RS ప్రవీణ్ కుమార్ వీఆర్ఎస్ వ్యూహం వెనక టీఆర్ఎస్?

by Anukaran |   ( Updated:2021-07-20 23:27:23.0  )
RS Praveen Kumar, cm kcr
X

దిశ, తెలంగాణ బ్యూరో: మాజీ ఐపీఎస్, అదనపు డీజీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వీఆర్ఎస్ వ్యవహారం రాష్ట్రంలో రాజకీయ చర్చకు దారితీసింది. టీఆర్ఎస్ ఒక వ్యూహం ప్రకారమే ఆయన చేత వీఆర్ఎస్ ఇప్పించేలా ప్లాన్ చేసిందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఆయన టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతారన్న వార్తలూ వినిపిస్తున్నాయి. అయితే రాజకీయాల్లో చేరడంపై ఇప్పటికింకా నిర్ణయం తీసుకోలేదని, హుజూరాబాద్ నుంచి పోటీ చేయడం లేదని ప్రవీణ్ కుమార్ స్వయంగా ప్రకటించారు. అయినా చర్చలు మాత్రం ఇంకా జోరుగానే జరుగుతున్నాయి. ఆయన వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లోనే ప్రభుత్వం ఆమోదించడం వెనక ప్రధాన ఉద్దేశం ఇదేనని బలమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో సీనియర్ ఐపీఎస్ అధికారి వీకేసింగ్ ఇదే తరహాలో వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకుంటే నెలల తరబడి పెండింగ్‌లో పెట్టిన ప్రభుత్వం ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి వ్యవహారం సైతం రెండున్నర నెలల పాటు సాగదీసిందన్న ఉదంతాలను మేధావులు ఉదహరిస్తున్నారు.

టార్గెట్ 2023?

హుజరాబాద్ నుంచి ఆయనను పోటీ చేయించాలని టీఆర్ఎస్ భావిస్తున్నప్పటికీ ప్రవీణ్ కుమార్ మాత్రం ఇంకా దాన్ని రూఢీ చేయలేదని టీఆర్ఎస్ వర్గాల సమాచారం. ఆయన సై అంటే వెంటనే దింపడానికి పార్టీ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తున్నది. రాజకీయాల్లోకి రావడంపై ఇప్పటికి ఏమీ చెప్పలేనని అంటున్నారే తప్ప కరాఖండిగా మాత్రం ‘రావడం లేదు’ అని చెప్పకపోవడం అనుమానాలకు తావిస్తున్నది. ప్రవీణ్ కుమార్ సిద్ధపడితే వెంటనే హుజూరాబాద్ నుంచి దింపడం లేదా 2023 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా దళితులను ఏకం చేయడానికి ఆయన సేవలను వినియోగించుకోవడంపై టీఆర్ఎస్ దీర్ఘదృష్టితో ఆలోచిస్తున్నది.

ఒక వర్గాన్ని ప్రభావితం చేయడంలో ప్రవీణ్ కుమార్ కీలకంగా మారనున్నారనేది టీఆర్ఎస్ భావన. ఇప్పటికే ‘స్వేరో స్టార్స్‘ పేరుతో లక్షలాది మంది మద్దతు కూడగట్టారు. హుజూరాబాద్ అభ్యర్థిత్వంపై వస్తున్న ఊహాగానాలను ఆయన కొట్టిపారేశారు. అయితే ఎన్నికల్లో ఆయన ప్రభావాన్ని పార్టీకి అనుకూలంగా మల్చుకోవడంపై పార్టీలో చర్చలు జరుగుతున్నాయి. రెండేండ్ల తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన అలంపూర్ సెగ్మెంట్ నుంచి పోటీచేసే అవకాశమూ లేకపోలేదు.

వీఆర్ఎస్ ఎన్నికల స్టంటేనా?

హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రవీణ్ కుమార్ వీఆర్ఎస్ చేయడం అనేక కోణాల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో ఒక ఐపీఎస్, మరో ఐఏఎస్ రాజీనామా చేస్తే ఆ దరఖాస్తులను చాలా ఆలస్యంగా క్లియర్ చేసింది ప్రభుత్వం. కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా (2019) ఇలాంటి పరిస్థితే చోటు చేసుకుంది. కరీంనగర్ డీటీసీగా ఉన్న చంద్రశేఖర్ గౌడ్ కు టీఆర్ఎస్ మద్దతు పలికి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దింపింది. అయితే నామినేషన్ల ప్రక్రియ చివరి రోజు వరకూ దానిపై క్లారిటీ ఇవ్వకుండా కేవలం ఒక రోజు ముందు ఆయన చేత రాజీనామా చేయించింది. ఉదయం చేసిన రాజీనామాను రాత్రికే ఆమోదించింది. మరుసటి రోజు ఉదయం ఆయన నామినేషన్ దాఖలు చేశారు.

