- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
TG Govt.: జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం.. విద్యుత్ స్తంభాలకు ఇక యూనిక్ ఐడీ

దిశ, తెలంగాణ బ్యూరో: జీహెచ్ఎంసీ వీధి దీపాల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది. బకాయిలు చెల్లించలేదని కాంట్రాక్టు ఎజెన్సీ నిర్వాహకులు, బకాయిలు చెల్లించిన పనులు చేయడంలేదని జీహెచ్ఎంసీ అధికారులు.. వెరసి నగరంలో వీధి దీపాలు వెలగడంలేదు. దీనంతటికి విద్యుత్ లైట్లకు లెక్కాపత్రం లేకపోవడమేనని అధికారులు గుర్తించారు. గ్రేటర్ పరిధిలో ఎన్ని విద్యుత్ స్తంభాలు ఉన్నాయి? వాటికి ఎన్ని లైట్లు ఉన్నాయి? ఉన్న లైట్లన్నీ వెలుగుతున్నాయా? లైట్ పాడైతే కొత్తవాటిని రీప్లేస్ చేస్తున్నారా? అనే విషయాలలో అవకతకవలు జరుగుతున్నాయని ఉన్నతాధికారులు ప్రాథమిక గుర్తించినట్టు తెలిసింది. దీంతోపాటు ఈ విభాగంలో పనిచేస్తున్న క్షేత్రస్థాయి ఉద్యోగులు సైతం పారదర్శకంగా, జనాబుదారితనంగా వ్యవహరించడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటన్నింటికి చెక్ పెట్టేందుకు జీహెచ్ఎంసీ ఎలక్ట్రిసిటీ విభాగం దృష్టిసారించింది.
స్తంభాలకు యూనిక్ ఐడీ..
జీహెచ్ఎంసీ పరిధిలో 30 సర్కిళ్ల పరిధిలో 5.10 లక్షల వీధి దీపాలు ఉన్నాయని అధికారులు లెక్కలు చెబుతున్నారు. వీటిని 25 వేల సెంట్రలైజ్డ్ కంట్రోల్ మానిటరింగ్ సిస్టం(సీసీఎంఎస్) డ్యాష్ బోర్డుకు అనుసంధానం చేశారు. అయితే ఎన్ని విద్యుత్ స్తంభాలు ఉన్నాయనే లెక్కలు అధికారుల వద్దలేవు. క్షేత్రస్థాయి అధికారులు, కాంట్రాక్టు ఎజెన్సీలు ఇచ్చినవే తప్ప వీటిని పక్కాగా లెక్కించిన దాఖలాల్లేవు. ప్రతి స్తంభానికి క్యూఆర్ కోడ్‌తో కూడిన యూనిక్ ఐడీని ఇవ్వాలని నిర్ణయించారు. దీన్ని స్కాన్ చేస్తే స్తంభానికి చెందిన పుట్టుపూర్వోత్తరాలతో పాటు ఎన్నిలైట్లు ఉన్నాయి? ఎన్నిసార్లు లైట్లను రీప్లేస్ చేశారనే సమాచారం వచ్చేలా రూపొందిస్తున్నారు.
ప్రత్యేక మొబైల్ యాప్..
జీహెచ్ఎంసీ పరిధిలోని 30 సర్కిళ్లల్లో ఉన్న స్తంభాలను మొబైల్ యాప్ ద్వారా సర్వే చేయాలని నిర్ణయించారు. స్తంభం ఉన్న ఏరియాకు సంబంధించిన లొకేషన్, లాంగ్ ట్యూడ్, లాట్టిట్యూడ్ పొందుపరచనున్నారు. మొబైల్ యాప్ ద్వారా విద్యుత్ విభాగానికి సంబంధించిన వివరాలను పూర్తిగా సేకరించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన పనులను త్వరలోనే ప్రారంభంచే అవకాశముంది.
అధికారుల లెక్కలిలా..
జీహెచ్ఎంసీ పరిధిలో 5 లక్షలకు పైగా వీధిదీపాలు ఉన్నాయని టక్కున లెక్క చెబుతున్నారు. వీటికేమైనా పారదర్శకత ఉందా? స్తంభాల గురించి అధికారులు ఒక్కోసారి ఒక్కొలా చెబుతున్నారు. మొదట్లో జీహెచ్ఎంసీకి చెందిన స్తంభాలే అని చెప్పేవారు. తర్వాత జీహెచ్ఎంసీతో పాటు టీజీఎస్పీడీసీఎల్ స్తంభాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. కొత్త విషయమేమంటే టెలిఫోన్ స్తంభాలకు కూడా విద్యుత్ దీపాలను వెలిగిస్తున్నట్టు లెక్కలేస్తున్నారు.
ఉద్యోగుల లెక్కలూ..
జీహెచ్ఎంసీ విద్యుత్ విభాగంలో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులను ప్రక్షాళన చేయాలని అధికారులు నిర్ణయించారు. ఎంత మంది ఉన్నారు? వాళ్ల విధులేంటి? లైన్‌మెన్లు విధులు సక్రమంగా నిర్వహిస్తున్నారా? లేదా? ఫీల్డ్‌లో ఉంటున్నారా? లేదా? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. దీంతో పాటు స్కిల్డ్ ఉద్యోగులెంత మంది? అన్ స్కిల్డ్ ఉద్యోగులెంత మంది ఉన్నారని లెక్కలు తీయనున్నారు. దీంతోపాటు ఈ ఉద్యోగులకు శిక్షణా కార్యక్రమాలు కూడా నిర్వహించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది.
పారదర్శకత కోసమే..
విద్యుత్ స్తంభాలు, విద్యుత్ లైట్లు, మీటర్ బాక్సులకు సంబంధించిన లెక్కలు తేలితే నిధుల దుర్వినియోగాన్ని అరికట్టడం సులభమవుతోందని అధికారులు భావిస్తున్నారు. వీటి ఆధారంగానే టెండర్ పిలవడంతో పాటు నిధుల ఖర్చుపై స్పష్టత వచ్చే అవకాశముంది. కొత్త లైట్లను రీప్లేస్ చేయడంతో పాటు పాతవాటిని ఎం చేస్తున్నారనే దానిపై నిఘా పెట్టాలని నిర్ణయించారు. అయితే వీటి నిర్వహణను మళ్లీ ఈఈఎస్ఎల్‌కే ఇవ్వాలా? వేరే టెండర్ పిలవాలా? అనేది పురపాలకశాఖ నిర్థయం మేరకే జరుగుతుందని అధికారులు చెబుతున్నారు.