- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఛాన్స్ ఎవరికో..? ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన నేడే..
దిశ, తెలంగాణ బ్యూరో: ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరనే ఉత్కంఠకు నేడు తెరపడనుంది. గత కొద్ది రోజులుగా ఎవరిని ఎంపిక చేస్తారని, ఎవరికి అధిష్టానం ఆశీస్సులు ఉంటాయని పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. ఆశావాహుల్లో ఉత్కంఠ నెలకొంది. టికెట్ కోసం ప్రగతిభవన్ కు ఆశావాహులు క్యూ కట్టారు. అయితే ఇందులో గుత్తా సుఖేందర్ రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్ రావుకు ఫిక్స్ అవ్వగా.. మరో నలుగురితో పాటు గవర్నర్ కోటాకు ఒకరి పేరును కూడా మంగళవారం అధికారికంగా పార్టీ అధిష్టానం ప్రకటించనుంది. నామినేషన్లకు నేడు ఆఖరు తేదీ కావడంతో అభ్యర్థులు నామినేషన్లు వేయనున్నారు.
శాసనసభ్యుల కోటా నుంచి మండలికి ఎన్నికైన ఆరుగురు సభ్యుల పదవీకాలం జూన్ 3వ తేదీతో ముగిసింది. గవర్నర్ కోటలో ఎన్నికైన ప్రాతినిధ్యం వహిస్తున్న ఒకరి పదవీకాలం జూన్ 16తో ముగిసింది. వీరంతా అధికార పార్టీకి చెందిన సభ్యులే. ఈ జాబితాలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ నేతి విద్యాసాగర్, చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, కడియం శ్రీహరి, ఫరీదుద్దీన్, ఆకుల లలిత కాగా.. గవర్నర్ కోటాలో ప్రాతినిధ్యం వహిస్తున్న మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. అయితే కరోనా నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. అయితే ఎన్నికలకు ఈ నెల 9న నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 16వ తేదీ నామినేషన్లకు చివరి తేదీ. అయినప్పటికీ అభ్యర్థులను మాత్రం పార్టీ అధిష్టానం అధికారికంగా ప్రకటించలేదు. కానీ పాడి కౌశిక్ రెడ్డి, కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్ రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, ఎంసీ కోటిరెడ్డి, ఆకుల లలిత, ఎర్రోళ్ల శ్రీనివాస్ లను ఎమ్మెల్సీగా ఎంపిక చేసినట్లు తెలిసింది. ఇందులో కడియం లేదా గుత్తా సుఖేందర్ రెడ్డిని గవర్నర్ కోటాకు పంపే అవకాశమున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా గుత్తా, తక్కెళ్లపల్లికి కన్ఫామ్ అయింది. ఆకుల లలిత, పాడి కౌశిక్ రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్, కడియం శ్రీహరి, ఎంసీ కోటిరెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ నెల 29న పోలింగ్ నిర్వహించి అదే రోజు సాయంత్రం ఫలితాలను ప్రకటించనున్నారు.
క్యూకట్టిన నేతలు
ఈ నెల 15న ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని భావించిన ఆశావాహులు ఉదయం నుంచి ప్రగతి భవన్ కు క్యూ కట్టారు. అయితే కేసీఆర్ మాత్రం సాయంత్రం నల్లగొండ జిల్లా నేతలతో సమావేశం అయ్యారు. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో బండి సంజయ్ ధాన్యం కొనుగోళ్ల కేంద్రాల పరిశీలన సందర్భంగా బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య జరిగిన గొడవ గురించి ఆరా తీసినట్లు సమాచారం. అదే విధంగా ఉమ్మడి జిల్లాకు ఎవరికి ఎమ్మెల్సీ టికెట్ కేటాయిస్తే బాగుంటుందని చర్చించారు. పలువురు నేతలు కేసీఆర్ ను కలిసి టికెట్ ఇవ్వాలని అభ్యర్థించినట్లు సమాచారం. మరికొంత మందికి ఫోన్ చేసి ప్రగతిభవన్ కు రావాలని సూచించగా… వచ్చి కలిశారు.
రెడ్డి సామాజిక వర్గానికి మూడు పదవులు?
