రోడ్డు ప్రమాదంలో టైగర్ వుడ్స్‌కు తీవ్ర గాయాలు

by Shiva |
రోడ్డు ప్రమాదంలో టైగర్ వుడ్స్‌కు తీవ్ర గాయాలు
X

దిశ, స్పోర్ట్స్ : దిగ్గజ గోల్ఫ్ ఆటగాడు టైగర్ వుడ్స్ మంగళవారం ఉదయం అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తన ఎస్‌యూవీ కారులో తెల్లవారుజామున వెళ్తుండగా కారు బోల్తా కొట్టింది. సంఘటన జరిగిన వెంటనే బెలూన్స్ తెరుచుకోవడంతో టైగర్ వుడ్స్ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. అయితే ఆయన కాళ్లకు తీవ్రగాయాలయినట్లు సమాచారం. ప్రమాద వార్త తెలుసుకున్న వెంటనే లాస్‌ఏంజెల్స్ అగ్నిమాపక సిబ్బంది, పారామెడికల్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని వుడ్స్‌ను ఆసుపత్రికి తరలించారు.

టైగర్ వుడ్స్ కాళ్లకు సర్జరీ చేయాల్సిన అవసరం ఉందని.. అతడు కోలుకోవడానికి సమయం పడుతుందని అతడి ఏజెంట్ మార్క్ స్టెయిన్‌బర్గ్ తెలిపాడు. ‘టైగర్ వుడ్స్ బతికి ఉండటం చాలా అదృష్టం’ అని లాస్ఏంజెల్స్ కౌంటీ పోలీసులు అన్నారంటే ప్రమాద తీవ్రత ఎలా ఉందో తెలియజేస్తున్నది. కాగా, 2009లో కూడా టైగర్‌వుడ్స్ ఒకసారి రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. 27 నవంబర్ 2009 ఉదయం పూట ఫ్లోరిడాలోని తన ఇంటికి వెళ్తుండగా చెట్టుకు బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దగ్దమైంది. కానీ వుడ్స్ గాయాలతో బయటపడ్డాడు. టైగర్ వుడ్ ఇప్పటి వరకు 82 పీజీఏ టైటిల్స్ గెలుచుకున్నాడు. 15 మేజర్ చాంపియన్‌షిప్‌లలో విజేత అయిన వుడ్స్.. తన ఖాతాలో ఐదు మాస్టర్ టోర్నీలు సైతం ఉన్నాయి.

Advertisement

Next Story