MLC ఎన్నికల్లో గులాబీకి వ్యతిరేక పవనాలు తప్పవా..?

by Shyam |
MLC ఎన్నికల్లో గులాబీకి వ్యతిరేక పవనాలు తప్పవా..?
X

ఎమ్మెల్సీ అభ్యర్థులు నువ్వా నేనా అన్నట్టుగా పార్టీతో సంబంధం లేకుండా ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల వ్యాప్తంగా ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్సీ పోరుకు సీఈసీ షెడ్యూల్ విడుదల చేయడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. ప్రధానంగా అధికార పార్టీ, బీజేపీ అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తుంటే.. కాంగ్రెస్ మాత్రం అభ్యర్థిని మూడ్రోజుల క్రితమే ప్రకటించింది. దీంతో హస్తం ప్రచారంలో వెనుకబడే ఉందని చెప్పాలి. పోటీ చేసే అభ్యర్థులు మాత్రం చాలామందే ఉన్నారు. కొంతమంది చిన్నపార్టీల నుంచి పోటీ చేస్తుంటే.. మరి కొందరు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగారు. ఇప్పటికే మీటింగ్ లు, సమీక్షల పేరుతో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అందరినీ కలిసి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థుల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు.

దిశ ప్రతినిధి, ఖమ్మం : ఖమ్మం, వరంగల్, నల్లగొండ ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్ఎస్ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఎలాగైనా ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలని అధికార టీఆర్ఎస్, బీజేపీ హోరాహోరీగా తలపడుతున్నాయి. మూడు ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా సభలు, సమావేశాలు, ఆత్మీయ సమ్మేళనాల పేరుతో రెండు పార్టీలకు చెందిన అభ్యర్థులు గ్రాడ్యుయేట్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం అధికార పార్టీ తరఫున మంత్రి పువ్వాడ, మాజీ ఎంపీ శ్రీనివాస్ రెడ్డి, ఇతర ముఖ్యనేతలు పల్లాను గెలిపించాలని, అందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిస్తున్నారు. ఇక బీజేపీ తరఫున జిల్లా నేతలతోపాటు, రాష్ట్రస్థాయి నాయకులు సైతం ప్రచారం చేస్తున్నారు. ఎలాగైనా ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్న బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను, నిరుద్యోగుల పట్ల అనుసరించిన వైఖరి.. నోటిఫికేషన్ల పేరుతో యువతను మభ్యపెట్టడం.. ఉద్యోగులకు పీఆర్సీ వంటి అంశాలను ప్రధానంగా ఓటర్లలోకి తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా యువతను ఆకట్టుకునేలా ప్రసంగాలు చేస్తూ ఓట్లుగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు.

అదృష్టం పరీక్షించుకుంటున్న అభ్యర్థులు..

ప్రధాన పార్టీలతోపాటు కాంగ్రెస్ నుంచి రాములునాయక్, టీజేఎస్ అభ్యర్థి ప్రొఫెసర్ కోదండరామ్, వామపక్షాల అభ్యర్థిగా జయసారథి రెడ్డి, తెలంగాణ ఇంటి పార్టీ అభ్యర్థి, ఉద్యమ నేత చెరుకు సుధాకర్, యువ తెలంగాణ పార్టీ నుంచి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిండెంట్ రాణి రుద్రమారెడ్డి, ఇండిపెండెంట్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న పోటీ చేస్తున్నారు. వీరంతా యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్నవారే. అయితే ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరిక్షించుకుంటున్నారు. ప్రభుత్వం మీద వ్యతిరేకతే తమకు కలిసివస్తుందని.. తాము ఎలాగైనా గెలిచి తీరుతామంటూ ప్రకటనలు చేస్తున్నారు. స్కూళ్లు, కాలేజీలు, గ్రౌండ్లు, ప్రధాన సెంటర్లు, ఆఫీస్ లు తదితర ప్రాంతాల్లో ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా యువతను ఓట్లడుగుతూ ఒకసారి అవకాశమివ్వాలని కోరుతున్నారు.

నిరుద్యోగుల అసహనం.. ఉద్యోగుల ఆగ్రహం..

ఈసారి అన్ని అంశాలూ అధికార పార్టీకి ప్రతికూలంగానే ఉన్నాయంటున్నరు మేధావులు. నోటిఫికేషన్ల పేరుతో కాలయాపన చేయడంతో నిరుద్యోగులు, యువత ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. ఇదే విషయాన్ని గ్రహించిన అధికార పార్టీ నేతలు ఈసారి వారి ఓటుబ్యాంక్ ఏమవుతుందోననే ఆందోళనలో ఉన్నట్లు సమాచారం. అంతేకాక మెరుగైన ఫిట్ మెంట్, పీఆర్సీ, ప్రమోషన్లు, బదిలీలు ఇలా.. పలు అంశాలు ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తప్పకుండా ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు. ఇన్నాళ్లూ ఊరించి ఎటూ తేల్చని పీఆర్సీ ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడింది. వచ్చేది ఎన్నికల సీజన్ కాబట్టి జూన్ వరకు ఆ ప్రస్థావన లేకుండా పోయింది. ఇదంతా ప్రభుత్వం కావాలనే చేసిందని ఇప్పటికే ఉద్యోగులందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మూడు ఉమ్మడి జిల్లాల్లో కొన్నిచోట్ల నిరసనలు కూడా జరిగాయి. అధికార పార్టీ నేతలను యువత కొన్ని ప్రాంతాల్లో నిలదీస్తున్నారు. ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్చి 14న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తప్పకుండా ప్రభావం ఉంటుందనే వాదనా వినిపిస్తోంది. ఇక ఈ నియోజవర్గంలో పోటీ చేస్తున్న మిగతా అభ్యర్థులు ఒక్కొక్కరూ చాలా వరకు ప్రభావం చూపే వ్యక్తులే. ఇవ్వన్ని అంశాలూ అధికార పార్టీకి నష్టం చేకూర్చే అవకాశమే ఎక్కువంటున్నారు రాజకీయ వర్గాలు.

పట్టభద్రులకు ఎర..

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు అన్ని ప్రధాన పార్టీలకూ ప్రతిష్టాత్మకంగా మారిన నేపథ్యంలో ఓవైపు ప్రచారం నిర్వహిస్తూనే మరోవైపు పట్టభద్రులను మచ్చిక చేసుకునేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నాయి. తమ అభ్యర్థిని గెలిపిస్తే కలిగే లాభాలేంటో వివరించే పనిలో పడ్డారు. ఇప్పటికే ఆత్మీయ సమ్మేళనాల పేరుతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. అధికార పార్టీ అయితే ప్రతి యాభై మంది ఓటర్లకు ఒక ఇన్ చార్జిని ఏర్పాటు చేసి వారి సమాచారాన్ని సేకరించి వారిని కలిసి ఓటు వేయించేలా చర్యలు తీసుకుంటోంది. మరోవైపేమో.. విద్యార్థి సంఘాల నాయకులతో కూడా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఎన్నికల షెడ్యూల్ వెలువడడంతో అన్ని పార్టీలూ పూర్తిస్థాయి కార్యాచరణకు ప్లాన్ చేసుకుంటున్నాయి.

Advertisement

Next Story