- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ముదురుతున్న ఎండలు... ఎండుతున్న ప్రాజెక్టులు

దిశ, ప్రతినిధి నిర్మల్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ యాసంగిలో సాగునీటి ప్రాజెక్టుల కింద సేద్యంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. మార్చి నెల సగం నాటికే విపరీతమైన ఎండలు కాస్తుండడంతో ప్రాజెక్టుల్లో క్రమంగా నీటిమట్టం తగ్గుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదే మే చివరినాటికి ప్రాజెక్టులు పూర్తిగా ఎండిపోయే పరిస్థితులు ఉండవచ్చని అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టుల ద్వారా వ్యవసాయానికి నీటి సరఫరా చేయడంతో పాటు మరోవైపు తాగునీటి అవసరాలను తీర్చేందుకు మిషన్ భగీరథకు నీటి సరఫరా ఉండడంతో... ఈ వేసవి ఎలా గట్టెక్కుతుందోనన్న ఆందోళన అన్ని వర్గాల్లోనూ ఉంది. ఉమ్మడి జిల్లాలోని ఆయకట్టుకు నీరందించే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ , గడ్డన్నవాగు ప్రాజెక్ట్, స్వర్ణ ప్రాజెక్టులతో పాటు మత్తడివాగు, బోథ్ ప్రాజెక్ట్, భీమ్ ప్రాజెక్ట్ ప్రాజెక్టుల్లో రోజురోజుకు నీటిమట్టం తగ్గుతున్నది. కాగా కడెం ప్రాజెక్టు త్వరలోనే డెడ్ స్టోరేజ్ కి చేరే అవకాశం ఉంది. దీంతో యాసంగిలో చివరి ఆయకట్టు దాకా నీరు అందుతుందో లేదోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
తగ్గుతున్న ప్రధాన ప్రాజెక్టుల నీటిమట్టాలు..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ప్రధాన సాగునీటి ప్రాజెక్టులలో నీటిమట్టాలు క్రమంగా తగ్గుతున్నాయి ఉత్తర తెలంగాణకు ప్రధాన నీటి వనరు అయిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కింద ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ మంచిర్యాల జిల్లాలకు సాగునీరు అందిస్తున్నారు. నిర్మల్ జిల్లాలో సుమారు 41 వేల ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు కడం ప్రాజెక్టు ఖాళీ అయితే ఫీడర్ ఛానల్ గా ఆ ప్రాజెక్టుకు ఎస్సారెస్పీ నీరు అందితే మంచిర్యాల జిల్లాలోని పలు మండలాలకు సాగునీరు అందించే విధంగా సరస్వతి కాలువను డిజైన్ చేశారు. అయితే ప్రస్తుతం ఎస్సారెస్పీలో 1090 అడుగులకు గాను 1068 అడుగుల వద్ద ప్రాజెక్ట్ నీటిమట్టం ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా నిర్మల్ ఆదిలాబాద్ జిల్లాలకు తాగునీటి అవసరాలు కూడా తీరుస్తున్నారు. నిర్మల్ జిల్లాలోని ముధోల్ నియోజకవర్గంలో సుమారు 14 వేల ఎకరాలకు నీరు అందించే గడ్డెన్నవాగు ప్రాజెక్ట్ నీటిమట్టం 358.70 అడుగులు కాగా ప్రస్తుతం 356 వద్ద ఉంది. కొంత ఆశాజనకమే అయినప్పటికీ భారీ ఎండలు ఈ ప్రాజెక్టుపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
సారంగాపూర్ మండలం స్వర్ణ ప్రాజెక్టు నీటిమట్టం 11 83 అడుగులు కాగా ప్రస్తుతం 11 74 వద్ద నీటిమట్టం ఉంది. ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే మే నెల నాటికి ప్రాజెక్టు పరిస్థితి మరింత దిగజారే పరిస్థితి ఉందని అధికారులు చెబుతున్నారు. యాసంగిలో చివరి ఆయకట్టు దాకా నీరు అందుతుందో లేదోనన్న ఆందోళన వ్యక్తం అవుతున్నది. కడెం ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 700 అడుగులు కాగా 684 అడుగుల వద్ద ఉంది. ఈ ప్రాజెక్ట్ త్వరలోనే డెడ్ స్టోరేజ్ కి చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. మంచిర్యాల జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టు 20 టి ఎం సి ల సామర్థ్యం కాగా ఇప్పుడు 11 టి ఎం సి ల నీరుంది. అలాగే ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న మత్తడివాగు, బోథ్ ప్రాజెక్ట్, ఆసిఫాబాద్ జిల్లా కొమురం భీమ్ ప్రాజెక్ట్ ల నీటి మట్టాలు కూడా క్రమంగా తగ్గుతున్నాయి.
వారబందీ అమలు... నీటి వనరు మరింత తగ్గే అవకాశం
ఆయా సాగునీటి ప్రాజెక్టుల కింద వ్యవసాయం పొలాలకు వారబందీ పద్ధతిలో సాగునీరు అందిస్తున్నారు. ప్రాజెక్టుల నీటిమట్టం తగ్గకుండా వారబంది అమలు చేస్తున్నప్పటికీ సాగునీటి ప్రాజెక్టులు భారీగా ఎండిపోయే పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు ప్రాజెక్టుల నుంచి తాగునీటి అవసరాలకు మిషన్ భగీరథకు నీటి విడుదల జరుగుతున్న నేపథ్యంలో ప్రాజెక్టుల నీటిమట్టం మరింత తగ్గే అవకాశం ఉంది. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులు ఆందోళనకు గురవుతున్నారు.