కార్పొరేషన్ పదవులపై జిల్లా నేతల ఆశలు

by Mahesh |
కార్పొరేషన్ పదవులపై జిల్లా నేతల ఆశలు
X

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో: స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో, ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పలువురు నేతలు కార్పొరేషన్ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి రాష్ట్రస్థాయిలో ఏపీ జితేందర్ రెడ్డి, డాక్టర్ చిన్నారెడ్డి, శివసేన రెడ్డి, ఒబేదుల్లా కొత్వాల్, తదితరులు ప్రధాన నామినేటెడ్ పోస్టులకు ఎంపికై వారి వారి బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం.. ఎమ్మెల్యేల గెలుపు కోసం కృషిచేసిన పలువురు నేతలు పదవుల కోసం ఎదురుచూస్తున్నారు..

మాజీ ఎమ్మెల్యే సీతమ్మకు చైల్డ్ ప్రొటెక్షన్ చైర్మన్..

మాజీ ఎమ్మెల్యే కొత్తకోట సీతా దయాకర్ రెడ్డికి చైల్డ్ ప్రొటెక్షన్ చైర్మన్ పదవి దాదాపు ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం, విద్యావంతురాలు కావడం.. ఇంటర్వ్యూలో రాణించడంతో ఆమెకు చైర్మన్ పదవి ఖరారైనట్లు తెలుస్తుంది. ఇందు కు సంబంధించి సాధ్యమైనంత త్వరలో నియామక ఉత్తర్వులు జారీ కానున్నట్లు సమాచారం.

మరి కొంతమంది ప్రయత్నాలు..

ఉమ్మడి పాలమూరు జిల్లాలో పార్టీ కోసం పనిచేసిన సీనియర్ నాయకులు కొందరంటే జనాదరణ కలిగిన మరికొందరు ఉన్నారు. వీరందరూ రాష్ట్రస్థాయిలో పదవులను దక్కించుకోవడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు. దాదాపు 50 కార్పొరేషన్ పోస్టులకు సంబంధించి ఇప్పటికే చైర్మన్ నియామకాలు కాగా, మరో 20 కార్పొరేషన్కు సంబంధించిన చైర్మన్ ల నియామకాలు జరగాల్సి కొంతమంది ఈ పోస్టుల కోసం పైరవీలు చేస్తూ ఉండగా, మరి కొంతమంది ఆయా కార్పొరేషన్లలో డైరెక్టర్ పోస్టుల కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ మేరకు ఆయన నియోజకవర్గాల ఎమ్మెల్యేలు అర్హులైన నాయకులు, కార్యకర్తల పేర్లు అధిష్టానానికి సిఫార్సు చేశారు.

ఇంకా భర్తీ కానీ ‘మూడా’ డైరెక్టర్ పోస్టులు

మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవి నియామకం జరిగి నాలుగు నెలలు కావస్తున్నా డైరెక్టర్ల నియామకాలు ఇప్పటివరకు జరగలేదు. మహబూబ్ నగర్, జడ్చర్ల, దేవరకద్ర ఎమ్మెల్యేలు డైరెక్టర్ పోస్టులకు సంబంధించి కొంత మంది పేర్లను అధిష్టానానికి పంపినట్లు సమాచారం. ఇప్పటివరకు నియామకాలు జరగకపోవడంతో ఆ పోస్టుపై ఆశలు పెట్టుకున్న ఆశావాకులు నిరాశ చెందుతున్నారు.



Next Story