హేమంత్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్

by Sumithra |   ( Updated:2020-10-05 07:16:17.0  )
హేమంత్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హైదరాబాద్‌ చందానగర్‌కు చెందిన హేమంత్‌ హత్య కేసులో మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సుపారీ గ్యాంగ్‌కు చెందిన వీరిద్దరిని సోమవారం అరెస్ట్ చేయగా.. ఇప్పటికే ఈ పరువు హత్య కేసులో 21మందిని అరెస్ట్ చేసినట్లు సైబరాబాద్ పోలీసులు తెలిపారు. అవంతికను ప్రేమ వివాహం చేసుకున్న హేమంత్‌ను చంపేందుకు రూ.10లక్షల సుపారీ మాట్లాడుకోగా… ప్రధాన నిందితులైన యుగేందర్‌, లక్ష్మారెడ్డి కస్టడీ ఇప్పటికే పూర్తయ్యింది.

సోమయాజులు అనే వ్యక్తి మొదట్నుంచి హేమంత్‌ను మర్డర్ చేసే ప్లాన్‌లో ఉన్నాడని, ఈ హత్యలో ఇతనికి రూ.50వేలు ముట్టినట్లు డీసీపీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. సోమయాజులు, కృష్ణ, బిచ్చు యాదవ్, మహ్మద్ పాషా.. హేమంత్‌ని హత్య చేశారని, మరో నిందితుడు రౌడీ షీటర్ సాయన్నపై పంజాగుట్టలో 1995 నుంచి కేసు ఉన్నట్లు డీసీపీ పేర్కొన్నారు. విజేందర్‌రెడ్డి, సందీప్‌రెడ్డి, పటేల్‌ను కస్టడీ కోరామని.. వీరిని విచారిస్తే మరిన్ని విషయాలు తెలుస్తాయని డీసీపీ వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు.

Advertisement

Next Story