సాండ్ మాఫియా.. టీఆర్ఎస్ నేతల దందా

by Shyam |
సాండ్ మాఫియా.. టీఆర్ఎస్ నేతల దందా
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి : కాగ్నా నది వాగులో ఇసుక తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ఇసుకాసురులు సాండ్ మాఫియాతో కోట్లకు పడగలెత్తుతున్నారు. తోడుకున్నోళ్లకు తోడుకున్నంత రీతిలో ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. పంటపొలాల్లో ర్యాంపులు ఏర్పాటు చేసి దందా కొనసాగిస్తున్నారు. అధికార పార్టీ నాయకుల అండదండలతోనే తతంగమంతా నడుస్తుందని సమాచారం. అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదని పరిసర గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. వికారాబాద్ జిల్లాలో తాండూర్ నియోజకవర్గంలోని కాగ్నా నది వాగులో ర్యాంపులు ఏర్పాటు చేసుకొని నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తున్నారు. మూడు నెలల నుంచి జోరుగా దందా సాగిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే ఫైలెట్ రోహిత్ రెడ్డి అండతోనే ఇదంతా సాగుతుందనే సమాచారం. ఒక వేళ ఎమ్మెల్యే హస్తం లేకపోతే కర్నాటక రాష్ట్రానికి ఏవిధంగా ఇసుకను తరలిస్తారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనుల పేరుతో అనుమతులు తీసుకొని అక్రమ వ్యాపారం చేసుకుంటున్నారు. తాండూర్ నియోజకవర్గంలోని బషీరాబాద్ మండలంలో సాండ్ మాఫి యాపై దిశ ప్రత్యేక కథనం..

ర్యాంపులెందుకు ఏర్పాటు..?

ప్రభుత్వం అభివృద్ధి పనులకు అధికారుల అనుమతితోనే ఇసుకను తరలిస్తారు. కాగ్నా నది సమీపంలో ర్యాంపులు ఏర్పాటు చేసి అక్రమంగా ఇసుక దందా చేసుకుంటున్నారు. మెగా కంపెనీ మిషన్ భగీరథ ట్యాంకర్ల నిర్మాణానికి ఇసుక తరలింపునకు అవకాశం ఇవ్వాలని 435 క్యూబిక్ మీటర్ వరకు తోడుకునేందుకు రూ.3లక్షల డీడీని ప్రభుత్వానికి చెల్లించింది. ఈ కంపెనీ జనవరి 29న దరఖాస్తు చేసుకుంటే ఫిబ్రవరి 22న అనుమతి వచ్చింది. జనవరి 29 కి ముందే ర్యాంపులను ఏర్పాటు చేసుకొని ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా అక్రమ దందా కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ అనుమతితో అయితే రాత్రి సమయంలో బషీరాబాద్ మండలం గంగ్వారం గ్రామంలోని పంట పొలాల్లో డపింగ్ చేయాల్సిన అవసరం ఏముందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ పనులకు కాళేశ్వరం ఇసుకనే వాడుకోవాలని సూచించింది. అయినప్పటికీ స్థానిక ఎమ్మెల్యే.. మేగా కంపెనీ పేరుతో అనుమతులు తీసుకోని అక్రమ దందా చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. తీసుకున్న అనుమతులకు మించి ఇసుకను తోడేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.

రాత్రి సమయంలో డంపింగ్..

ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనుమతి తీసుకుంటే పని జరిగే చోటకే ఇసుక తీసుకెళ్లాలి. కానీ బషీరాబాద్, గంగ్వార్ గ్రామాల్లో స్థానిక ఎమ్మెల్యే అనుచరుల పొలాల్లో ఇసుకను డంపింగ్ చేస్తున్నారు. కాగ్నా నదిలో 6 టిప్పర్లు, ట్రాక్టర్ల సహాయంతో కర్నాటక రాష్ట్రానికి ఇసుకను తరలిస్తున్నారు. రాత్రి 10 తర్వాత టిప్పర్లు, ట్రాక్టర్లు నదిలోని ర్యాంపులపైకి పోతాయి. ఆ సమయం నుంచి తెల్లవారుజాము వరకు ఇష్టానుసారంగా ఇసుకను తరలిస్తున్నారని సమాచారం.

తాయిలాలతోనే అధికారుల మౌనం..

స్థానిక సంబంధిత అధికారులు ప్రతి నిత్యం పర్యవేక్షించాలి. ఎందుకంటే అనుమతి ఇచ్చిన ఇసుక ఎంత..? ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుందో చూసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుంది. కానీ అధికారులు అందిన కాడికి దండుకో… తమకింత ఇవ్వాలని చెప్పే పద్ధతిలో కొందరు అధికారులున్నారు. స్థానిక ప్రజలు తహసీల్ధారు కార్యాలయం ఎదుట ఇటీవల ధర్నా నిర్వహించారు. తక్షణమే ర్యాంపులు ఎత్తివేసి, అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయాలని కోరారు. ఆర్డీవో, జాయింట్ కలెక్టర్లకు ఈ విషయం తెలిసినా స్పందించడం లేదనే ప్రచారం సాగుతుంది. ఉన్నాతాధికారి నుంచి మొదులుకొని క్షేత్రస్ధాయి అధికారుల వరకు తాయిలాలు ముట్టడంతోనే మౌనంగా ఉంటున్నట్లు అనుమానాలకు తావునిస్తోంది.

ప్రభుత్వ ఆదాయానికి గండీ..

నిబంధనలకు అనుగుణంగా ఇసుక రవాణా జరిగితే ప్రభుత్వానికి ఫుల్ ఆదాయం. అధికార పార్టీ నేతలు అక్రమ ఇసుక దందాలు చేసుకొని ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. అధికార పార్టీలోని బేధాభిప్రాయలతోనే హత్యలకు దారి తీశాయనే చర్చ సాగుతుంది.

Advertisement

Next Story