తిరుపతి శ్రీవారి బ్రహ్మోత్సవాల పూర్తి వివరాలివే…!

by srinivas |
తిరుపతి శ్రీవారి బ్రహ్మోత్సవాల పూర్తి వివరాలివే…!
X

ఫిబ్రవరి 13న శ్రీనివాస‌మంగాపురంలోని శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగనుందని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. ఈ సందర్భంగా టీటీడీ ఈవో మాట్లాడుతూ, శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ఆల‌యంలో చలువ పందిళ్లు వేసి అందంగా రంగవల్లులు తీర్చిదిద్దామని అన్నారు. భక్తులను ఆకట్టుకునేలా పుష్పాలంకరణలు, విద్యుద్దీపాలంకరణలు, ప్రతిరోజూ వాహనసేవల ముందు కళాబృందాలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఈ నెల 13 తేదీ నుంచి 21వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 8.00 నుండి 9.00 గంటల వరకు, తిరిగి రాత్రి 8.00 నుండి 9.00 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో తేదీల వారీగా జరిగే సేవలను వివరించారు. వాటి వివరాల్లోకి వెళ్తే…

ఫిబ్రవరి 13న అంకురార్ప‌ణ‌ :
ఫిబ్రవరి 13వ తేదీ గురువారం సాయంత్రం 6.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు పుణ్యాహ‌వాచ‌నం, మృత్సంగ్ర‌హ‌ణం, సేనాధిప‌తి ఉత్స‌వ‌ము, శాస్త్రోక్తంగా అంకురార్పణం జరుగనుంది.

ఫిబ్రవరి 14న ధ్వజారోహణం :
ఫిబ్రవరి 14వ తేదీ శుక్ర‌వారం ధ్వజారోహణంతో శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా ఉదయం 8.00 నుండి 9.30 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు తిరుచ్చి ఉత్సవం జరుగనుంది. ఉదయం 9.45 నుండి 10.10 గంటల మధ్య ధ్వజారోహణ ఘట్టాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించనున్నారు. అదేరోజు సాయంత్రం 6.00 నుండి 7.00 గంటల వరకు ఊంజల్‌సేవ, రాత్రి 8.00 నుండి 9.00 గంటల వరకు పెద్దశేష వాహనసేవ జరుగనున్నాయి.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాల్లోకి వెళ్తే.. 14వ తేదీన ఉదయం ధ్వజారోహణం, సాయంత్రం పెద్దశేష వాహనంపై ఊరేగింపు నిర్వహించనున్నారు. 15వ తేదీన ఉదయం చిన్నశేషవాహనంపై సేవ సాయంత్రం హంస వాహనంపై ఊరేగింపు. 16వ తేదీన ఉదయం సింహ వాహనసేవ సాయంత్రం ముత్యపుపందిరి వాహనంపై ఊరేగింపు. 1వ తేదీన ఉదయం కల్పవృక్ష వాహన సేవ, సాయంత్రం సర్వభూపాల వాహనంపై ఊరేగింపు. 18వ తేదీన ఉదయం పల్లకి ఉత్సవ(మోహినీ అవతారం) సేవ, సాయంత్రం గరుడ వాహనంపై ఊరేగింపు. 19వ తేదీన హనుమంత వాహనసేవ, సాయంత్రం స్వర్ణరథం, గజ వాహనంపై ఊరేగింపు. 20వ తేదీన ఉదయం సూర్యప్రభ వాహన సేవ, సాయంత్రం చంద్రప్రభ వాహనంపై ఊరేగింపు. 21వ తేదీన ఉదయం రథోత్సవ సేవ, సాయంత్రం అశ్వవాహనంపై ఊరేగింపు. 22వ తేదీన ఉదయం చక్రస్నానం, సాయంత్రం ధ్వజావరోహణం నిర్వహించనున్నారు.

ఉత్సవాలను పురస్కరించుకుని టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ హరికథలు, సంగీత కచేరీలు ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల కారణంగా ఆలయంలో అన్ని రకాల ఆర్జితసేవలను టీటీడీ రద్దు చేసింది.

Advertisement

Next Story

Most Viewed