Minister Sridhar Babu: ‘ఎవర్‌నార్త్’లో వెయ్యిమందికి ఉద్యోగాలు

by Gantepaka Srikanth |
Minister Sridhar Babu: ‘ఎవర్‌నార్త్’లో వెయ్యిమందికి ఉద్యోగాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: నూతన ఆవిష్కరణలకు ప్రపంచ గమ్య స్థానంగా హైదరాబాద్ తన స్థానాన్ని సుస్థిర పర్చుకుంటోందని మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) స్పష్టం చేశారు. హైటెక్ సిటీలో గ్లోబల్ సామర్థ కేంద్రాన్ని(జీసీసీ) ప్రారంభించి మాట్లాడారు. మొదటి దశలో ఎవర్ నార్త్ 1,000 మంది ప్రతిభావంతులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తుందని వెల్లడించారు. ఈ ఆధునిక కేంద్రం హైదరాబాద్‌లోని నిపుణుల సామర్థ్యాన్ని వినియోగించుకుని ఆరోగ్యరంగంలో ఐటీ వినియోగాన్ని మరింత విస్తృతపరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బెంగళూరులోని సిగ్నా హెల్త్ సొల్యూషన్స్ సంస్థ, అంతర్జాతీయ ఆరోగ్య వ్యాపారానికి డేటా, అనలిటిక్స్, లాంటి సాంకేతిక సేవలను అందించే కేంద్రంగా ఎవర్ నార్త్ పనిచేస్తుందని ఆయన వివరించారు.

సిగ్నా సంయుక్త భాగస్వామ్యంతో ఎవర్ నార్త్ 1.9 కోట్ల భారతీయులకు ఆరోగ్య సేవలను అందిస్తోందన్నారు. 75,000 మంది ఉద్యోగులు, 30కు పైగా దేశాల్లో 18.6 కోట్ల వినియోగదారులతో, ఆరోగ్య సేవల రంగంలో నూతన ఆవిష్కరణలకు, ఇంటెలిజెన్స్‌కు దోహదం చేస్తోందని వెల్లడించారు. ఎవర్ నార్త్ సంస్థ ఏర్పాటుతో పరోక్షంగా వేలమందికి ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిగ్నా గ్రూప్ ప్రధాన సమాచార అధికారి నోయెల్ ఎడర్, రాష్ట్ర ప్రభుత్వ ఐటీ సలహాదారు సాయికృష్ణ, రాష్ట్ర లైఫ్ సైన్సెస్ ఫౌండేషన్ డైరెక్టర్ శక్తి నాగప్పన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story