- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గచ్చిబౌలి టిమ్స్.. ఇంకెప్పుడు
గచ్చిబౌలి టిమ్స్ రేపటి నుంచి ఫుల్ యూజ్‌లోకి వస్తుంది. ఫుల్ ఇంప్లిమెంట్‌లోకి వస్తుంది. ప్రస్తుతానికి కొవిడ్ అవసరాలకు వాడుకుంటం. భవిష్యత్తులో అద్భుతమైన ఆస్పత్రిగా మార్చాలనుకుంటున్నాం. ఢిల్లీలోని ఎయిమ్స్ తరహాలో ఇక్కడ నిమ్స్‌కు దీటుగా తీర్చిదిద్దుతాం.
– ఏప్రిల్ 19న మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్
దిశ, న్యూస్ బ్యూరో: అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు గచ్చిబౌలిలోని టిమ్స్ ఆస్పత్రి సకల సౌకర్యాలతో సిద్ధంగా ఉన్నా కరోనా పేషెంట్లకు చికిత్స చేయడంలో మాత్రం అయ్యవారి ముహూర్తం కోసం ఎదురుచూస్తోంది. గాంధీ ఆస్పత్రిలో సామర్థ్యానికి మించి పేషెంట్లు వస్తున్నా టిమ్స్‌కు తరలించడానికి ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. టిమ్స్ నుంచి బెడ్‌లను తరలిస్తోందిగానీ పేషెంట్లను మాత్రం పంపడంపై నిర్ణయం తీసుకోలేకపోతోంది. ఇప్పటికిప్పుడు పేషెంట్లకు వైద్య చికిత్స చేయడానికి ఐసీయూ, ఆక్సిజన్ సౌకర్యం కూడా ఉందని చెప్తూనే కరోనా పేషెంట్లను తరలించడానికి మాత్రం చొరవ తీసుకోవడం లేదు. రాష్ట్రం మొత్తానికి ఏకైక కరోనా ఆస్పత్రిగా ఉన్న గాంధీ దవఖాన నుంచి ఇతర ఆస్పత్రులకు తరలించాలని జూనియర్ డాక్టర్లు మొరపెట్టుకుంటున్నా ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. అన్నీ సిద్ధంగా ఉన్నా టిమ్స్‌ను ఎందుకు వినియోగంలోకి తేవడం లేదన్నది ఇప్పుడు అంతుచిక్కని రహస్యంగానే ఉండిపోయింది.
అలంకారానికే పరిమితం కాబోలు!
ఎన్ని కరోనా కేసులొచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధమనీ, గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో కూడా ఆస్పత్రి సిద్ధమవుతోందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఏప్రిల్ 19న ప్రకటించారు. రేపటి నుంచే ఫుల్ యూజ్‌లోకి వస్తుందనీ, 1,500 బెడ్‌లు సిద్ధంగా ఉన్నాయని ప్రకటించారు. తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రిసెర్చి(టిమ్స్) అంటూ నామకరణం కూడా చేశారు. మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, అధికారులు వెళ్లి అక్కడి ఏర్పాట్లను పర్యవేక్షించారు. కానీ, దాదాపు రెండు నెలలు కావస్తున్నా అది వినియోగంలోకి రాలేదు. స్వయంగా మంత్రి కేటీఆర్ సైతం ఆస్పత్రిని సందర్శించి ఏప్రిల్ 21న ట్విట్టర్‌లో కామెంట్ చేశారు. కానీ, ఇప్పటిదాకా ఒక్క పేషెంట్ అడ్మిట్ కాలేదు. గాంధీ ఆస్పత్రి బెడ్ సామర్థ్యం 1,200 మంది కానీ, ప్రస్తుతం సుమారు రెండు వేల మంది చికిత్స పొందుతున్నారు. అయితే, టిమ్స్ నుంచి అదనపు బెడ్‌లను తీసుకొస్తున్నారుగానీ పేషెంట్లను మాత్రం అక్కడికి పంపడం లేదని జూనియర్ డాక్టర్ల సంఘం ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలోని నాలుగు కోట్ల మంది ప్రజలకు ఒకే ఒక్క కరోనా ప్రత్యేక ఆస్పత్రిగా ‘గాంధీ’ ఉందనీ, ఒత్తిడి తగ్గించాలంటే పేషెంట్లలోని కరోనా లక్షణాల తీవ్రతకు అనుగుణంగా వికేంద్రీకరణ విధానాన్ని అమలుచేస్తూ వివిధ ఆస్పత్రులకు తరలించాలని మంత్రికి ప్రతిపాదన పెట్టారు. నిమ్స్ తరహాలో ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థగా ఆవిర్భవిస్తుందని సీఎం గర్వంగా ప్రకటించినా అసెంబ్లీ సమావేశాల తర్వాతనే దీనిపై కదలిక వస్తుందని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాల సమాచారం. సమావేశాల్లో దీనికి ఆమోదం లభించడం, ఆ తర్వాత అటానమస్ సంస్థగా గుర్తించడానికి వీలుగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, భారత వైద్య మండలి (ఎంసీఐ)కి దరఖాస్తు చేసుకోవడం, అక్కడ్నుంచి అనుమతులు వచ్చిన తర్వాతనే దీనిపై మరింత స్పష్టత రానుంది. అప్పటివరకూ ఆ ఆస్పత్రి అలంకారానికి పరిమితం కాబోలు!
