వాణిజ్య ఒప్పందం మరింత వెనక్కు!

by Shyam |
వాణిజ్య ఒప్పందం మరింత వెనక్కు!
X

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియా సమావేశంలో ఇండియాతో వాణిజ్య ఒప్పందం చేసుకోవచ్చు. కానీ, ఎన్నికలకు ముందు జరుగుతుందా.. తర్వాత జరుగుతుందా అనేది చెప్పలేను. ఈ అంశంలో మరింత విస్తృతమైన ఒప్పందం చేయాల్సి ఉన్నందున దీన్ని ప్రస్తుతానికి పక్కనబెడుతున్నామని వ్యాఖ్యానించారు. ఈ నెల 24 ట్రంప్ ఇండియాకు రానున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలతో ఇండియా-అమెరికా దేశాల మధ్య వాణిజ్య ఒప్పందంపై ఆశలు సన్నగిల్లాయి.

ట్రంప్ ఇండియాకు రానున్న సందర్భంగా వాణిజ్య ఒప్పందం జరిగే అవకాశముందని, అందుకు తగినట్లుగానే చర్చలు జరిగాయని సంబంధిత అధికారులు భావించారు. అనూహ్యంగా ట్రంప్ తాజా వ్యాఖ్యలు వాణిజ్య ఒప్పందానికి ఇంకాస్త సమయం పడుతుందనే సంకేతాలు కనబడుతున్నాయి. వాస్తవానికి ట్రంప్ బృందంలో అమెరికా వాణిజ్య ప్రతినిధి రాబర్ట్ లైట్‌హైజర్ నేతృత్వంలోనే గతంలో ఇండియా-అమెరికా వాణిజ్య చర్చలు జరిగాయి. ప్రస్తుతం ట్రంప్ ఇండియా పర్యటనలో ఆయన ఉండే అవకాశం కనబడట్లేదని ఓ అధికారి అన్నారు. ట్రంప్ పర్యటనలో రాబర్ట్ లేకపోవడం, ట్రంప్ తాజా వ్యాఖ్యలు వాణిజ్య ఒప్పందం లేకపోవచ్చనే మాటలకు బలాన్ని చేకూరుస్తున్నాయి.

విశ్లేషకులు అభిప్రాయం ప్రకారం… అమెరికాతో పూర్తిస్థాయిలో వాణిజ్య ఒప్పందం లేకపోయినప్పటికీ పాక్షికంగా ఒప్పందం ఉండే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. స్టెంట్ వంటి వైద్యపరికరాల విషయంలో ఇండియా వ్యాపార నిబంధనలను సరళతరం చేయాలని అమెరికా కోరుతోంది. అయితే, గత నెల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వైద్యపరికరాల దిగుమతి సుంకాన్ని మరింత పెంచుతూ ప్రకటించారు. ఈ అంశంలో అమెరికా అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. అమెరికా సైతం అల్యూమియం, స్టీల్ వంటి దిగుమతులపై సుంకాన్ని పెంచింది. ఈ విషయంలో అగ్రరాజ్యంపై ఇండియా అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. పరస్పర సుంకాల పెంపుతో ఇరుదేశాల మధ్య నలుగుతున్న ఈ పరిణామాల కారణంగానే వాణిజ్య ఒప్పందం ఆలస్యమవుతోందని నిపుణులు చెబుతున్నారు.

అమెరికా నుంచి ఇండియాకు 2019 మొదటి మూడు త్రైమాసికాలలో ఎగుమతులు 4, దిగుమతులు 5 శాతం పెరిగాయి. 2019 ఏడాది తొలి మూడు త్రైమాసికాలలో మొత్తం రూ. 3.21 లక్షల కోట్ల విలువైన సరుకులు, సేవల ఎగుమతులు జరిగాయి. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 4 శాతం పెరిగింది. ఇక ఇండియా నుంచి అమెరికాకు వస్తువులు, సేవల దిగుమతుల విలువ రూ. 4.65 లక్షల కోట్లతో 5 శాతం పెరిగాయి. అంతకుముందు ఏడాదిలో రూ. 4.43 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.

ప్రస్తుత సగటు వార్షిక వృద్ధి రేటు 7.5 శాతంతో కొనసాగితే 2025 నాటికి మొత్తం ద్వైపాక్షిక వాణిజ్య విలువ రూ. 16.89 లక్షల కోట్లు ఉండొచ్చని యుఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ ఫోరమ్(యూఎస్ఐఎస్‌పీఎఫ్) అంచనా వేసింది. వస్తువులు, సేవల పరంగా అమెరికా ఇండియాకు ప్రధాన వాణిజ్య భాగస్వామిగా ఉంది. అమెరికా తర్వాత చైనాయే అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. 2018లో చైనాతో భారత వాణిజ్యం 13 శాతం వృద్ధి చెందగా, అమెరికాతో ఇండియా వస్తువుల వ్యాపారం 18 శాతం పెరిగింది. చైనా ప్రధానంగా ఎలక్ట్రానిక్స్, మిషనరీ, సేంద్రీయ రసాయనాలు, ప్లాస్టిక్, వైద్య పరికరాలు వంటి వాటిని ఇండియా మార్కెట్‌కు పంపిస్తుంటే, అమెరికా ఎక్కువగా ఖనిజ ఇంధనాలు, విలువైన రాళ్లు వంటి వాటిని ఎగుమతి చేస్తోంది. భారతీయ మార్కెట్‌లో ఎలక్ట్రానిక్స్, మెషినరీ, సేంద్రియ రసాయనాలు, వైద్య పరికరాల విషయంలో చైనాతో అమెరికా గట్టి పోటీని ఎదుర్కొంటోంది.

Advertisement

Next Story