- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
టఫ్ ఫైట్..!
దిశ, తెలంగాణ బ్యూరో: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలు రెండింటికీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ రెండు సెగ్మెంట్లలో గెలుపు అధికార, ప్రతిపక్ష పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. దీంతో అభ్యర్థుల ఎంపికలో రెండు పార్టీలూ గతంలో ఎన్నడూ లేనంతగా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. నల్లగొండ-ఖమ్మం-వరంగల్, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఓటర్ల జాబితా సవరణకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో పార్టీల్లో వేడి మొదలైంది.
పట్టభద్రుల నియోజకవర్గాల్లో విజయం సాధించేందుకు పార్టీలు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. టీఆర్ఎస్ అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా సన్నాహక సమావేశాలను నిర్వహిస్తోంది. స్వయంగా మంత్రులే రోజూ వీటిని పర్యవేక్షిస్తున్నారు. పట్టభద్రులను గుర్తించి ఓటర్ల జాబితాలో చేర్పించాల్సిందిగా పార్టీ సర్పంచ్ మొదలు మంత్రి వరకు టాస్క్ అప్పగించింది. ప్రభుత్వంపైన ఉన్న వ్యతిరేకత మీద విపక్ష పార్టీలు నమ్మకం పెట్టుకున్నాయి. ఆశావహులు పదుల సంఖ్యలో టికెట్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల నియోజవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పేరు దాదాపు ఖరారైనా, కర్నె ప్రభాకర్ పేరును కూడా అధినేత పరిశీలిస్తున్నారు. ఇక్కడి నుంచి తెలంగాణ జన సమితి వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ కోదండరాం పోటీచేస్తున్నందున, తప్పకుండా గెలిచే అభ్యర్థిని నిలబెట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఒంటరిగా పోటీచేస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి, పార్టీల మద్దతుతో ఉమ్మడి అభ్యర్థిగా నిలబడితే ఎలా ఉంటుందనేది ఆయన బేరీజు వేస్తున్నారు. నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ప్రదీప్ రావు, వరంగల్ జిల్లాకు చెందిన తక్కళ్ళపల్లి రవీందర్ రావు, నల్లగొండ ఎంపీగా పోటీ చేసిన వేమిరెడ్డి నర్సింహారెడ్డి, కోదాడ పట్టణానికి చెందిన జలగం సుధీర్ తదితరులంతా పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఈ మూడు జిల్లాల్లో గ్రాడ్యుయేట్ల నుంచి మాత్రమే కాక, స్వంత పార్టీ నేతలు, ఎమ్మెల్యేల నుంచి ఏ మేరకు మద్దతు, సహకారం లభిస్తుందనే దానిపైనా అధ్యయనం జరుగుతోంది.
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి మేయర్ బొంతు రామ్మోహన్‌ను బరిలోకి దించాలని టీఆర్ఎస్ తొలుత భావించింది. విద్యార్థి నాయకుడిగా, యువకుడిగా గుర్తింపు ఉన్న మేయర్ గెలుపు సునాయాసమని భావించింది. సర్వే ఫలితాలు ఆశాజనకంగా లేకపోవడంతో ఆయనను గవర్నర్ కోటాకు మళ్లించారని సమాచారం. ఆయనకు బదులుగా దేశపతి శ్రీనివాస్‌ను బరిలోకి దించాలనుకుంటోంది. ఇక్కడి నుంచి బీజేపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్సీ రాంచందర్ రావు పోటీ చేస్తున్నందున సామాజిక వర్గం కోణం నుంచి ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. గతంలో దేశపతిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ చేయాలన్న ప్రతిపాదన ఉన్నా రెండు, మూడు సార్లు చివరి నిమిషాల్లో మారిపోయింది. మర్రి రాజశేఖర్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, నాగేందర్ గౌడ్, కాసాని వీరేశ్, శుభప్రద్ గౌడ్ లాంటివారు కూడా పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.
టీఆర్ఎస్ తరఫున ఈ రెండు నియోజకవర్గాల్లో అభ్యర్థులను గెలిపించడానికి పార్టీ విద్యార్థి విభాగం టీఆర్ఎస్‌వీ చొరవ తీసుకోనుంది. కొత్తగా పట్టభద్రులైనవారిని ఓటర్ల జాబితాలో చేర్పించడంలో విద్యార్థి సంఘం కూడా తన వంతు పాత్ర పోషించనుంది. గతంలో విద్యార్థి సంఘం నాయకులుగా ఉన్న బాల్క సుమన్, బొంతు రామ్మోహన్, గెల్లు శ్రీనివాస్, రాజారాం యాదవ్ తదితరులంతా కృషి చేయనున్నారు. 2014-17 మధ్యకాలంలో పట్టభద్రులైనవారిని గుర్తించడం, స్వయంగా వారిచేత ఓటర్ల జాబితాలో చేరేందుకు దరఖాస్తు చేయించడం లాంటి పనులు దగ్గరుండి చేయించి వారి ఓట్లను ఆకర్షించుకోడానికి ప్రత్యేక వ్యూహాన్నే టీఆర్ఎస్ అమలు చేయించనుంది. కనీసంగా రెండు లక్షల మందిని ఓటర్ల జాబితాలో చేర్పించాలని టీఆర్ఎస్ టార్గెట్‌గా పెట్టుకుంది.
