ప్రత్యర్థులపై ప్రత్యేక నిఘా.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ భారీ ప్లాన్

by Anukaran |
mlc-elections
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రత్యర్థుల కదలికలపై అధికార టీఆర్‌ఎస్ పార్టీ గట్టి నిఘా పెట్టింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో అభ్యర్థులు ఎవరైనా టచ్‌లో ఉన్నారా లేదా వారి అంచనాలు ఏంటీ అన్న వివరాలను సేకరిస్తోంది. మరి కొన్ని గంటల్లో పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో నిఘాను కట్టుదిట్టం చేసినట్టు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఓటర్లే కాకుండా వారి బంధువులతో కానీ, ఇతరులతో కానీ టచ్‌లో ఉండి మంత్రాంగం నేర్పుతున్నారా అన్న విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు.

పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకూ కూడా మినిట్ మినిట్ అప్ డేట్ చేసేందుకు ఇంటెలిజెన్స్ వర్గాలను రంగంలోకి దింపినట్టు విశ్వసనీయంగా తెలిసింది. హుజురాబాద్ ఎన్నికల మాదిరిగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు రిపీట్ కాకూడదని భావిస్తున్న అధికార పార్టీ పకడ్బందీ వ్యూహంతో ముందుకు సాగుతున్నట్టు సమాచారం. అంతేకాకుండా ఈటల రాజేందర్ ప్రభావం పడకుండా ఉండేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈటల అంతర్గతంగా పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజేందర్‌కు అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్న ప్రాంతాల ఓటర్లపై కూడా స్పెషల్ నజర్ వేసింది.

క్యాంపులో పెరిగిన బలం..

ఉమ్మడి జిల్లాలోని 1324 మంది ఓటర్లు ఉండగా ఓటమి చవి చూడవద్దన్న లక్ష్యంతో పావులు కదుపుతున్న టీఆర్‌ఎస్ అధిష్టానం ఇప్పటికే క్యాంపులకు తరలించిన సంగతి తెలిసిందే. అయితే శుక్రవారం జరగనున్న పోలింగ్ ప్రక్రియలో ఆధిపత్యం స్పష్టంగా కనిపించేందుకు కూడా ప్రత్యర్థి పార్టీల ఓటర్లను కూడా అనుకూలంగా మల్చుకోవడంలో సక్సెస్ అయినట్టుగా తెలుస్తోంది. టీఆర్‌ఎస్ ముఖ్య నాయకత్వం వేస్తున్న అంచనాల ప్రకారం సొంత పార్టీకి చెందిన వారు 940 మంది, ఇతర పార్టీలకు చెందిన వారు 140 మంది వరకు టీఆర్‌ఎస్ అభ్యర్థులకు అనుకూలంగా ఓటు వేసేందుకు సుముఖంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో తమ గెలుపు ఖాయమే అని నిర్దారించుకున్నప్పటికీ హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు పునరావృతం కాకూడదన్న భావనతో ఆచూతూచి వ్యవహరిస్తున్నట్టుగా సమాచారం. టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఒకరిద్దరు పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసినా నష్టం జరగదని, అయితే వ్యతిరేక ఓటింగ్ వల్ల జరిగే నష్టాన్ని కూడా పూడ్చుకునేందుకు ముందు జాగ్రత్త చర్యగా ఇతర పార్టీ ఓటర్లను కూడా అనుకూలంగా మల్చుకున్నట్టు సమాచారం.

సర్దార్‎కే మద్దతు : ఈటల

స్థానిక సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆరోపించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీలుగా గెలిచిన వారు కూడా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. అయినా ఎమ్మెల్సీ ఎన్నికలు రాగానే పార్టీకే ఓటు వేయాలని ఎన్నో రకాలుగా టీఆర్‌ఎస్ ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఓటు వేసేటప్పుడు సెల్ ఫోన్లలో రికార్డు చేసుకోవాలని బెదిరించిన తీరు వారిని అవమానించినట్టుగా ఉందని ఈటల మండిపడ్డారు. జిల్లాలో ఉద్యమంతో కానీ ప్రజలతో కానీ సంబంధాలు లేని వారిని బరిలో నిలబెట్టారని విమర్శించారు. ఉద్యమ బిడ్డ అయిన సర్దార్ రవీందర్ సింగ్‌ను ఆశీర్వదించారని ఆయనకు ఫస్ట్ ప్రయారిటీ ఓటు వేయాలని కోరారు. ప్రజా స్వామ్యం వర్దిల్లాలంటే, డబ్బుల గీతం పోవాలంటే రవీందర్ సింగ్‌కు మద్దతు ఇవ్వాలని ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు.

Advertisement

Next Story