రెండు రాష్ట్రాలు.. ఒకేరోజు రెండు కీలక నిర్ణయాలు..!

by Shyam |
రెండు రాష్ట్రాలు.. ఒకేరోజు రెండు కీలక నిర్ణయాలు..!
X

దిశ, న్యూస్‌బ్యూరో: రెండూ వేర్వేరువే. ఒకదానితో మరొకటి ఏమాత్రం సంబంధం లేనివే. కానీ, రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కీలక నిర్ణయాలే. యాధృచ్ఛికంగా ఒకే రోజు వెలువడ్డాయి. ఆయా సర్కిళ్లలో టాక్ ఆఫ్ ది స్టేట్ అవుతున్నాయి. ఏపీ సీఎం జగన్ బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యపై దర్యాప్తు బాధ్యతల్ని ఆ రాష్ట్ర హైకోర్టు సీబీఐకి అప్పగించింది. వివేకా భార్య, కుమార్తె అప్పీలును రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం మన్నించింది. ఇన్వెస్టిగేషన్ పులివెందుల పీఎస్ నుంచే మొదలుపెట్టాలని నిర్దేశించింది. మూడుసార్లు ‘సిట్’ వేసినా, మర్డర్ కేసు కొలిక్కిరాని నేపథ్యంలో ఇక సీబీఐ రంగంలోకి దిగనుంది. ఈ పరిణామాన్ని సీఎం వైఎస్ జగన్ ఎట్లా చూస్తున్నారు? అనేది ఆసక్తికరమే.

ఇటు తెలంగాణలోనూ సరికొత్త రాజకీయ నిర్ణయం సంచలనమే అవుతున్నది. బీజేపీ స్టేట్ ప్రెసిడెంటుగా బండి సంజయ్‌ను ఆ పార్టీ నియమించింది. ప్రస్తుత ఎంపీ అయిన సంజయ్ చురుకైన లీడరుగా పేరొందారు. ఈ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నందున ఈ నియామకానికి మరింత ప్రాధాన్యం ఏర్పడింది. రాష్ట్ర కమల దళపతిగా 48 ఏండ్ల సంజయ్‌కి చాన్సు దక్కడం ఆ పార్టీ శ్రేణుల్లోనే కాదు, ఇతర పక్షాల్లోనూ చర్చకు వస్తున్నది. తెలంగాణ బీజేపీకి ‘బండి’ ఊహించిందే. లక్ష్మణ్‌ను మళ్లీ రెన్యువల్ చేస్తే, మరీ ఇంత జోరుగా డిస్కస్ జరిగేది కాదేమో!

అపోహలకు ‘రాం..రాం..’?

తెలంగాణలో అధికార టీఆర్ఎస్‌పై బీజేపీ ఉత్తుత్తి ఫైటే చేస్తున్నదనే అపవాదు ఉన్నది! బీజేపీ అంటే తెలంగాణలో జెస్ట్ ‘హైదరాబాద్ పార్టీ’ అనే ఒపీనియనూ లేకపోలేదు. (సికింద్రాబాద్‌తోపాటు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్‌లో ఎంపీ స్థానాలు గెలువడంతో ఈ అభిప్రాయం కొంత మారింది) ఒకే దెబ్బకు రెండు పిట్టల్లా.. సంజయ్‌కి పగ్గాలు అప్పగించడం ద్వారా ఈ రెంటికీ పువ్వు పార్టీ కేంద్ర నాయకత్వం తగిన సమాధానమిచ్చిందని భావిస్తున్నారు. బీజేపీకి తెలంగాణలో కేంద్రమంత్రి స్థాయి నేతలున్నా.. ఎందుకో టీఆర్ఎస్‌ హవాకు అడ్డుకట్ట వేయడంలేదనే అపప్రద నెలకొన్నది. హైదరాబాద్ కేంద్రంగా ఉండే కమలదళ కీలక లీడర్లు మొహమాటమో, మెత్త మెత్తగానో మెలుగుతున్నారనే అప్రకటిత అపకీర్తి మూట‌గట్టుకున్నారు. మీడియా‌ మటుకు అలంకారప్రాయమైన ఘాటు స్టేట్‌మెంట్లు ఇస్తారనే ఇంప్రెషనూ జతైంది. దీనికి తగ్గట్టుగానే సెంట్రల్ మినిస్టర్లు కూడా కేసీఆర్ పాలనకు ఆయా సందర్భాల్లో కితాబిచ్చారనే ప్రచారమూ బీజేపీ శ్రేణులకు మింగుడుపడలేదు. పైగా మొన్నటికి మొన్న అమెరికా పెద్దన్న ట్రంపుకిచ్చిన విందుకూ కేసీఆర్‌‌నే పిలిచారు. ఇట్లాంటి డెవలప్‌మెంట్లన్నీ..బీజేపీ, టీఆర్ఎస్ ప్రచ్ఛన్న దోస్తానాగా కొన్ని సెక్షన్ల మదిలో గట్టిగానే నాటుకుపోయింది. అయితే, సంజయ్‌కు బాధ్యతలు ఇవ్వడం ద్వారా అవన్నీ అపోహలే అన్నట్టుగా, వాటికిక రాం..రాం..చెప్పేయాలనే సంకేతాలిచ్చిందని విశ్లేషిస్తున్నారు.

