పరిహారం.. ఫలహారం! చాత్రాజ్‌పల్లిలో పుట్టగొడుగుల్లా వెలిసిన ఇండ్లు

by Shiva |
పరిహారం.. ఫలహారం! చాత్రాజ్‌పల్లిలో పుట్టగొడుగుల్లా వెలిసిన ఇండ్లు
X

దిశ, మల్హర్: మల్హర్​ మండల పరిధిలోని తాడిచెర్ల పంచాయతీ పరిధిలోని చాత్రాజ్‌పల్లి గ్రామంలో పరిహారం కోసం అక్రమార్కులు అక్రమ నిర్మాణాలు చేపట్టారు. పుట్టగొడుగుల్లా వెలిసిన ఇళ్లకు పంచాయతీ అధికారులు మామూళ్లు తీసుకుని అక్రమంగా ఇంటి నెంబర్లు కేటాయించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాడిచర్ల బ్లాక్-1 జెన్కో ఓసీపీలో బొగ్గు నిక్షేపాలు వెలికి తీస్తున్న ఏఎమ్మార్ ప్రైవేట్ సంస్థ ఉపరితల గనుల విస్తరణలో భాగంగా ఓసీపీ-2 చాత్రాజ్‌‌పల్లి వైపు మళ్లీ ఇస్తారనే కోణంలో ముందస్తుగా జెన్కో ఆర్‌అండ్‌ఆర్, నష్ట పరిహారం ప్యాకేజీని కాజేసేందుకు అక్రమార్కులు అక్రమ దందాకు తెర లేపారు. విచ్చలవిడిగా గ్రామంలో ఇండ్ల నిర్మాణాలు చేపట్టారు. అక్రమంగా నిర్మించిన ఇంటికి గ్రామ పంచాయతీ రికార్డులో నమోదు చేసి ఇంటి నంబర్ కోసం ఒక్కో ఇంటికి రూ.40-50 వేలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కాగా, గ్రామంలో పట్టా భూమి ఉన్న అది వ్యవసాయ భూమిగా ఉండి రైతులు వ్యవసాయం చేస్తున్నారు. కానీ, పూర్వీకులు ఇండ్లు నిర్మించిన ఈ గ్రామం 26/1 సర్వే నంబర్ లావణి భూమి రికార్డుగా ఉంది. అయితే, సర్వే నెం.26 గల భూమి అటవీ శాఖకు చెందినట్లుగా రికార్డులో ఉన్నట్లు అటవీ శాఖ అధికారులకు, ఈ గ్రామ ప్రజలకు ఎన్నోసార్లు ఇంటి నిర్మాణాల జాగాల కోసం పోరు జరిగిన విషయం తెలిసిందే. అంతేకాక కొందరు రాజకీయ నాయకులు సర్వే నెం.26 గల భూమి లావణి పట్టా అంటూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధికారుల అండదండతో అక్రమంగా వందలాదిగా పట్టా పాస్ బుక్కులు చేయించి బ్యాంకుల్లో క్రాప్ లోన్ తీసుకొని చలామణి అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే, 1986 సంవత్సరం నుంచి పంచాయతీ రికార్డు ప్రకారం ఈ గ్రామంలో 30 ఇళ్లు ఉండగా కుటుంబ సభ్యుల లెక్కల ప్రకారం 48 ఇండ్లు ఉన్నట్లు తెలిసింది. అక్రమంగా నష్ట పరిహారం పొందేందుకు అక్రమార్కులు నిర్మించిన ఇళ్లు 300 పైచిలుకుగా ఉన్నట్లు తెలిసింది. ఇంటి నిర్మాణానికి ఒక గుంట స్థలానికి రూ.60-80 వేలకు కొనుగోలు చేసి దర్జాగా ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు.

కాపురంలో పరిహారం వచ్చింది.. చాత్రాజ్‌పల్లిలో రాదా?

ఆదివాసీ గిరిజన గ్రామం కాపురంలో ఆదివాసులే కాకుండా కొందరు అక్రమంగా ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు నష్ట పరిహారం, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ అధికారులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఓసీపీ ప్రాజెక్ట్ ప్రారంభ దశలో తాడిచెర్ల గ్రామం జెన్కో, రెవెన్యూ అధికారులు చేసిన సర్వేలో 1,088 ఇండ్లు ఉండగా ఇప్పుడు రెండువేల పైచిలుకు అక్రమంగా ఇల్లు నిర్మించినా ఇళ్లకు రెవెన్యూ అధికారులు సర్వే చేసి జెన్కో నెంబర్లు కేటాయించ లేదా.? నష్ట పరిహారం, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ ఇవ్వడం లేదా మేం కడితే తప్పేందంటూ అక్రమార్కులు దర్జాగా ఇండ్ల నిర్మాణాలు చేపట్టడం గమనార్హం.

అక్రమ ఇళ్ల నిర్మాణాలపై అధికారుల చర్యలేవి!

ఎలాంటి అనుమతులు లేకుండా లావణి పట్ట భూముల్లో యథేచ్ఛగా అక్రమ ఇండ్ల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. అధికారుల చర్యలు లేక అక్రమ ఇళ్ల నిర్మాణాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. దీంతో తాడిచర్ల, చాత్రాజ్‌పల్లి గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలకు అధికారుల సహకారం ఉన్నట్లుగా సమాచారం. అక్రమంగా నిర్మించిన ఇళ్లకు జెన్కో సంస్థ పరిహారం చెల్లించాలంటే ప్రభుత్వ ఖజానాకు భారీ గండి పడే అవకాశం ఉన్నా.. రెవెన్యూ, జిల్లా అధికార యంత్రాంగం దృష్టి పెట్టకపోవడంలో ఆంతర్యం ఏంటనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అక్రమ ఇండ్ల నిర్మాణాల వెనుక అధికారుల అండదండలు, భారీ స్థాయిలో ముడుపులు అందినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఈ విషయంపై జిల్లా కలెక్టర్ స్పందించి పూర్తిస్థాయి విచారణ చేసి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుని అక్రమంగా చేపడుతున్న ఇండ్ల నిర్మాణాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది.

Advertisement

Next Story

Most Viewed