Rabies: దేశంలో పెరిగిన రేబిస్ మరణాలు.. ప్రతి నెలా నలుగురు మృతి !

by vinod kumar |
Rabies: దేశంలో పెరిగిన రేబిస్ మరణాలు.. ప్రతి నెలా నలుగురు మృతి !
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్‌లో రేబిస్ (Rabies) వ్యాధి వల్ల మరణాలు పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నివేదికలో వెల్లడైంది. 2024లో దేశంలో రేబిస్ కారణంగా నెలకు సగటున నలుగురు మృతి చెందారని పేర్కొంది. 2022లో 21 మంది రేబిస్‌తో మరణించగా 2024 నాటికి ఆ సంఖ్య 2.5 రెట్లు పెరిగి 54కు చేరుకుంది. అంతేగాక 14 కేసులు మహారాష్ట్ర నుంచే నమోదయ్యాయి. గతేడాది మొత్తంగా 5.19లక్షల కుక్కకాటు కేసులు నమోదు కాగా వారిలో 15ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారే ఎక్కువగా ఉన్నారు. 2023లో 30.43 లక్షల కుక్క కాటు కేసులు వెలుగు చూడగా, 50 మంది రేబిస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

ఇక, ప్రపంచ వ్యాప్తంగా కూడా రేబిస్ మరణాల్లో 36శాతం భారత్‌లోనే సంభవిస్తున్నాయని డబ్లూహెచ్ఓ తెలిపింది. వ్యాధి వ్యాప్తికి ప్రధాన కారణం జనావాసాల్లో టీకాలు వేయని కుక్కల సంఖ్య పెరగడమేనని తెలుస్తోంది. 2030 నాటికి భారతదేశాన్ని రేబిస్ రహితంగా మార్చాలనే లక్ష్యంతో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మానవ రేబిస్‌ను గుర్తించదగిన వ్యాధిగా వర్గీకరించింది. రేబీస్ నిర్మూలనకు 2021లోనే జాతీయ కార్యాచరణ ప్రణాళికను ప్రారంభించింది. స్థానిక సంస్థల అధికారుల సహకారంతో కుక్కలకు టీకాలు వేయడం వంటి కార్యక్రమాలు చేపడుతోంది.

Next Story