Manipur Violence: మళ్లీ రగులుతున్న మణిపూర్

by Mahesh Kanagandla |
Manipur Violence: మళ్లీ రగులుతున్న మణిపూర్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఏడాదిన్నరగా మణిపూర్(Manipur) రాష్ట్రం హింసాత్మక ఘటనలతో నెత్తురోడుతూనే ఉన్నది. మధ్యలో కాస్త శాంతించినట్టు కనిపించినా మళ్లీ ఇక్కడ హింస రగులుతున్నట్టు తెలుస్తున్నది. ఈ సారి జిరిబమ్(Jiribam) జిల్లా కేంద్రంగా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. సోమవారం రాత్రి నుంచి కనిపించకుండా పోయిన ముగ్గురు మహిళలు, ముగ్గురు పిల్లలు(కుకి సాయుధులు(Kuki Insurgents) కిడ్నాప్ చేసినట్టు మైతేయీల ఆరోపణ) శుక్రవారం సాయంత్రం విగతజీవులై కనిపించారు. దీంతో స్థానికులు ఆగ్రహావేశాలతో ఆందోళనలకు దిగారు. సీఎం ఎన్ బీరెన్ సింగ్(CM Biren Singh) సహా పలువురు మంత్రులు, ఆరుగురు ఎమ్మెల్యేల నివాసాలపై దాడి చేశారు. మూకను నియంత్రించడానికి పోలీసులు గ్యాస్ ఫైరింగ్ చేపట్టారు. పరిస్థితులు అదుపుదాటిపోయే పరిస్థితులు ఉండటంతో ప్రభుత్వం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో పలు జిల్లాల్లో కర్ఫ్యూ విధించింది. ఇంటర్నెట్ సేవలనూ నిలిపేసింది. రెండు రోజులపాటు ఈ ఆంక్షలు ఉంటాయని పేర్కొంది. ఇంఫాల్ వెస్ట్, ఇంఫాల్ ఈస్ట్, బిష్ణుపూర్, తౌబాల్, కాక్చింగ్, కాంగ్‌పోక్పి, చురాచాంద్‌పూర్ జిల్లాల్లో రెండు రోజులపాటు ఇంటర్నెట్ సేవలు నిలిచిపోనున్నాయి. సీఎం బీరెన్ సింగ్, ఆయన అల్లుడు రాజ్‌కుమార్ ఇమో సింగ్, సపం కుంజకేశ్వర్, స్వతంత్ర ఎమ్మెల్యే సపం నిషికాంత నివాసాలపై దాడులు జరిగినట్టు తెలిసింది. నవంబర్ 11వ తేదీన కొందరు సాయుధులు బోరోబెక్రా ఏరియాలో పోలీసు స్టేషన్‌పై దాడి చేసే ప్రయత్నం చేయగా బలగాలు అడ్డుకున్నాయి. ఇందులో 11 మంది సాయుధులు మరణించారు. ఈ క్రమంలోనే ఆ మిలిటెంట్లు ఆరుగురిని కిడ్నాప్ చేసినట్టు భావిస్తున్నారు. ఉద్రిక్తతల నేపథ్యంలోనే శనివారం స్కూల్స్, కాలేజీలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

Advertisement

Next Story

Most Viewed