ఐఏఎస్ ఆకునూరి మురళి కూడా 2019, జూలై 27న వీఆర్ఎస్‌కు అప్లై చేసుకున్నారు. కానీ ప్రభుత్వం ఈ దరఖాస్తును దాదాపు రెండున్నర నెలల పాటు పెండింగ్‌లో పెట్టి చివరకు సెప్టెంబర్ 16న ఆమోదం తెలిపింది. జైళ్ల శాఖ డీజీగా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి వినోయ్ కుమార్ సింగ్ (వీకే సింగ్) కూడా తనకు పదోన్నతి, పోస్టింగ్లో అన్యాయం చేశారంటూ గతేడాది జూన్ 29న వీఆర్ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నారు. కానీ ప్రభుత్వం చాలా ఆలస్యంగా స్పందించి చివరకు దాన్ని తిరస్కరించింది. ఆయనపై రెండు కేసుల్లో శాఖపరమైన దర్యాప్తు పెండింగ్‌లో ఉందనే కారణాన్ని పేర్కొన్నది. అక్టోబర్‌ 2న ఈ విషయాలను ప్రస్తావిస్తూ ఆయనకు నోటీసు పంపింది. చివరకు నవంబర్ 30న ఆయన పదవీ కాలం పూర్తి కావడంతో రిటైర్ అయ్యారు. ఈ రెండు సందర్బాల్లో రాజీనామా ఆమోదంపై ఆలస్యం చేసిన సర్కారు ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విషయంలో మాత్రం 24 గంటల్లోనే నిర్ణయం తీసుకోవడం ఊహాగానాలకు బలం చేకూర్చినట్లయింది.

ఆదిలాబాద్ నుంచి అలంపూర్ దాకా పర్యటన..?

ప్రజా సేవలో లీనమవుతానంటున్న ప్రవీణ్ కుమార్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నట్లు ‘స్వేరో స్టార్స్‘తో చెప్తున్నారు. స్వేరో కార్యక్రమాలు ఏవి జరిగినా హాజరుకావాలని నిర్ణయించుకున్నట్లు వాలంటీర్లు పేర్కొంటున్నారు. ఆదిలాబాద్ మొదలు స్వస్థలం అలంపూర్ వరకు ఇలాంటి పర్యటనలు ఉంటాయని స్వేరో కార్యకర్తలు ఉత్సాహంగా చెప్తున్నారు. రాజకీయ భవిష్యత్తును స్వయంగా ఆయన ప్రకటించేవరకు బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయడానికి వాలంటీర్లు సుముఖంగా లేరు.

డీవోపీటీ ప్రక్రియ లాంఛనమే

అదనపు డీజీగా ఉన్న ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వీఆర్ఎస్ విజ్ఞప్తికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. . రాష్ట్ర గురుకుల విద్యా సంస్థల కార్యదర్శిగా ఉన్న ఆయనను వెంటనే విధుల నుంచి రిలీవ్ చేసింది. ఆ స్థానంలో ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న రోనాల్డ్ రోస్‌ను నియమిస్తూ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇక కేంద్రంలోని డీవోపీటీలో జరగాల్సిన ప్రక్రియ లాంఛనమే. ప్రవీణ్ కుమార్ వీఆర్ఎస్‌పై కేంద్రం నుంచి మళ్లీ ఆమోదం పొందాల్సిన అవసరం లేదు. కేంద్ర సర్వీసు నిబంధనల ప్రకారం 30 సంవత్సరాల సర్వీసు లేదా 50 ఏళ్ళ వయసు అంశాలను పరిగణనలోకి తీసుకుని సదరు అధికారి ఏ రాష్ట్ర బ్యాచ్‌కి చెందినవారైతే ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇస్తే సరిపోతుందని నిబంధనలు చెప్తున్నాయి. ఆ ప్రకారం యాభై ఏళ్ళ వయసు దాటిన ప్రవీణ్ కుమార్ వీఆర్ఎస్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంతో ఇక కేంద్ర ప్రభుత్వం (డీవోపీటీ) నుంచి అనుమతి పొందాల్సిన అవసరం లేదంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయన వీఆర్ఎస్ విజ్ఞప్తికి ఆమోదం తెలిపిందన్న విషయాన్ని డీవోపీటీకి తెలియజేస్తే ఆ తర్వాత ఐపీఎస్ కేడర్ జాబితా నుంచి పేరు తొలగించే ప్రక్రియ లాంఛనం మాత్రమే.

Advertisement

Next Story