రెడ్డి సామాజిక వర్గానికి టీఆర్ఎస్ పార్టీ పెద్ద పీట వేసింది. గుత్తా సుఖేందర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, ఎంసీ కోటిరెడ్డికి అవకాశం కల్పించినట్లు తెలిసింది. అయితే ఒకే సామాజిక వర్గానికి చెందిన ముగ్గురికి ఇస్తుండటంతో పార్టీలోని ఇతర వర్గాలు గుర్రుగా ఉన్నాయి. అయితే ఆయా సామాజిక వర్గాల వారికి కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం కల్పిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చినట్లు సమాచారం.
పార్టీ బలోపేతానికే కౌశిక్ రెడ్డికి…
హుజూరాబాద్ నుంచి టీఆర్ఎస్ నుంచి ప్రాతినిధ్యం వహించిన ఈటల రాజేందర్ పార్టీ వీడటంతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఉప ఎన్నికల్లో బీజేపీ నుంచి ఈటల పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఆ నియోజకవర్గంలో టీఆర్ఎస్ ను బలోపేతం చేయడమే లక్ష్యంగా పార్టీ అధిష్టానం పాడి కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తున్నట్లు తెలిసింది. రెడ్డి సామాజిక వర్గం అంతా ఈటల వైపు ఉండటంతో కౌశిక్ రెడ్డికి పదవి ఇచ్చి టీఆర్ఎస్ వైపునకు తిప్పుకునేందుకు చేసే ప్రయత్నంలో భాగంగానే ఎమ్మెల్సీగా కేసీఆర్ అవకాశం కల్పించారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. రాబోయే ఎన్నికల్లో హుజూరాబాద్ లో గెలుపే లక్ష్యంగా ఇప్పటి నుంచి పావులు కదుపుతున్నారు.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలో కరీంనగర్ జిల్లాకు మరో అవకాశం కల్పించారు. జిల్లాకు చెందిన పాడి కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం వచ్చింది. ఇప్పటికే ఈ జిల్లాలో రెండు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించగా, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లను దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్సీ స్థానం కేటాయించినట్లు సమాచారం. ఇప్పటికే ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా శ్రీనివాస్, బీసీ కార్పొరేషన్ చైర్మన్ గా వకుళాభరణం కృష్ణమోహన్ ను నియమించారు.
ఉమ్మడి వరంగల్ కు ఇద్దరు…
ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కడియం శ్రీహరి, తక్కెళ్లపల్లి రవీందర్ రావుకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించినట్లు సమాచారం. కడియంకు పార్టీ అధిష్టానం రెండోసారి రెన్యువల్ చేసింది. తక్కెళ్లపల్లి ఉద్యమం నుంచి టీఆర్ఎస్ లో కొనసాగడంతో పాటు నల్లగొండ జిల్లాకు ఎన్నికల ఇన్చార్జిగా పనిచేస్తున్నారు. పార్టీకోసం పనిచేస్తున్న ఆయనకు కేసీఆర్ ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు.
మైనార్టీలకు మొండిచెయ్యి
మైనార్టీలకు టీఆర్ఎస్ అధిష్టానం మొండిచెయ్యి చూపింది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఫరీదుద్దీన్ పనిచేశారు. తాజాగా ఆయన పదవికాలం జూన్ 3న ముగిసింది. ఇప్పటికే ఆయనకు రెండుసార్లు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. ఈ సారి ఆయన స్థానంలో మరొకరిని ఎంపిక చేస్తామని భావించినప్పటికీ ఎవరిని ఎంపిక చేయలేదు. నామినేటెడ్ పోస్టులో ఫారూఖ్ హుస్సేన్, ఎమ్మెల్యే కోటాలో మహమూద్ అలీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో ముగ్గురు మైనార్టీలు ఉండగా ఇక ఇద్దరే మండలిలో కొనసాగనున్నారు.
నల్లగొండ నుంచి ఇద్దరికి…
గుత్తా సుఖేందర్ రెడ్డికి మరోసారి రెన్యూవల్ అయింది. శాసనమండలి చైర్మన్ గా పనిచేశారు. గత రెండు శాసనసభ ఎన్నికల సమయంలో ఎంసీ కోటిరెడ్డికి పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఎమ్మెల్సీ అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చారు. హామీ మేరకు కోటిరెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించినట్లు సమాచారం. నల్లగొండ జిల్లా నుంచి ఇద్దరికీ అవకాశం కల్పించగా, ఇద్దరూ రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే. దీంతో ఇతర సామాజిక వర్గాలు కొంత అసహనం వ్యక్తం చేస్తున్నాయి.