ప్రజలంతా తమ జిల్లాకే వలస వస్తున్నారని.. సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి

by Sridhar Babu |
Mi-Srinivas-Reddy1
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే ఘన విజయం సాధిస్తారని రాష్ట్ర ఎక్సైజ్, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. మంగళవారం ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న రెండు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులుగా ఎంపికైన కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుల్ల దామోదర్ రెడ్డి నామినేషన్ల దాఖలు కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్, నాగర్ కర్నూల్ ఎంపీ రాములు, ఎమ్మెల్యేలు డాక్టర్ సి లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ఎస్. రాజేందర్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, డాక్టర్ అబ్రహం, జెడ్పీ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

నామినేషన్లు దాఖలు చేసిన అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్ధి పథాన పరుగులు తీస్తున్నదన్నారు. కరువు జిల్లాగా పేరుగాంచిన ఈ జిల్లాకే ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు చెందిన ప్రజలు వలసలు వస్తున్నారన్నారు. మరోవైపు కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన పలు గ్రామాల ప్రజలు మమ్మల్ని తెలంగాణ రాష్ట్రంలో కలపాలని డిమాండ్ చేస్తున్నారు అంటే ఈ రాష్ట్రం ఏ స్థాయిలో అభివృద్ధి చెందుతుందో ఆలోచించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ కు సంబంధించిన స్థానిక సంస్థల ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు మొత్తం 90 శాతంకు పైగా ఉన్నారని చెప్పారు. ఈ ఎన్నికలలో మా పార్టీ అన్ని స్థానాలను కైవసం చేసుకుని తీరుతుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్న దామోదర్ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి ఘన విజయం సాధించడం ఖాయమన్నారు. అంతకుముందు మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు, అభ్యర్థులు ప్రత్యేక వాహనంలో ఊరేగింపుగా బయలుదేరి నామినేషన్ దాఖలు కేంద్రానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed