తిరుమల ‘ఆన్ లైన్’ బాధ్యతలు జియోకు..

by srinivas |
ttd
X

దిశ, ఏపీ బ్యూరో: టీటీడీ వెబ్ సైట్ నిర్వహణ బాధ్యతను జియోకు అప్పగించారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు ఆన్ లైన్ లోనే టికెట్లు తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం టీసీఎస్ సంస్థ తిరుమల వెబ్ సైట్ ను నిర్వహిస్తోంది. అయితే కొంతకాలంగా టీటీడీ వెబ్ సైట్ లో సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయి. దీంతో భక్తులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో టీటీడీ వెబ్ సైట్ నిర్వహణను జియోకు అప్పగించినట్టు టీటీడీ పేర్కొన్నది. జియో సంస్థ ఉచితంగానే ఈ సేవలను అందిస్తోందని టీటీడీ అధికారులు తెలిపారు.

కరోనా నేపథ్యంలో తిరుమలకు పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతిస్తున్నారు. దీంతో శ్రీవారి దర్శనానికి విపరీతంగా డిమాండ్ పెరిగింది. ప్రతి నెలకు ఓ సారి టికెట్లను టీటీడీ.. ఒకేసారి ఆన్‌లైన్‌లో విడుదల చేస్తోంది. అయితే గత కొంత కాలంగా సర్వర్లు మొరాయిస్తున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో బుకింగ్స్ చేసుకొనేందుకు ప్రయత్నిస్తుండటంతో సర్వర్లు నిలిచిపోతున్నాయి. దీంతో టీటీడీ వెబ్ సైట్ నిర్వహణ కోసం పలు అంతర్జాతీయ సంస్థలను సంప్రదించింది. చివరకు జియోకు బాధ్యతలను అప్పగించారు. అయితే టికెట్లు బుక్ చేసుకునే క్రమంలో వెబ్‌సైట్‌లో జియో మార్ట్ అనే లోగో కనిపించడం పట్ల కొందరు భక్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. టీటీడీని జియో సంస్థ.. ప్రచారానికి వాడుకుంటున్నదని వారు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ నడుస్తోంది. మొత్తానికి ఇప్పటికైనా టీటీడీ వెబ్ సైట్ సజావుగా పనిచేస్తే బాగుంటుందని భక్తులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Next Story