స్థలం బదిలీచేస్తూ ఉత్తర్వుల
గచ్చిబౌలి క్రీడాకారుల వసతి సౌకర్యాల కోసం పన్నెండేండ్ల కిందట రూపొందిన ఈ భవనం రాష్ట్ర క్రీడాభివృద్ధి శాఖ ఆధీనంలో ఉంది. మల్టీ, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా మారుస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించిన తర్వాత ఇందుకు సంబంధించి జీవో కూడా విడుదలైంది. సుమారు 9.16 ఎకరాల స్థలాన్ని వైద్య, ఆరోగ్య శాఖకు బదిలీ చేస్తూ ఉత్తర్వులూ వెలువడ్డాయి. ఆస్పత్రిగా మార్చడం కోసం సుమారు 17 కోట్ల రూపాయలనూ ప్రభుత్వం విడుదల చేసింది. కేవలం క్రీడాకారుల వసతి సౌకర్యం కోసం ఉన్న గదులను ఆస్పత్రి వార్డుల అవసరాలకు అనుగుణంగా కొత్త బెడ్‌లను సమకూర్చడం, ఆక్సిజన్ పైప్‌లైన్ సౌకర్యాన్ని కల్పించడం, లేబొరేటరీలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేయడం… ఇలా పనులన్నీ యుద్ధ ప్రాతిపదికన జరిగాయి. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సైతం పదిహేను రోజుల్లో 1,500 బెడ్‌లతో కూడిన ఆస్పత్రి తీర్చిదిద్దామని గర్వంగా ప్రకటించారు. కానీ, అది ప్రకటనలకే పరిమితమైంది.
ప్రత్యేక పర్యవేక్షణాధికారిగా రోనాల్డ్
యాభై ఐసీయూ బెడ్‌లతో పాటు మరో 1,450 సాధారణ బెడ్‌లను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రభుత్వం తరఫున రోనాల్డ్ రాస్ ప్రత్యేకంగా పర్యవేక్షణాధికారిగా నియమితులయ్యారు. మంత్రులు, ఉన్నతాధికారులు పలుమార్లు అక్కడకు వెళ్లి పనులను పరిశీలించారు. తగిన సూచనలు చేశారు. అయినా ఇప్పటికీ అది వినియోగంలోకి రాలేకపోయింది. కేవలం కరోనా ప్రత్యేక ఆస్పత్రిగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో అప్పటికప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా, ఇప్పుడు సకల సౌకర్యాలు సిద్ధంగా ఉన్నా పేషెంట్లకు మాత్రం అందుబాటులో లేకుండా పోయింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అనుకుంటున్న ఈ ఆస్పత్రిలోకి కరోనా పేషెంట్లను తరలించడంతోనే ప్రారంభోత్సవం చేయడం మంచి సందర్భంగా ఉండదన్న ఉద్దేశంతోనే విధాన నిర్ణయం తీసుకోకుండా పెండింగ్‌లో ఉంచినట్లు సమాచారం.
డాక్టర్ల, నర్సుల కేటాయింపు..
ఈ ఆస్పత్రిని వీలైనంత తొందరగా పేషెంట్లకు అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం భావించింది. ఇందుకోసం రాష్ట్రంలోని 23 జిల్లాల నుంచి 72 మంది డాక్టర్లను, 150 మంది నర్సులను, 17 మంది ల్యాబ్ టెక్నీషియన్లను ఈ ఆస్పత్రికి బదిలీ చేసింది. ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి అనుబంధంగా ఇది పనిచేసేలా ఉండేందుకుగాను అక్కడ్నుంచి కొద్దిమంది సిబ్బందిని ట్రాన్స్‌ఫర్ చేయాలనుకుంటోంది. ఈ సిబ్బందితో 1,500 మంది పేషెంట్లకు వైద్య సేవలు అందించడం కష్టం కాబట్టి అదనంగా రిక్రూట్ చేసుకోవాలని నిర్ణయించింది. ఇందుకోసం జనరల్ మెడిసిన్, అనెస్థీషియా, మైక్రో బయాలజీ, పాథాలజీ, బయో కెమిస్ట్రీ.. ఇలా అనేక విభాగాల్లో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు సహా అనేక రకాల అవసరాలకు 662 పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే, ఇవన్నీ ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిన ఉండేవే. రోజుల వ్యవధిలోనే ఆస్పత్రి వినియోగంలోకి వస్తుందని సీఎం, మంత్రులు ప్రకటించి రెండు నెలలైంది. ఇంకా ఏర్పాట్ల దశలోనే ఉంది.
