డబుల్‌ బెడ్‌రూం అంటూ లక్షలకు లక్షలు వసూలు చేసి..

by Sumithra |   ( Updated:2021-09-03 06:51:37.0  )
dcp
X

దిశ, కుత్బుల్లాపూర్ : నమ్మకమే వారి ఆయుధం. ప్రజల బలహీనతే ఆస్తిగా భావించిన పాత నేరస్తుడు, డబుల్ బెడ్రూం ఇల్లు ఇప్పిస్తానని అమాయకులను మోసం చేయడం ప్రారంభించారు. ఇందుకుగానూ ఓ ఫోటోగ్రాఫర్‌ను భాగస్వామిగా చేసుకుని నకిలీ పత్రాలను సృష్టించడం, ప్రజల వద్ద లక్షల రూపాయలను వసూలు చేయడం దినచర్యగా పెట్టుకున్నాడు. చివరకు ఇద్దరు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు. శుక్రవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో బాలానగర్ డీసీపీ పద్మ, ఏసీపీ పురుషోత్తం వివరాలను వెల్లడించారు.

ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన బొమ్మిడం కుమార్ బాబు 10వ తరగతి పూర్తి చేసి, అనంతరం తల్లిదండ్రులతో కలిసి నగరంలోని యూసుఫ్‌గూడ కృష్ణానగర్‌కు వలస వచ్చారు. అయితే ఉద్యోగం చేయడం ఇష్టం లేక దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. 2008లో ఎల్బీనగర్‌లో టీవీ, సరూర్‌నగర్‌లో సెల్‌ఫోన్, 2014లో నడుచుకుంటూ వెళ్తున్న వృద్ధురాలి వద్ద బంగారం, జూబ్లీహిల్స్‌లో ల్యాప్ ట్యాప్ , ఎస్సార్‌నగర్‌లో సూడోపోలీసుగా మారి హాస్టళ్ల నిర్వాహకుల వద్ద నగదు తీసుకోవడం వంటి నేరాలకు పాల్పడ్డారు. 2015లో జైలులో ఉన్న ఓ నిందితుడికి బెయిల్ ఇప్పిస్తానని మోసం చేయడంపై సహ మొత్తం 13 కేసులు కుమార్ బాబుపై నమోదయ్యాయి.

అయితే దొంగతనాల చేయటంతో రిస్క్ ఉందని, తేలికగా డబ్బు సంపాదించే మార్గం కోసం అన్వేషించాడు. అందుకోసం డబుల్ బెడ్రూం ఇల్లు ఇప్పిస్తానని అమాయకులను మోసం చేయటం ప్రారంభించారు. ఇందుకుగానూ బోరబండకు చెందిన షేక్ సల్మాన్(23) ఫోటోగ్రాఫర్‌ను జత చేసుకున్నాడు. సల్మాన్ ఫోటో షాప్‌తో నకిలీ ధృవపత్రాలు, ఐడీ కార్డులు తయారు చేయడంలో దిట్ట. ఇలా వాటితో బాలానగర్ తదితర ప్రాంతాలకు చెందిన నలుగురు బాధితుల నుంచి డబ్బులు వసూలు చేశారు. ఇలా ఇప్పటి వరకు బాలానగర్ పరిధిలో 100 మందికి పైగా బాధితుల నుంచి ఒక్కొక్కరి వద్ద 1.60 లక్షల నుంచి రూ.6.50 లక్షల వరకు వసూలు చేశారు. అయిన డబ్బులు ఇచ్చిన తరువాత ఇంటి మంజూరు కాకపోవటంతో కొంతమంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో బాలానగర్ ఏసీపీ పురుషోత్తం ఆధ్వర్యంలో సనత్ నగర్ పోలీసులు, శంషాబాద్ ఎస్వోటీ పోలీసులు నగరమంతా గాలించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరు ఇద్దరూ విచారణలో చేసిన నేరాలను అంగీకరించారు. వారి వద్ద నుంచి రూ.37 లక్షల నగదు, రూ.15 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు, రూ.5 లక్షల స్కోడా కారు, లక్ష రూపాయల పల్సర్ వాహనం, 3 సెల్ ఫోన్‌లు, రెండు ల్యాప్‌ట్యాప్‌లు, రూ.2.5 లక్షల 5 ఫ్లాట్ పేపర్లు, 2 స్టాంపులు, 1 కలర్ ప్రింటర్, నకిలీ టోకెన్ పుస్తకాలు, అలాట్‌మెంట్ లెటర్లు, 18 పట్టాలు, నకిలీ డిప్యూటీ ఏఈ ఐడీకార్డు, ఆధార్, పాన్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.

వీటి విలువ మొత్తం రూ.61 లక్షలుగా నిర్ధారించారు. ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పూర్తి స్థాయి విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని హమీ ఇచ్చారు. పీడీ యాక్టును పెట్టడం జరుగుతుందన్నారు. నిందితులను పట్టుకున్న వారందరికీ రివార్డు వచ్చేలా చూస్తానన్నారు.

Advertisement

Next Story