ఓటర్, ఆధార్ లింకింగ్‌పై కీలక సమావేశం

by John Kora |
ఓటర్, ఆధార్ లింకింగ్‌పై కీలక సమావేశం
X

- హోం, లెజిస్లేటీవ్ కార్యదర్శులను పిలిచిన సీఈసీ

- హాజరుకానున్న యూఐడీఏఐ సీఈవో

- మార్చి 18న కీలక భేటీ

దిశ, నేషనల్ బ్యూరో: ఓటరు గుర్తింపు కార్డులను ఆధార్‌తో అనుసంధానించే విషయంపై చర్చించడానికి ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్జానేష్ కుమార్ కీలక భేటీ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కేంద్ర హోం శాఖ కార్యదర్శి, అసెంబ్లీ శాఖ కార్యదర్శితో పాటు యూఐడీఏఐ (అధార్) సీఈవో కూడా హాజరు కానున్నట్లు ఎన్నికల కమిషన్ వర్గాలు తెలిపాయి. ఓటర్ల జాబితా, ఎన్నికల గుర్తింపు కార్డుకు సంబంధించిన నంబర్లలో జరుగుతున్న అక్రమాలపై ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. ఒకే గుర్తింపు కార్డు ఉన్న నంబర్లతో వందలాది కార్డులు ఉన్నట్లు ఇటీవలే మమత బెనర్జీ ఆరోపించారు. దీంతో పాటు అక్రమ ఓటర్లు కూడా ఉన్నట్లు కాంగ్రెస్, శివసేన యూబీటీ, ఆప్ వంతి పార్టీలు ఆరోపించాయి. వీటిపై కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశాయి. దీంతో సీఈసీ ఈ కీలక సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

మార్చి 18న సీఈసీ జ్ఞానేశ్ కుమార్ నేతృత్వంలో జరుగనున్న సమావేశంలో కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్, శాసనసభ కార్యదర్శి రాజీవ్ మణి, ఆధార్ సీఈవో భువనేశ్ కుమార్ పాల్గొననున్నారు. ఈ సమావేశంలో ప్రస్తుతం ఆధార్ చట్టం ఆధారంగా ఓటర్ జాబితాను అనుసంధానానికి ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించనున్నారు. దీంతో పాటు ఓటు గుర్తింపు కార్డుపై ఒకే విధంగా ఉన్న సంఖ్యలను ఎలా పరిష్కరించాలనే విషయంపై కూడా చర్చించనున్నారు.

కాగా, సీఈసీ సమావేశం ఏర్పాటు చేయడంపై రాజ్యసభ డిప్యటీ లీడర్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాగరిక ఘోష్ స్పందించారు. ఓటరు కార్డులకు సంబంధించి.. ఈసీ ఇటీవల కాలంలో విడుదల చేసిన మూడు ప్రకటనలపై చర్చ చేయాలని కోరారు.

Next Story