అనుమతులు రానంతవరకు టిమ్స్ ఒక ఆస్పత్రి మాత్రమే..
పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సులు, రీసెర్చి లక్ష్యంతో ఏర్పాటవుతున్నందున ఇది ఒక అటానమస్, రీసెర్చి సంస్థగానే ఆవిర్భవించాల్సి ఉంటుందనీ, ఈ గుర్తింపు, అనుమతి లభించాలంటే చాలా పెద్ద కార్యాచరణే మున్ముందు ఉందని ఒక అధికారి వ్యాఖ్యానించారు. తొలుత ఈ భవనం మొత్తం వర్కింగ్ కండిషన్‌లోకి రావాలనీ, ఆ తర్వాతనే ఈ పనులు మొదలవుతాయని, అప్పటివరకు ఒక సాధారణ ఆస్పత్రిగా మాత్రమే దీన్ని పనిచేయించుకోవడం సాధ్యమవుతుందని వివరించారు. పీజీ స్టూడెంట్స్‌ను చేర్చుకోవాలంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్‌కు దరఖాస్తు చేసుకున్న తర్వాత పరిశీలన జరిగి అనుమతి రావాల్సి ఉంటుందని తెలిపారు. దీనికి తోడు అసెంబ్లీ సమావేశాల్లో నిమ్స్ తరహా అటానమస్ సంస్థగా గుర్తింపు రావాలంటే దానికి ఒక చట్టం, గవర్నర్ ఆమోదం తదితరాలు రావాల్సి ఉంటుందని తెలిపారు. ఆ తర్వాత యూజీసీ నుంచి అనుమతి రావాలన్నారు. దానికి కొనసాగింపుగా ఎంసీఐ గుర్తింపు కూడా రావాలని చెప్పారు. ప్రస్తుతానికి ఈ ప్రాసెస్ మొదలైందనీ, త్వరలో డైరెక్టర్ పోస్టు కోసం నోటిఫికేషన్ వెలువడనుందని సూచనప్రాయంగా తెలిపారు. ఈ ప్రక్రియ ఏదీ పూర్తికాకుండా కొవిడ్ పేషెంట్లను పెడితే ఆ తర్వాత కొన్ని సాంకేతికపరమైన సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందన్నారు. ప్రస్తుత కరోనా భయం ఇప్పట్లోనే వదిలేలా లేదనీ, ఒక ఇన్‌స్టిట్యూట్‌గా మారాలంటే ఇంకా చాలా పనులు పూర్తికావాల్సి ఉందని తెలిపారు. ఇన్‌స్టిట్యూట్‌గా మారితే చాలా ఇబ్బందులు పరిష్కారమవుతాయనీ, పేషెంట్లను చేర్చుకోడానికి మార్గం సుగమమవుతుందని చెప్పారు. ప్రారంభంలోనే కొవిడ్ పేషెంట్లను పెడితే బిల్డింగ్‌ను పూర్తిస్థాయిలో వాడుకోలేమనీ, ప్రభుత్వం ఆశించిన లక్ష్యం నెరవేరదన్నారు. ప్రభుత్వం ఈ అన్ని అంశాలను జాగ్రత్తగా ఆలోచిస్తూ ఉందనీ, టిమ్స్‌కు అవసరమైన ప్రొసీజర్ పూర్తయి చట్టం వస్తే అడ్డంకులన్నీ తొలగిపోతాయన్నారు. ఏ పర్మిషన్స్ లేకుండా ప్రారంభిస్తే లాడ్జింగ్‌లాగ ఉంటుందే తప్ప టిమ్స్ స్వరూపం, స్వభావం సంతరించుకోదని వివరించారు. అటానమస్ ఇన్‌స్టిట్యూట్‌లో అనేక విభాగాలు ఉంటాయనీ, ప్రతి విభాగానికీ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ లాంటివన్నీ ఉండాలన్నారు. అవన్నీ వచ్చిన తర్వాతనే ఎంసీఐకు దరఖాస్తు చేయాల్సి ఉంటుందన్నారు. సీటీ స్కాన్, ఎంఆర్ఐ లాంటి ఎన్నో సౌకర్యాలను సమకూర్చుకోవాలనీ, అన్ని డిపార్టుమెంట్లపై స్పష్టత (స్పెసిపికేషన్) వచ్చిన తర్వాత ప్రభుత్వం ముందడుగు వేస్తుందని పేర్కొన్నారు. టిమ్స్ డైరెక్టర్ వస్తే ఆ తర్వాత ఎన్ని డిపార్టుమెంట్లు అవసరమో, ఎన్ని పోస్టుల్ని ఎలా భర్తీ చేసుకోవాలో తదితర అంశాలు ఖరారవుతాయని తెలిపారు.