టీఆర్ఎస్ పార్టీకి రెండు ఎమ్మెల్సీ స్థానాలను గెలిపించుకోవడంలో అనేక సవాళ్ళు ఉన్నాయి. విద్యార్థులు, నిరుద్యోగులు, పట్టభద్రులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రైవేటు లెక్చరర్లలో ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకత, అసంతృప్తి ఈసారి ఏం చేస్తాయోనన్న భయం ఆ పార్టీ నేతలను వెంటాడుతోంది. దీనికి తోడు చాలా కాలంగా ఫీజు రీఇంబర్స్‌మెంట్ బకాయిలు ప్రభుత్వం నుంచి అందకపోవడం అటు విద్యాసంస్థల నిర్వాహకులకు, ఇటు విద్యార్థులకు అసంతృప్తిగా ఉంది. తెలంగాణ రాష్ట్ర సాధన సమయంలో టీఆర్ఎస్ ఇచ్చిన నియామకాల విషయంలో మాటలే తప్ప చేతలు లేవని బహిరంగంగా వస్తున్న విమర్శలు ఈసారి ఎలాంటి ప్రభావం చూపుతాయోననే భయమూ ఉంది. కరోనా సమయంలో ప్రైవేటు ఉపాధ్యాయులకు జీతాలు సరిగా రాకపోవడం, ప్రభుత్వం పట్టించుకోకపోవడం, కాంట్రాక్టు లెక్చరర్ల విషయంలో నిర్లక్ష్యం … ఇలాంటివన్నీ అధికార పార్టీకి ప్రతికూల అంశాలు.
గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇటు నల్లగొండ స్థానంలోనూ, అటు హైదరాబాద్ స్థానంలోనూ ఘోరంగా ఓటమి చవిచూసిన కాంగ్రెస్ పార్టీకి ఈసారి కొత్త ఆశలు పుట్టుకొచ్చాయి. స్వంత బలం మీద కాక అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకతపైనే ఎక్కువ ఆశలు పెట్టుకుంది. నల్లగొండ స్థానం నుంచి పోటీ చేయడానికి విద్యార్థి నాయకుడు మానవతారాయ్, గూడూరు నారాయణరెడ్డి, బెల్లయ్య నాయక్, మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్, దాసోజు శ్రవణ్ లాంటి వారు పదుల సంఖ్యలో ఉన్నారు. హైదరాబాద్ స్థానంలో పోటీ చేయడానికి మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, చిన్నారెడ్డి, సంపత్ కుమార్, వంశీచంద్ రెడ్డి, ఇందిరా శోభన్, పరిగి రామ్మోహన్ రెడ్డి లాంటివారు క్యూ కట్టారు. ఇంతకూ కాంగ్రెస్ పోటీ చేస్తుందా లేదా అనేది స్పష్టం కాలేదు. కూటమి ధర్మం ప్రకారం గతంలో టీజేఎస్‌కు తగిన గౌరవం ఇవ్వనందున, ఈసారి కోదండరామ్ కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.
ఎమ్మెల్సీ బరిలో దిగేందుకు ఈసారి జర్నలిస్టులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. గతంలో జర్నలిస్టుగా ఉన్న క్రాంతికిరణ్ ఆందోల్ ఎమ్మెల్యేగా గెలవడంతో చాలామందికి ఆసక్తి పుట్టింది. వీరంతా నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గంపైనే ఆశలు పెట్టుకున్నారు. సీపీఐ మద్దతుతో టీవీ జర్నలిస్టు జయసారథి రెడ్డి, దొంతు రమేష్, పల్లె రవి, పీవీ శ్రీనివాస్, రాణి రుద్రమ, తీన్మార్ మల్లన్న. ఇలా చాలామందే పోటీ చేస్తున్నారు. జర్నలిజం ప్రొఫెసర్ నాగేశ్వర్ గతంలో రెండు దఫాలు హైదరాబాద్ నియోజకవర్గం నుంచి పట్టభద్రుల ఎమ్మెల్సీగా కొనసాగారు. ఈసారి కూడా పోటీ చేసే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నాయి. వీరందరికీ స్థానిక బలంతోపాటు బంధువర్గం ఓట్లు ఎలాగూ పడతాయి కాబట్టి, అంతిమంగా అధికార పార్టీకే లాభం కలిగే అవకాశాలున్నాయి.
బీజేపీ తరఫున హైదరాబాద్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్సీ రాంచందర్ రావుకే మళ్ళీ టికెట్ దక్కే అవకాశాలు ఉన్నాయి. ఎన్నంరెడ్డి, మల్లారెడ్డి లాంటివారు టికెట్ ఆశిస్తున్నా రాంచందర్ రావుకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆ పార్టీ వర్గాల అభిప్రాయం. సౌమ్యుడు, ప్రజలకు అందుబాటులో ఉండడం, అవినీతి మచ్చ లేకపోవడం.. లాంటివన్నీ ఆయనకు కలిసొచ్చే అంశాలుగా ప్రస్తావిస్తున్నాయి. ఇక నల్లగొండ నియోజకవర్గం నుంచి మాత్రం పేరాల శేఖర్, ప్రేమేందర్ రెడ్డి, అశోక్ రెడ్డి, మనోహర్ రెడ్డి లాంటివారు ఆశిస్తున్నారు.