టెండర్లలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు

by John Kora |
టెండర్లలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు
X

- కర్ణాటక ప్రభుత్వం తాజా నిర్ణయం

- కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలు చేస్తోందన్న బీజేపీ

- ఇది రాహుల్ గాంధీ కుట్రలో భాగమన్న రవిశంకర్ ప్రసాద్

దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటక ప్రభుత్వం ఇకపై టెండర్లలో 4 శాతం కాంట్రాక్టులు ముస్లింలకు ఇవ్వాలని నిర్ణయించింది. దీనిపై ప్రతిపక్ష బీజేపీ తీవ్రంగా మండిపడింది. కర్ణాటక ట్రాన్సపరెన్సీ ఇన్ పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్ (కేటీపీపీ) యాక్ట్‌ సవరణలను ప్రతిపాదిస్తూ సిద్దరామయ్య కేబినెట్ శనివారం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రూ.1 కోటి లోపు ఉండే కాంట్రక్టు వర్కుల్లో 4 శాతం ముస్లింలకు కేటాయించాలని నిర్ణయించారు. దీనిపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపు రాజకీయాల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుందని బీజేపీ ఆరోపించింది. సిద్దరామయ్య కేబినెట్ తీసుకున్న నిర్ణయంలో రాహుల్ గాంధీ ప్రభావం ఉందని ఆరోపించింది.

కర్ణాటక ప్రభుత్వం ముస్లింలకు 4 శాతం కాంట్రాక్టులు కేటాయించాలని నిర్ణయం తీసుకోవడం వెనుక రాహుల్ గాంధీ హస్తం ఉందని బీజేపీ నాయకుడు రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్న రాహుల్ గాంధీ మనస్తత్వం ఏంటో ఈ నిర్ణయంతో తెలిసిపోయిందని రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ఇది కేవలం కర్ణాటకకు మాత్రమే పరిమితం కాదు. రాబోయే రోజుల్లో దేశం మొత్తం ఈ నిర్ణయం ప్రభావం చూపుతుందని అన్నారు.

ఇది మత మార్పిడులను ప్రోత్సహించే చర్చగా బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య అభివర్ణించారు. ప్రభుత్వం తమకు ఉన్న అధికారాలను ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఉపయోగించుకుంటోందని ఆరోపించారు. ప్రభుత్వ నిధులను ఇలా ఉపయోగించడం నేరమని సూర్య అన్నారు. మన ఆర్థిక వనరులను రాజకీయ లబ్దికోసం వాడుకోవడం భావ్యం కాదని అన్నారు. ఇది రాజ్యాంగ వ్యతిరేకమని బీజేపీ వ్యాఖ్యానించింది. ఉద్యోగాల్లోనే కాకుండా ఇతర రంగాల్లో కూడా రిజర్వేషన్లను పొడిగించాలని కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నంలో భాగమే ఇదని రవిశంకర్ అన్నారు. ఇదొక్కటేనా.. రైల్వే టికెట్ల రిజర్వేషన్లలో కూడా ముస్లింలకు కోటా ఉందా అని రవిశంకర్ ప్రశ్నించారు.

మార్చి 7న కర్ణాటక రాష్ట్ర బడ్జెట్‌ను సమర్పించే సమయంలో పలు ప్రభుత్వ శాఖలు, ఏజెన్సీలు, సంస్థల కింద ఉన్న అన్ని ప్రజా పనుల కాంట్రాక్టుల్లో 4 శాతం.. కేటగిరీ 2బీ కింద ముస్లింలకు కేటాయించాలని నిర్ణయించారు.

Next Story

Most Viewed