ఎందుకంటే..ఇందుకే!

బండి సంజయ్‌ ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ నేపథ్యాలతో ఎదిగిన లీడర్. దూకుడు స్వభావం గలవారు. ధైర్యంగా, ఓపిగ్గా పోరాడగలరు. బీసీ అయిన ఆయన బడుగూ బలహీన వర్గాలకు అండగా నిలబడతారనే గుర్తింపు ఉన్నది. ఇసుక మాఫియాపై పోరాడిన నేరెళ్ల ఎస్సీ, బీసీ బాధితులకు జరిగిన ఘోర అన్యాయాన్ని మొదట సంజయే వ్యాప్తిలోకి తెచ్చారు. తొలినాళ్లలో తానే గళమెత్తారు. (ఆ వ్యవహారాన్ని తర్వాత తెలివిగా కాంగ్రెస్ హైజాక్ చేసిందనే వ్యాఖ్యానాలున్నాయి) మొన్నటికి మొన్న ఆర్టీసీ సమ్మె సందర్భంలోనూ కార్మికుడి మృతి అనంతరం ఆ కుటుంబం, కార్మిక వర్గం పక్షాన దృఢంగా నిలబడ్డారు. ఇట్లా అనేకం ఉన్నాయి. తెలంగాణలో రాబోయేది తమ ప్రభుత్వమేనని అమిత్‌షా వంటి బీజేపీ ఢిల్లీ దిగ్గజాలు చెబుతుంటారు. అందుకు తగ్గట్టుగానే ఈ ఎంపిక జరిగిందని అనలైజ్ చేస్తున్నారు. కాగా, ఉత్తర తెలంగాణకు, అందునా పూర్వ కరీంనగర్ జిల్లాకు ఇంతటి ప్రియారిటీ దక్కడం రెండోసారి. మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు 1998లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా చేశారు. 2దశాబ్దాల తర్వాత మళ్లీ ఇపుడు ఆ పోస్టు కరీంనగర్‌ను వెతుక్కుంటూ వచ్చింది.

కొసమెరుపు

యువ నేత కేటీఆర్ కాబోయే ముఖ్యమంత్రిగా ప్రాచుర్యంలోకి వచ్చారు. అదెప్పుడో ఏమో కానీ, తథ్యమనే వాళ్లున్నారు. 43ఏండ్ల కేటీఆర్‌కు బీజేపీ వైపు నుంచి సమఉజ్జీగా డైనమిక్ లీడర్ సంజయేనని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. టీఆర్ఎస్‌ను, కేసీఆర్, కేటీఆర్‌లనూ తగిన విధంగా ఎదుర్కోగలరని అంచనా వేస్తున్నాయి. మరి బండి సంజయ్ నియామకాన్ని కేసీఆర్, కేటీఆర్, టీఆర్ఎస్ యంత్రాంగం ఎట్లా చూస్తుందనేదీ ఇంట్రెస్టింగే!

Tags: mp bandi sanjay, telangana bjp new president, kcr, ktr, trs, telangana politics

Advertisement

Next Story

Most Viewed