- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భిక్షాందేహి.. రోడ్డునపడిన ఉద్యమకారుడు!
దిశ, ముషీరాబాద్: ‘‘పార్టీ ఆవిర్భావం నుంచి పని చేశా. పార్టీ కోసం ఇల్లు అమ్ముకున్న. భార్య ముగ్గురు కూతుళ్లు, కొడుకు ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ఏ పని చేసే పరిస్థితి లేదు. కుటుంబ పోషణ భారంగా మారింది. ఇదంతా కేసీఆర్ దయ.. అమ్మ.. అయ్యా.. భిక్షాందేహి’’ అంటూ అంబర్ పేట నియోజకవర్గానికి చెందిన ఉద్యమకారుడు, టీఆర్ఎస్ సీనియర్ నేత అలీకేఫ్ చౌరస్తాలో పార్టీ కండువాను మెడలో వేసుకొని పల్లెం చేత పట్టుకొని భిక్షాటన చేశారు. తెలంగాణ ఉద్యమంలో పోరాడిన బతుకులు నేడు ఆగమైపోతున్నాయి. ఉద్యమ పార్టీ ఆవిర్భావం నుంచి గులాబీ జెండాను గుండెలకు అద్దుకున్న మనుషులు నేడు దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు.
అంకిత భావంతో పనిచేస్తున్న ఉద్యమకారులు రోడ్డున పడాల్సిన పరిస్థితి నెలకొంది. అధినేత అనుచిత వైఖరితో దిక్కుతోచని స్థితిలో ఉద్యమకారులు భిక్షమెత్తుకోవాల్సిన దుస్థితి దాపురించింది. అంబర్ పేట నియోజకవర్గానికి చెందిన ఉద్యమ నాయకుడు, టీఆర్ఎస్ నేత బోయి వెంకటరమణ వ్యథే ఇందుకు నిలువెత్తు నిదర్శనం. 2001లో ఉద్యమ పార్టీ ప్రారంభమైంది. ఆ సమయంలో నగరలోని అంబర్ పేట నియోజకవర్గం టీఆర్ఎస్ జెండాను ఎగరవేసిన నాయకుడు బోయి వెంకట రమణ .నాడు ఉద్యమ పార్టీ గ్రేటర్ ఇన్ చార్జి సుదర్శన్ రావు ఆధ్వర్యంలో కర్నె ప్రభాకర్ పర్యవేక్షణలో సభ్యత్వ నమోదు చేపట్టి పార్టీని విస్తరింపజేశారు. నియోజకవర్గంలో టీఆర్ఎస్ రమణగా అందరి నోళ్లలో నానాడు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, పార్టీ పటిష్టత కోసం, కుటుంబాన్ని వదిలి సొంత ఇల్లు అమ్ముకొని పార్టీ కార్యక్రమాలు చేపట్టారు. ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న రోజుల్లో టీఆర్ఎస్ జెండాను భుజాన వేసుకొని తిరిగిన రమణను ఆనాడు నవ్వుల పాలుజేసి, వెక్కిరించిన నాయకులు ఇప్పుడు టీఆర్ఎస్ లో కార్పొరేటర్లుగా కొనసాగుతున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతే ప్రస్తుత ఎమ్మెల్యే పార్టీలోకి వచ్చారు. ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి కేటీఆర్ సదరు నాయకుల మాటలు విని ప్రచారంలో ఉద్యమ నాయకుల ఊసే ఎత్తలేదన్న విమర్శలు ఉన్నాయి.
విభిన్న కార్యక్రమాలు
తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన టీఆర్ఎస్ రమణ నియోజకవర్గంలో ఎప్పటికప్పుడు వినూత్న కార్యక్రమాలు చేపడుతూ ప్రత్యేకతను చాటుకున్నారు. రాష్ట్ర సాధన కోసం 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి తిరిగి బరిలో నిలువగా.. వారి గెలుపు కోసం ఎల్లమ్మ పండుగ జరిపించాడు. స్వయంగా ఈ విషయాన్ని గెలుపొందిన సందర్భంగా ఎమ్మెల్యేలతో కేసీఆర్ ప్రస్తావించడం గమనార్హం. ఉద్యమకారులకే పార్టీ పోటీ చేసే అవకాశం కల్పించాలని కోరుతూ పటేల్ నగర్ లో టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పించాలని డిమాండ్ చేస్తూ పటేల్ నగర్ నుంచి మోకాళ్లపై నడుచుకుంటూ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వరకు వెళ్లారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అంబర్ పేట తహసీల్దార్ కార్యాలయం వద్ద 60 రోజుల పాటు దీక్ష కొనసాగించారు.
కంటికి రెప్పలా చూసుకుంటామన్నరు
రాష్ట్ర సాధన కోసం, పార్టీ అభ్యున్నతి కోసం అంకిత భావంతో పనిచేస్తే భిక్షమెత్తుకునే పరిస్థితికి తీసుకొచ్చారు. ఉద్యమకారులే ముఖ్యమని, వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటానని చెప్పి విస్మరించిన సీఎం కేసీఆర్ ఇక ప్రజలను ఏం పట్టించుకుంటారు. కుటుంబ పాలనతోనే రాష్ట్రం బాగుపడుతుందా, ఉద్యమకారుల నిర్ణయాలు పని చేయవా? కూతురు పదవి పోతే వెంటనే ఎమ్మల్సీని చేశారు. ఇప్పుడు కొడుకును సీఎం చేయాలన్న యావ తప్పితే ఉద్యమకారులపై పట్టింపులేదు. తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయని ఉద్యమంలో పాల్గొన్న ఎంతో మంది ఉద్యమకారులు నాలాగే రోడ్డున పడ్డారు.