కేసీఆర్ హర్ట్ అవకుండా నేతల ముందు జాగ్రత్త?

by Anukaran |
కేసీఆర్ హర్ట్ అవకుండా నేతల ముందు జాగ్రత్త?
X

దిశ, తెలంగాణ బ్యూరో : జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా నగరంలోని ఎల్బీ స్టేడియంలో టీఆర్ఎస్ నిర్వహిస్తున్న సభకు పార్టీ నాయకులు జిల్లాల నుంచి కూడా జనాన్ని సమీకరిస్తున్నట్టు సమాచారం. ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు స్వంతంగా చొరవ తీసుకుని స్టేడియం నిండేలా అక్కడి ప్రజలను తరలిస్తున్నారట. ప్రతీరోజూ జరిగే పార్టీ ర్యాలీలు, రోడ్‌షోలకు సమీప ప్రాంతాల నుంచి తరలిస్తున్నట్లుగానే ఇప్పుడు కేసీఆర్ బహిరంగసభకు కూడా వేలాది మందిని తరలిస్తున్నారనే టాక్ నడుస్తోంది. స్థానికంగా ఉండే ప్రజలు ఏ మేరకు తరలివస్తారనే సందేహం ఉన్నట్లుంది కాబోలు పార్టీ నేతలు స్టేడియంను నింపడానికి ఈ ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారని ఇతర పార్టీలు చెవులు కొరుక్కుంటున్నాయి.

స్టేడియం సామర్థ్యం సుమారు 25 వేల మంది అయినా పార్టీ వర్గాలు మాత్రం రెండు లక్షల మంది వరకు వస్తారని చెప్పుకుంటున్నాయి. కొవిడ్ నిబంధనల ప్రకారం ఈ స్టేడియం సామర్థ్యంలో సగం మందిని మాత్రమే నింపాలని, సోషల్ డిస్టెన్స్ నిబంధనను తప్పనిసరిగా పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం గత వారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల ప్రచారం సందర్భంగా నగరంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు చాలా చోట్ల చేదు అనుభవాలు ఎదురుకావడంతో జన సమీకరణకు స్థానిక నేతలు, కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని నగర శివారు ప్రాంతాల నుంచి కూడా ప్రజలను రప్పించాలనే భావించినట్టు సమాచారం.

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచార సభ కావడంతో నగరానికి చెందిన ఓటర్లు, పార్టీ కార్యకర్తలు హాజరుకావాల్సి ఉంది. కానీ నగరంలోని పరిస్థితుల కారణంగా శివారు ప్రాంతాలతో పాటు ఇతర జిల్లాల నుంచి శ్రేణులను రప్పించడమే ఉత్తమం అని భావించిన నాయకులు ఈ ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారని తెలుస్తోంది. పార్లమెంటు ఎన్నికల ముందు జరిగిన ఒక సభకు జనం పల్చగా రావడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ సభకు హాజరుకాకుండా అర్ధాంతరంగా రద్దు చేసుకున్నారు. అనంతరం సభ నిర్వహణ బాధ్యతలు తీసుకున్న నేతలకు కేసీఆర్ తో అక్షింతలు కూడా పడ్డాయని గుసగుసలు వినిపించాయి.

ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే ఎదురైతే కేసీఆర్ తీవ్రంగా హర్ట్ అయ్యే ఛాన్స్ ఉందని, అదే జరిగితే ఈసారి పదవులకే ముప్పు రావొచ్చని ముఖ్య నేతలు భయపడ్డారట. అందుకే అలాంటి పరిస్థితి ఉత్పన్నం కాకుండా ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో జనం వస్తారని భావించిన పోలీసులు ఎక్కడికక్కడ ట్రాఫిక్ మళ్ళింపు చర్యలు చేపట్టారు. రాత్రి ఎనిమిది గంటల వరకు ఈ ఆంక్షలు కొనసాగనున్నాయి.

Advertisement

Next Story