‘మేరా మా’.. కరోనా నుంచి కాపాడు!

by Sridhar Babu |
‘మేరా మా’.. కరోనా నుంచి కాపాడు!
X

దిశ, కరీంనగర్: ప్రకృతి ఒడిలో జీవనం సాగించేవారు బంజారాలు. వైవిధ్యభరితమైన వారి సంప్రదాయాలను చూసి నాగరీకులు ఆశ్చర్యపోతుంటారు. అటవీ ప్రాంతాల్లో నివాసం ఉంటూ తరతరాలుగా జీవనం సాగిస్తున్న వారిని కూడా నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) మహమ్మారి కలవరపెడుతోంది. దీంతో వైరస్ బారిన పడకుండా ప్రతి ఒక్కరినీ కాపాడాలని వేడుకుంటూ వారు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. తండా పెద్దల సూచనల మేరకు లంబాడా జాతి బిడ్డలు ‘మేరా మా ’, సంత్ సేవాలాల్ మహారాజ్‌లకు పూజలు చేస్తున్నారు. సమాజాన్ని రక్షించాలని, మానవాళి మనగడ అంతం కాకుండా చూడాలని వేడుకుంటున్నారు. ఉగాది, దసరా, దీపావళి పండుగలకు ముందు బంజారాలు మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీ. కానీ, ఇప్పుడు కరోనా మహమ్మారిని కట్టడి చేయాలని కోరుతూ పూజిస్తున్నారు. బంజారాల ఆరాధ్య దైవమైన ‘మేరా మా’ తల్లికి మేకను బలి ఇస్తూ ‘సొళాయి’
చేస్తున్నారు. సంత్ సేవాలాల్ మహారాజ్‌కు బెల్లంతో చేసిన ‘కడావో’ ప్రసాదాన్ని సమర్పించుకుంటున్నారు. కేవలం బంజారా బిడ్డలే కాకుండా సమాజంలోని జీవకోటిని అంతా చల్లగా చూడాలని కోరుకుంటున్నారు.

సమాజ క్షేమం కాంక్షిస్తూ..

పూర్వ కాలం నుంచి బంజారాలు ఆవులను పెంచి పోషిస్తూ అటవీ ప్రాంతాల్లోనే తండాలు ఏర్పాటు చేసుకుని జీవనం సాగించే వారు. ప్రకృతితో మమేకమయ్యే వీరు ఆచరించే ఆచారవ్యవహరాలు పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తులుగా భావిస్తారు. ఇప్పటికీ బంజారాలు ఎక్కువ మంది ఆధునికత కారణంగా వేషధారణలో కొంత మార్పులు చేర్పులు చోటు చేసుకున్నప్పటికీ పూజలు, వ్రతాల విషయంలో మాత్రం అనాదిగా వస్తున్న విధనాలను తు.చ తప్పకుండా ఆచరిస్తున్నారు. తమ ఆరాధ్య దైవంగా భావిస్తున్న మేరా మా, సంత్ సేవాలాల్ లను ప్రార్థిస్తూ సమాజంమంతా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నారు.

‘కరోనా’ మొదలైనప్పటి నుంచి..

కరోనా వైరస్ వ్యాప్తి మొదలైనప్పటి నుండి కట్టడికి ప్రతి ఆదివారానికో తండా చొప్పున పూజలు చేస్తున్నారు. తమ తండాల్లోనే నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక పూజలు ఒక్కో రోజు ఒక్కో తండాలో చేపడుతున్నారు. ఈ సమయంలో తండాలో ఉండే ప్రతి కుటుంబం పూజల్లో పాల్గొనడం, ఆరాధ్య దైవాలను పూజించి మొక్కులు తీర్చుకోవడం వంటివి చేస్తుంటారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం, మల్హర్, కాటారం మండలాల్లోని పలు బంజారా గ్రామాల్లో కరోనా కట్టడి పూజలు కొనసాగుతున్నాయి. గోదావరి నది పరీవాహక ప్రాంతమైన ములుగు జిల్లాలోని పలు తండాల్లోనూ ఈ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కరోనా మహమ్మారిని నిలువరించే సత్తా అతీంద్రీయ శక్తులున్న ఆ దైవాంశ సంభూతులైన మేరా మా, సంత్ సేవాలాల్ మహారాజ్ లకే సాధ్యమన్న నమ్మకంతో ఈ ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నామని బంజారాలు చెప్తున్నారు.

నిబంధనలు పాటిస్తూనే..

కరోనా కట్టడికి విధించిన లాక్ డౌన్ నిబంధనలు పాటించాలని అధికార యంత్రాంగం చెబుతున్నప్పటికీ నాగరిక ప్రజలు కొన్ని చోట్ల ఉల్లంఘనలకు పాల్పడుతూనే ఉన్నారు. కానీ, అడవుల్లో, తండాల్లో జీవనం సాగించే బంజారాలు నిబంధనలు పాటిస్తూనే కరోనా కట్టడికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. పూర్వీకుల నుంచి ఆరాధ్య దైవాలను పూజించే విధానాన్ని ఆచరిస్తున్న బంజారాలు మొక్కులు తీర్చుకునే సమయంలో నిబంధనలు పాటిస్తున్నారు. సోషల్ డిస్టెన్స్ (సామాజిక దూరం) అమలు చేయడంతోపాటు ఇతరాత్ర నిబంధనలు పాటిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

Tags: covid 19 prevention, Banjara People, Worship, lockdown, social distance, meri maa

Advertisement

Next Story