TGSPDCL : విద్యుత్ వినియోగదారులకు TGSPDCL హెచ్చరిక

by M.Rajitha |
TGSPDCL : విద్యుత్ వినియోగదారులకు TGSPDCL హెచ్చరిక
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ (TGSPDCL) తమ వినియోగదారులకు బిగ్ అలర్ట్(Big Alert) జారీ చేసింది. సంస్థ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్(CMD) ముషారఫ్ ఫరూఖీ గురువారం వినియోగదారులకు ఓ ముఖ్య హెచ్చరిక జారీ చేశారు. వినియోగదారులు ఎవరూ తమ బ్యాంక్ ఖాతాలు, క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని, అలాగే విద్యుత్ బిల్లుల చెల్లింపు కోసం అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయరాదని కోరారు. కొందరు సైబర్ నేరగాళ్లు(Cyber Crimes) వినియోగదారులకు ఫేక్ మెసేజెస్ పంపుతున్నట్లు TGSPDCL దృష్టికి వచ్చినట్లు తెలిపారు. ఈ సందేశాల్లో గత నెల బిల్లు చెల్లించనందున రాత్రి 7:30 తర్వాత విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని, బిల్లు చెల్లించడంలో సమస్యలు ఉంటే వెంటనే వాట్సాప్‌లో సంప్రదించాలని పేర్కొన్నారు. ఇది నిజమేనని నమ్మి పలువురు సైబర్ నేరగాళ్ల బారిన పడినట్లు తెలిపారు.

తాము విద్యుత్ శాఖ నుంచి మాట్లాడుతున్నామని నమ్మించి.. బ్యాంక్ ఖాతాలు, క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలను సేకరించి.. వారి బ్యాంక్ అకౌంట్ నుంచి భారీగా డబ్బు డ్రా చేసినట్టు తెలిసిందన్నారు. TGSPDCL ఎప్పుడూ మొబైల్ నంబర్ల నుండి సందేశాలను, లింకులు పంపదని ఆయన స్పష్టం చేశారు. అలాగే విద్యుత్ బిల్లులు బకాయిలు ఉంటే రాత్రిపూట కరెంట్ సరఫరా నిలిపివేయమని పేర్కొన్నారు. విద్యుత్ బిల్లుల చెల్లింపులో ఏవైనా అనుమానాలు ఉంటే నేరుగా తమ సంస్థ వెబ్‌సైట్ www.tgsouthernpower.org లేదా TGSPDCL మొబైల్ యాప్ ద్వారా తెలుసుకొని.. నేరుగా పరిష్కరించుకోవాలని, సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.



Next Story