- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు క్లోజ్

- అతని మరణంలో ఎలాంటి అనుమానాలు లేవు
- అది ఆత్మహత్యగా పరిగణించండి
- రియా చక్రవర్తికి క్లీన్ చిట్
- ముంబై కోర్టులో క్లోజర్ రిపోర్టు దాఖలు చేసిన సీబీఐ
దిశ, నేషనల్ బ్యూరో: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంలో ఎలాంటి అనుమానాలకు తావు లేదని సీబీఐ తెలిపింది. ఆయన మరణానికి సంబంధించిన రెండు కేసులను మూసేస్తూ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) క్లోజర్ రిపోర్టును ముంబై కోర్టులో సమర్పించారు. సుశాంత్ మృతి కేసులో నటి రియా చక్రవర్తిపై అతని తండ్రి చేసిన ఆరోపణలకు సంబంధించిన కేసు, దాంతో పాటు సుశాంత్ కుటుంబంపై రియా చేసిన ఆరోపణల కేసుపై సీబీఐ దర్యాప్తు పూర్తి చేసింది. సుశాంత్ మృతి తర్వాత అతని తండ్రి కేకే సింగ్ పాట్నలో కేసు పెట్టారు. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు అయిన తర్వాత ఆగస్టు 2020లో సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. నటి రియా చక్రవర్తితో పాటు ఇతరులు సుశాంత్‌ను ఆత్మహత్యకు ప్రేరేపించారని, ఆర్థికంగా మోసం చేయడంతో పాటు మానసిక వేధింపులకు గురి చేశారని సుశాంత్ తండ్రి కేకే సింగ్ ఆరోపించారు. దీనికి ప్రతిస్పందనగా రియా చక్రవర్తి కూడా ముంబైలో కౌంటర్ ఫిర్యాదు చేశారు. సుశాంత్ సిస్టర్స్ అతని కోసం నకిలీ మెడికల్ ప్రిస్కిప్షన్ పొందారనా అందులో పేర్కొన్నారు.
కాగా, ఈ రెండు కేసులను సీబీఐ దాదాపు ఐదేళ్ల పాటు దర్యాప్తు చేసిన తర్వాత.. సుశాంత్ మృతిలో ఎలాంటి అనుమానాలు లేవని తేల్చింది. అతని మరణంలో నేరపూరిత కుట్ర లేదా బలవంతపు కుట్ర ఏమీ లేదని చెప్పింది. సుశాంత్ మరణంలో వెల్లడించిన అనుమానాలకు ఎలాంటి ఆధారాలు లేవని సీబీఐ క్లోజర్ రిపోర్టులో పేర్కొంది. అంతే కాకుండా రియా చక్రవర్తి, ఆమె కుటుంబంపై క్లీన్ రిపోర్టు ఇచ్చింది. 2020 జూన్ 14న బాంద్రాలోని తన నివాసంలో సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మృతి కేసును బీహార్ పోలీసులు సీబీఐకి అప్పగించారు. కాగా, సుశాంత్ ఆత్మహత్యలో ఎవరి బలవంతం లేదని, ఎయిమ్స్ కూడా సుశాంత్‌ది ఆత్మహత్యగానే నిర్దారించిందని సీబీఐ పేర్కొంది. సుశాంత్ మాజీ మేనేజర్ దిశా మృతి కేసును సీబీఐకి అప్పగించాలని ఆమె తండ్రి సతీశ్ బాంబే హైకోర్టును ఆశ్రయించిన కొన్ని రోజులకే సీబీఐ సుశాంత్ కేసును మూసివేయడం గమనార్హం.