‘భూభారతి’లో కాస్తు‌ కాలమ్‌.. ఆ రైతులకు భారీ ఉపశమనం

by Mahesh |
‘భూభారతి’లో కాస్తు‌ కాలమ్‌.. ఆ రైతులకు భారీ ఉపశమనం
X

దిశ, తెలంగాణ బ్యూరో: భూభారతి (రికార్డ్ ఆఫ్ రెవెన్యూ -2024) బిల్లును రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించింది. ఇందులో కాస్తు కాలమ్/అనుభవదారు కాలమ్‌ను పునరుద్ధరించింది. దీంతో దశాబ్దాలుగా భూములు దున్నుకున్న వారి పేర్లు ఇప్పుడు తిరిగి రికార్డుల్లోకి ఎక్కే అవకాశం ఉంది. ఈ అంశం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే కాస్తు కాలమ్ పునరుద్ధరణపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు చర్చ జరుగుతున్నది. ఏనాడో మార్పు జరిగిపోయిందని, ఇప్పుడు తిరిగి పేర్లు రాస్తామంటే గొడవలు తలెత్తుతాయని అభిప్రాయపడుతున్నది. అయితే ఎవరికి ఎవరితో గొడవలు తలెత్తుతాయి? ఎవరికి ఇబ్బంది? నాలుగైదు దశాబ్దాల నుంచి ఆ భూమి రికార్డుల్లో పేర్లను తిరిగి రాయడం ద్వారా ఏ హక్కుదారుడికి సమస్య? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

‘కాలమ్’కు చారిత్రక నేపథ్యం

తెలంగాణలో కాస్తు కాలమ్‌కు చారిత్రక నేపథ్యం ఉంది. కౌలుదారు పట్టాదారుడైన చరిత్ర సైతం ఉంది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, నక్సల్బరీ ఉద్యమాల ద్వారా లక్షలాది ఎకరాలు పేదలకు దక్కాయి. 1.30 కోట్ల ఎకరాల్లో 30 లక్షలకు పైగా రైతులు దున్నుకున్నవే. అయితే వీటిలో కొందరికి హక్కులు దక్కాయి. చాలా మంది రికార్డుల్లో దశాబ్దాలుగా కొనసాగారు. ధరణి వారి పట్ల దారుణంగా వ్యవహరించింది. వారి పేర్లను తొలగించడంతో ఆ భూములు దిక్కు లేకుండా పోయాయి. అనేక క్రయవిక్రయాలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు కాస్తు కాలమ్‌ను కొనసాగించడం చాలెంజ్‌తో కూడుకున్నదే. అయినా భూభారతిలో ఈ కాలం ఉండాలంటూ చాలా మంది సూచించారు. అయితే ఇప్పుడు సాధ్యాసాధ్యాలపై మార్గాలను అన్వేషించాల్సిందే. నెహ్రూ మాటల ప్రకారం.. ‘ఎట్లా వచ్చారనేది ముఖ్యం కాదు, పొషిషన్‌ని కాపాడాలి. ఇది ప్రభుత్వ బాధ్యత.’

ఎవరికి మేలు చేశారంటే..

భూ రికార్డుల ప్రక్షాళన, ధరణి పోర్టల్‌తో దొరలు, దేశ్‌ముఖ్‌లు, ఏనాడో అమెరికా, యూకేలకు వెళ్లిపోయిన పెద్దోళ్లు, పట్టణాల్లో బాగా స్థిరపడిన సంపన్నులకే మేలు జరిగిందన్న అభిప్రాయం ఉన్నది. భూ రికార్డుల ప్రక్షాళన తర్వాత రెవెన్యూ రికార్డులను కంప్యూటీకరించారు. అందులో తరతరాలుగా దున్నుకుంటున్న పేదల పేర్లను కాస్తు కాలమ్/అనుభవదారు కాలమ్/కల్టివేషన్ కాలమ్ నుంచి తొలగించారు. ఎలాంటి సంప్రదింపులు, విచారణ లేకుండానే ఏకపక్షంగా తీసేశారు. అనుభవదారు కాలమ్‌ని ఎత్తేశారన్న ప్రచారం సరైంది కాదు. ఆ కాలమ్‌లో దున్నేవాళ్ల పేర్లు తొలగించి పట్టాదారు పేర్లనే రాశారు. రికార్డుల్లో కాస్తు కాలమ్‌లో కొనసాగుతూ భూమి హక్కులు లేకపోయినా దశాబ్దాలుగా దున్నుకొని జీవిస్తున్న వారి సంఖ్య లక్షల్లోనే ఉంది. కానీ ధరణి పోర్టల్‌ అమల్లోకి తీసుకొచ్చేటప్పుడు ఎలాంటి చట్టం, జీవో, సర్క్యులర్ లేకుండానే వీళ్ల పేర్లను తొలగించారు.

కౌలుదారుకు ప్రభుత్వం ఎందుకు జవాబుగా ఉంటుందన్న గత ప్రభుత్వపు వాదనతో వాటిల్లిన నష్టం అంతా ఇంతా కాదు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 18 లక్షల ఎకరాల భూమికి సంబంధించి డేటాలో పేర్లు మారాయి. తమ భూమి కాదని వదిలేసుకొని వెళ్లిపోయిన భూస్వాములు ఊర్లలోకి వచ్చారు. వారికే పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేశారు. బెదిరింపులకు పాల్పడుతూ పొషెషన్‌లో ఉన్న పేదలను వెళ్లగొట్టి రియల్టర్లు కొనుగోలు చేసిన ఉదంతాలు ప్రతి జిల్లాలోనూ ఉన్నాయి. రంగారెడ్డి, మెదక్, కరీంనగర్, వరంగల్, నల్లగొండ, నిజామాబాద్, మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాల్లో లక్షలాది ఎకరాలకు భూస్వాములు తిరిగి ఓనర్లు అయ్యారు. పేదలు పొజిషన్‌లో ఉన్న భూములనే మళ్లీ అమ్మేసిన ఉదంతాలు అనేకం దర్శనమిస్తున్నాయి. ఉదాహరణకు రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం గిరి కొత్తపల్లి, జనగామ జిల్లా అడవి కేశవాపురం రెవెన్యూ రికార్డులను పరిశీలిస్తే ఎన్ని వందల ఎకరాలు చేతులు మారాయో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి గ్రామాలు రాష్ట్ర వ్యాప్తంగా అనేకం ఉన్నాయి.

పెండింగ్‌లో 9 లక్షల అప్లికేషన్లు

అనుభవదారుకు, కౌలుదారుకు మధ్య సంబంధం లేదు. వారసత్వంగా భూమి వచ్చినా పట్టాదారు పేరు దగ్గర తండ్రి లేదా తాత, కాస్తు కాలమ్‌లో వారసుల పేర్లు ఉన్నాయి. అలాగే భాగ పంపకాలు జరగని భూముల్లోనూ హక్కుదారుల పేర్లు ఉన్నాయి. సాదాబైనామాల కింద కొనుగోలు చేసిన సందర్భాల్లోనూ కాస్తు కాలమ్‌లో పేర్లు రాశారు. అలాంటి అప్లికేషన్లు తొమ్మిది లక్షల వరకు పెండింగులో ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed