నల్గొండ జిల్లాను సస్యశ్యామలం చేస్తాం: మంత్రి ఉత్తమ్

by Kavya |
నల్గొండ జిల్లాను సస్యశ్యామలం చేస్తాం: మంత్రి ఉత్తమ్
X

దిశ, నల్లగొండ: ఉమ్మడి నల్గొండ జిల్లాలో చేపట్టిన అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. సోమవారం రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని బక్కతాయి కుంట వద్ద రూ.20.22 కోట్లతో బక్కతాయి కుంట లిఫ్ట్ ఇరిగేషన్, రూ.6.08 కోట్లతో పునుగోడు ఎత్తిపోతల, రూ.19.95 కోట్లతో నర్సింగ్ బట్ల ఎత్తిపోతల పథకాలకు, అలాగే రూ.36 కోట్లతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్మించనున్న అదనపు బ్లాక్‌కు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వం జిల్లాలో ఇరిగేషన్ పనులను పట్టించుకోలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిండి లిఫ్ట్ ఇరిగేషన్ కోసం రూ.1800 కోట్లు, హై లెవెల్ కెనాల్ కోసం రూ.442 కోట్లు మంజూరు చేసి పనులు ప్రారంభించినట్లు తెలిపారు. అలాగే, పిళ్లాయిపల్లి కాలువ, శివన్నగూడెం నుంచి నారాయణపూర్, చౌటుప్పల్‌కు సాగునీరు అందించే లిఫ్ట్ ఇరిగేషన్, మూసీ పునరుద్ధరణ, ఎస్ఎల్బిసి, దున్నపోతుల గండి, ఐటిపాముల, నెల్లికల్, రాచకాలువ, గంధమల్ల, పెళ్లిపాకల, గాజుపేట, దేవాదుల నుంచి తుంగతుర్తి వరకు సాగునీరు అందించే ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై రెండు నెలలకోసారి సమీక్షిస్తామని పేర్కొన్నారు.


మంత్రి మాట్లాడుతూ, తమ ప్రభుత్వ హయాంలో 66.7 లక్షల ఎకరాల్లో 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం, యాసంగితో కలిపి 2.80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించి రికార్డు సృష్టించామని, సన్న ధాన్యం పండించిన రైతులకు రూ.500 బోనస్ ఇచ్చామని తెలిపారు. రాష్ట్రంలో పండించిన బియ్యాన్ని విదేశాలకు, ముఖ్యంగా నల్గొండ నుంచి ఫిలిప్పీన్స్‌కు ఎగుమతి చేస్తున్నామని చెప్పారు. అలాగే, 85% జనాభాకు ఆరు కేజీల చొప్పున సన్న బియ్యం ఉచితంగా ఇస్తున్నామని, అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డు అందిస్తామని హామీ ఇచ్చారు.మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రూ.36 కోట్లతో నిర్మించనున్న అదనపు బ్లాక్‌ను 9 నెలల్లో పూర్తి చేస్తామని, ఈ భవనంతో డీఈఓ, డీఎంహెచ్ కార్యాలయాలు కలెక్టర్ కార్యాలయంలోనే అందుబాటులోకి వస్తాయని తెలిపారు. రాష్ట్రంలో సన్న బియ్యం పథకం, ఉద్యోగులకు ప్రతి నెల మొదటి తేదీన జీతాలు, రూ.1600 కోట్లతో రోడ్ల అభివృద్ధి వంటి పథకాలను అమలు చేస్తున్నామని వివరించారు.ఈ కార్యక్రమంలో నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎమ్మెల్సీలు శంకర్ నాయక్, నెల్లి కంటి సత్యం, ఎమ్మెల్యేలు బాలు నాయక్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వేముల వీరేశం, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు. మంత్రులు ఐదుగురు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల కింద ఒక్కొక్కరికి రూ.1 లక్ష చొప్పున చెక్కులు అందజేశారు. సాంస్కృతిక సారథి కళాకారులు ప్రభుత్వ పథకాలపై సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు.




Next Story

Most Viewed