ఆదేశాలు బేఖాతర్.. నేటి నుంచి ప్రముఖ స్కూల్స్ ఓపెన్

by Shyam |
ఆదేశాలు బేఖాతర్.. నేటి నుంచి ప్రముఖ స్కూల్స్ ఓపెన్
X

ఫిబ్రవరి ఒకటి నుంచి 9, 10 తరగతులను ప్రారంభించాలంటూ ప్రభుత్వం ప్రకటించింది. దీనికి భిన్నంగా ప్రైవేట్ యాజమాన్యాలు ఈ నెల 18 నుంచే తరగతులు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాయి. స్కూళ్లలోని అన్ని క్లాసుల టీచర్లను విధులకు హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేశాయి. కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు లాక్‌డౌన్ నాటి నుంచే నిబంధనలు యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నా విద్యాశాఖ చర్యలు తీసుకోవడంలో విఫలమవుతోందని ఉపాధ్యాయ, పేరెంట్స్ సంఘాలు విమర్శిస్తున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వం ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి క్లాసులు నిర్వహించాలని సూచిస్తుండగా.. ప్రైవేట్ స్కూళ్లు ఓ అడుగు ముందుకేసి నేటి నుంచే క్లాసులు నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి. ఈ నెల 18 నుంచి 9,10 తరగతి విద్యార్థులకు క్లాస్ రూం బోధన కొనసాగుతుందని, పిల్లల్ని స్కూళ్లకు పంపించాలంటూ తల్లిదండ్రులకు మెసేజ్‌లు పంపాయి. అన్ని క్లాసుల టీచర్లందరూ రావాల్సిందేనంటూ ఆదేశాలు జారీ చేశాయి. రాష్ట్రంలోని రెండు టాప్ కార్పొరేట్ స్కూళ్లలో క్లాసులను 20 రోజుల క్రితమే ప్రారంభించినట్టు సమాచారం. హైదరాబాద్ జిల్లా పరిధిలోని ప్రముఖ కార్పొరేట్ స్కూల్ యాజమాన్యం 9,10 తరగతి విద్యార్థులకు ఈవిధంగా క్లాస్ రూమ్ బోధన కొనసాగిస్తోంది.

వందలాది ఫిర్యాదులు.. పట్టించుకోని విద్యాశాఖ

లాక్‌డౌన్ నుంచి కార్పొరేట్ యాజమాన్యాలు ఆడింది ఆట పాడింది పాటగా మారిందని ఉపాధ్యాయ సంఘాలు విమర్శిస్తున్నాయి. ప్రైవేట్, కార్పొరేట్ యాజమాన్యాల దోపిడీపై వందల సంఖ్యలో విద్యాశాఖ మంత్రికి ఫిర్యాదులు అందాయి. చర్యలు తీసుకోకపోవడంతో కొన్ని సంఘాలు కోర్టుకెక్కాయి. మే నెల నుంచే ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్స్ ఆన్‌లైన్ క్లాసులను మొదలు పెట్టాయి. ఫీజులను కూడా యథేచ్ఛగా వసూలు చేశాయి. లాక్‌డౌన్‌లో ఫీజులు వసూలు చేయొద్దని ప్రభుత్వం జీవో జారీ చేసినా అమలు చేసే నాధుడే కరువయ్యాడు. తల్లిదండ్రులు, సంఘాల నుంచి ఎన్ని ఫిర్యాదులు అందినా విద్యాశాఖ పెడచెవిన పెట్టింది. లాక్‌డౌన్‌లో ఇక ప్రైవేట్ టీచర్లు, సిబ్బందికి జీతాలు చెల్లించాలని ప్రభుత్వమిచ్చిన జీఓలను, ముఖ్యమంత్రి మాటలను హామీ చేసిన ఒక్క యాజమాన్యం కూడా రాష్ట్రంలో లేదు. జీతాలు అందక, ఆర్థిక కష్టాలతో ఇప్పటి వరకు రాష్ట్రంలో 27 మంది ప్రైవేట్ టీచర్లు మరణించారు. అటు యాజమాన్యాల నుంచి, ఇటు ప్రభుత్వం నుంచి కానీ ఎలాంటి సహాయం అందలేదు. అనుమతి లేకుండా ఆన్‌లైన్ క్లాసుల నిర్వహణ, ఫీజుల వసూలు, టీచర్ల జీతాల చెల్లింపులు, ఫీజుల కోసం తల్లిదండ్రులపై ఒత్తిడి .. ఇలా ప్రతీ సందర్భంలోనూ కార్పొరేట్ యాజమాన్యాలు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ వస్తున్నాయి. తాజాగా పూర్తి స్థాయిలో ఫీజుల వసూలు కోసమే అన్ని క్లాసులకు భౌతికంగా తరగతులను ప్రారంభిస్తున్నారనే అనుమానాలను ఉపాధ్యాయ సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి.

Advertisement

Next Story