తెలుగు నూతన సంవత్సరాది శుభాకాంక్షలు తెలిపారు. తెలుగువారి సంప్రదాయం ప్రకారం ఉగాది పచ్చడిని, బెల్లంతో చేసిన ఇతర సంప్రదాయ వంటకాలను గవర్నర్ స్వయంగా తన అధికారిక నివాసంలో తయారుచేయించి అతిథులకు వడ్డించారు.

ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ప్లవ నామ సంవత్సరం బుద్ధిని, విజ్ఞానాన్ని సూచిస్తుందని, ఈ కొత్త సంవత్సరం తెలుగు ప్రజల జీవితాలలో గొప్ప శుభాలను కలుగజేయాలని అభిలాషించారు. పుదుచ్చేరిలో లెఫ్టినెంట్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు రాష్ట్రపతి పాలన సమయంలో నిర్వహించాల్సి వస్తుందని, అయినప్పటికీ, తన మనసులో, ఆలోచనల్లో తెలంగాణ ప్రజల బాగోగులు ఎప్పుడూ ఉంటాయని ఆమె తెలిపారు. పుదుచ్చేరి కోసం తాను అదనపు వ్యాక్సిన్ ల కోసం, రెమిడి సివిర్ ఇంజెక్షన్ ల కోసం అడిగిన ప్రతిసారీ తెలంగాణకు కూడా అదనపు వ్యాక్సిన్లు, రెమిడి సివిర్ ఇంజక్షన్లు తెప్పించే ప్రయత్నం చేస్తున్నానని చెప్పారు.

న్యూట్రిషనల్ ఇంటర్వెన్షన్ ప్రారంభం

ఆదిమ జాతి గిరిజన ప్రజలలో పోషకాహారాన్ని పెంపొందించడానికి చేపట్టిన న్యూట్రిషనల్ ఇంటర్వెన్షన్ కార్యక్రమాన్ని ఉగాదిని పురస్కరించుకొని గవర్నర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమం అమలుకు, సమన్వయం చేయడానికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులకు 8.6 లక్షల రూపాయల చెక్ ను అందజేశారు. అనంతరం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సైంటిస్టులు, రెడ్ క్రాస్ ప్రతినిధులు, ఇఎస్ఐ కళాశాల డాక్టర్లు, ట్రై ఫెడ్ అధికారులతో ఈ న్యూట్రిషనల్ ఇంటర్వెన్షన్ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఆదిమ జాతి గిరిజనుల పోషకాహారంతో పాటు, జీవనోపాదులు, ఆరోగ్యం కూడా పెంపొందించడానికి కృషి చేయాలని గవర్నర్ సూచించారు.

వస్త్ర డిజైన్లను పరిశీలించిన గవర్నర్

రాజ్ భవన్ పరివారం మహిళలు తయారుచేసిన వస్త్ర డిజైన్లను గవర్నర్ పరిశీలించారు. డిజైన్లు కొత్త ట్రెండ్ ను సృష్టించే విధంగా ఉన్నాయని, చాలా సృజనాత్మకంగా ఉన్నాయని అభినందించారు. మరిన్ని డిజైన్ లు తయారు చేయడానికి, మార్కెటింగ్ ద్వారా ఉపాధి అవకాశాలు పెంపొందించుకోవడానికి రా మెటీరియల్ కొనుగోలుకు గవర్నర్ రూ. 50 వేల చెక్ ను అందజేశారు. రాజ్ భవన్ లో పనిచేస్తున్న భవానీ అనే ఉద్యోగిని పెరాలసిస్ తో బాధపడుతున్న విషయం తెలుసుకున్న గవర్నర్ వైద్య ఖర్చుల కోసం రూ. 25 వేల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో సెక్రటరీ టు గవర్నర్ కె సురేంద్రమోహన్, గవర్నర్ సలహాదారులు, జాయింట్ సెక్రటరీ లు, ఇతర ఉన్నతాధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed