ఆ నగరంలో ఈ దుస్థితి రావడం దారుణం

by Shyam |
ఆ నగరంలో ఈ దుస్థితి రావడం దారుణం
X

దిశ ప్రతినిధి, వరంగల్: టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు అన్ని అబద్ధాలు చెబుతున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేశ్ రెడ్డి ఆరోపించారు. హన్మకొండ బీజేపీ పార్టీ ఆఫీస్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ…. గత నాలుగేండ్లలో వరంగల్‌లో రెండు సార్లు వరదలు వచ్చాయన్నారు. అనేక ఏరియాల్లో పడవలు, ఎండీఆర్‌ఎఫ్ బృందాలు తిరిగాయన్నారు. కాకతీయులు పాలించిన నగరంలో ఈ దుస్థితి రావడం దారుణమని పేర్కొన్నారు. వరదల్లో వరంగల్ ప్రజలు నష్టపోతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ క్షేత్ర స్థాయిలో పర్యటించి బాధితులను పరామర్శించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాజకీయ స్వార్థం కోసం టూరిస్ట్ బస్సులో మంత్రి కేటీఆర్ వచ్చి పిక్నిక్‌లా చూసి తిరిగివెళ్లిపోయారని విమర్శించారు.

ప్రజలతో, మీడియాతో మాట్లాడకుండానే కేటీఆర్ వెళ్లిపోయాడని తెలిపారు. హైదరాబాద్‌లో కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి వరంగల్‌ను ఆదుకున్నానని అనడం సిగ్గు చేటని మండిపడ్డారు. ఎవరిని ఎక్కడ ఎలా ఆదుకున్నారో ఒక శ్వేత పత్రాన్ని మంత్రి కేటీఆర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ ప్రజలకు 10 వేలు ఇవ్వడం స్వాగతిస్తున్నామని, కానీ వరంగల్‌లో అంతకు మించి నష్టం జరిగినా బాధితులను ఎందుకు ఆదుకోరని ఆయన ప్రశ్నించారు.

వరంగల్ నగరాన్ని ముక్కలు చేయాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఇక్కడి ప్రజాప్రతినిధులు డూ డూ బసవన్నాళ్ళ మారారని ఎద్దేవా చేశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు వరంగల్ పౌరుషం ఎక్కడ పోయిందని ప్రశ్నించారు. ఆమెరికా నుండి దిగగానే కేటీఆర్ లాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి టికెట్ రాలేదని అన్నారు. కిషన్ రెడ్డి లాంటి నాయకుడిని విమర్శించే స్థాయి కేటీఆర్‌కు లేదన్నారు. వరంగల్ నగరానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో చేసిన అభివృద్ధి పనులను టీఆర్ఎస్ చేసినట్లు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. GWMC పరిధిలో అండర్ డ్రైనేజీ నిర్మాణం చేస్తామని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ.. ఎక్కడ పోయిందన్నారు. వరంగల్ ప్రజలపై టీఆర్ఎస్ పార్టీకి ఎందుకీ వివక్ష అని ఆయన ప్రశ్నించారు.

Advertisement

Next Story