10 సంవత్సరాల్లో చేయలేనివి.. 10 నెలల్లో చేయిస్తున్నాం...

by Sumithra |
10 సంవత్సరాల్లో చేయలేనివి.. 10 నెలల్లో చేయిస్తున్నాం...
X

దిశ, ఆర్మూర్ : గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో చేయలేని ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధిని తమ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే చేసి చూపిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని పీవీఆర్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి వినయ్ రెడ్డి మాట్లాడారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీ హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నామని చెప్పారు. రుణమాఫీ మొదలుకొని, రైతు పండించిన సన్న రకం వడ్లకు క్వింటాలుకు 500 రూపాయల బోనస్ డబ్బులు 30 కోట్లను రైతుల ఖాతాల్లో జమచేసి రైతే రాజు అన్న మాటను నిజం చేస్తున్నామని చెప్పారు.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మొదలుకొని వంట గ్యాస్ 500 రూపాయలకే వచ్చేటట్లు సబ్సిడీ అందజేస్తున్నామని, నేరుగా వారి ఖాతాల్లో జమ అయ్యే విధంగా చూస్తున్నామని అన్నారు. ఇంకా కొన్నిచోట్ల రైతు రుణమాఫీకి సంబంధించిన తప్పిదాలను సరిచేస్తూ త్వరలోనే వారి ఖాతాలో రుణమాఫీ డబ్బులు వచ్చేటట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అధికారులతో సమీక్ష సమావేశాలు చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి, పార్టీ అధినాయకత్వం ఆదేశాల మేరకు డిసెంబర్ 9 వరకు జరిగే ప్రజా పాలన విజయోత్సవాలను ఊరు, వాడ ఘనంగా నిర్వహించేటట్లు ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. జిల్లాలో ఇప్పటివరకు వరి కొనుగోలు కేంద్రాల ద్వారా 4 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను కొనుగోలు చేసినట్లు చెప్పారు.

నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరి..

ఆర్మూర్ నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లికృష్ణారావుకు ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ తరపున వినయ్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి కావలసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తుందని, తనవంతుగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తూ అనారోగ్య కారణాలతో ఉన్నవారికి ఎల్ఓసి, సీఎం సహాయనిధి నిధులను మంజూరు చేయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. నియోజకవర్గంలో ఎక్కడ కూడా అవినీతి అక్రమాలు జరగకుండా చూస్తున్నామని, ఒకవేళ తన పేరును ఎక్కడైనా తప్పుగా వాడుకొని తన బంధువులు కానీ సన్నిహితులు కానీ పార్టీ నాయకులు ఎవరైనా ఉపేక్షించబోనని హెచ్చరించారు. తప్పును ప్రోత్సహించనని తప్పు చేసే వారిపై చర్యలు తప్పవని ఆయన చెప్పారు. ఇప్పటివరకు పెర్కిట్- కోటార్ మోర్ జాతీయ రహదారి 63 పక్కన ఉన్న 9 గుంటల ప్రభుత్వ స్థలంతో పాటు, కోటార్మూర్ 202 సర్వే నంబర్ లోని ఒక ఎకరం 7 గుంటల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని బోర్డులు ఏర్పాటు చేశామని, అలాగే ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రం లోని జర్నలిస్టు కాలనీ సర్వేనెంబర్ 401/66 లో ఉన్న ప్రభుత్వ భూమిని కూడా గుర్తించి స్వాధీనం చేసుకుంటామన్నారు. అతి త్వరలో కబ్జాలకు గురైన ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామని పునరుద్ఘాటించారు.

ఎమ్మెల్యే సొంత డబ్బా కొట్టుకోవడం మాని కేంద్ర నిధులు తేవాలి..

ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సొంత డబ్బా కొట్టుకోవడం మానుకోవాలని ఆయన సూచించారు. ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులు తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిగా తనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారని గుర్తు చేశారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం తాను సీఎంతో పాటు మంత్రులను కలిసానని, కానీ తన మూలాన ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరైనట్లు ఎమ్మెల్యే సొంత డబ్బా కొట్టుకోవడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు. అవసరమైతే కేంద్రంలో ఉన్న బిజేపీ నుండి స్థానిక నిజామాబాద్ ఎంపీ నిధుల్లోంచి ఆర్మూర్లో ఉన్న చాలా గ్రామాల్లో రోడ్డు వసతులు సరిగా లేవని నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు తీసుకొరావాలని, కేంద్రీయ విద్యాలయాన్ని ఆర్మూర్ నియోజకవర్గానికి మంజూరు చేయించాలని హితవుపలికారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చే నిధులు కాకుండా కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు తీసుకువచ్చి నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. శాసనసభ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే ఇచ్చిన హామీలు నియోజకవర్గంలో తన సొంత నిధుల నుండి ఒక్కొక్క గ్రామానికి 10 ఇళ్ల చొప్పున ఇండ్లు నిర్మించి ఇస్తానన్న మాట ఎటు పోయిందని, ఒక రూపాయి వైద్యం ఎక్కడ ఉందని ప్రశ్నించారు.

జిల్లా బీఆర్ఎస్ అధ్యక్ష పదవి కూడా త్వరలో ఖాళీ..

నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్ష పదవి నుండి త్వరలోనే మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అవుట్ అవుతారని వినయ్ రెడ్డి వ్యంగంగా ఆరోపణలతో చమత్కరించారు. ఆర్మూర్ నియోజకవర్గం నుండి ఎలాగో ప్రజలు ఆయనను సాగనంపారు, త్వరలో కూడా పార్టీ జిల్లా అధ్యక్ష పదవి నుండి కూడా సాగణంపుతారని చమత్కరించారు. నియోజకవర్గంలో వేల ఎకరాల్లో ఉన్న ప్రభుత్వ అసైన్డ్ భూములు గడిచిన 10 సంవత్సరాలలో మాజీ ఎమ్మెల్యే హయాంలో కనుమరుగైపోయాయని, ఇప్పుడు కనీసం 50 ఎకరాలు కూడా ప్రభుత్వ భూమి వెతికిన కనబడడం లేదని అన్నారు. ప్రెస్ మీట్ లు పెట్టి అవాక్కులు చవాక్కులు పేల్చే మాజీ ఎమ్మెల్యే 10 సంవత్సరాలు నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి నోచుకోలేదని, కనీసం ఆయన పక్కన తిరిగేవారు కూడా ఎవరు బాగుపడ్డ దాఖలాలు లేవని అన్నారు. ఈ సమావేశంలో ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండలాల అధ్యక్షులు చేపూర్ ఎస్.కె చిన్నారెడ్డి, ముక్కెర విజయ్, మంద మహిపాల్, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed