ఐపీఎల్‌కు చాన్సివ్వండి : యూఏఈ

by Shyam |
ఐపీఎల్‌కు చాన్సివ్వండి : యూఏఈ
X

దిశ, స్పోర్ట్స్: ప్రపంచ క్రికెట్‌లో అత్యంత ధనిక బోర్డు అయిన బీసీసీఐకి ఎక్కువ ఆదాయాన్ని తీసుకొచ్చేది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అన్న విషయం తెలిసిందే. భారత జట్టు ఏడాదంతా క్రికెట్ ఆడితే వచ్చే ఆదాయం కన్నా.. బీసీసీఐ ఐపీఎల్ ద్వారా సంపాదించేదే ఎక్కువ. అందుకే గతంలో రెండు సార్లు ఐపీఎల్ నిర్వహణకు ఆటంకాలెదురైనా.. రద్దు చేయకుండా విదేశీ వేదికలపై నిర్వహించారు. కరోనా సంక్షోభం కారణంగా ఐపీఎల్‌ సీజన్-13ను నిరవధికంగా వాయిదా వేయగా.. ఈ సారి ఐపీఎల్ నిర్వహించే అవకాశం తమకు ఇవ్వమని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) క్రికెట్ బోర్డు బీసీసీఐని కోరుతోంది. ప్రస్తుతం రద్దయిన ఐపీఎల్‌కు సరైన వేదిక యూఏఈనే అని బోర్డు చెబుతోంది. గతంలో శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా ఇదే ప్రతిపాదన చేసినప్పటికీ బీసీసీఐ సానుకూలంగా స్పందించలేదు. 2014లో సార్వత్రిక ఎన్నికల కారణంగా ఐపీఎల్ తొలి అర్థభాగంలోని 20 మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించారు. అలాగే 2009లోనూ ఎన్నికల కారణంగా పూర్తి సీజన్ దక్షిణాఫ్రికాలో నిర్వహించారు. దీంతో గత అనుభవాల దృష్ట్యా ఈ సారి తమకు అవకాశం ఇవ్వమని యూఏఈ కోరుతోంది.

ఈ ప్రతిపాదనపై బీసీసీఐ ట్రెజరర్ అరుణ్ ధుమాల్ స్పందించారు. ‘ఐపీఎల్ నిర్వహణకు యూఏఈ ముందుకు వచ్చిన మాట వాస్తవమే. గతంలో కేవలం భద్రతా కారణాల వల్లే వేదికలు మార్చాం. కానీ ఇప్పుడు ప్రతీ దేశంలోనూ కరోనా మహమ్మారి పొంచి ఉంది. అంతర్జాతీయ ప్రయాణాలకు కూడా అనుమతి లేనందున ప్రస్తుతానికి ఏమీ స్పందిచలేం’ అన్నారు. మాకు ఆటగాళ్ల భద్రతే ముఖ్యమని, ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకునే పరిస్థితిలో లేదని ఆయన వెల్లడించారు.

Advertisement

Next Story