TRSలోకి ‘ఈటల’ ముఖ్య అనుచరుడు.. రాజేందర్ గెలుపు సాధ్యమేనా.?

by Sridhar Babu |   ( Updated:2021-07-06 06:27:22.0  )
Tummeti sammireddy
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : హుజురాబాద్ నియోజకవర్గంలో ఈటల అనుచరునిగా ముద్రపడ్డ తుమ్మేటి సమ్మిరెడ్డి తిరిగి టీఆర్ఎస్ పంచన చేరడం సరికొత్త చర్చకు దారి తీస్తోంది. మొదట కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమ్మిరెడ్డి జమ్మికుంట మార్కెట్ కమిటీ చైర్మన్‌గా పని చేశారు. ఆ తరువాత ఈటలను టార్గెట్ చేస్తూ ఆరోపణలు సంధించారు. కొంతకాలానికి రాజేందర్‌కు అనుకూలంగా మారి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇటీవల కాలంలో నెలకొన్న పరిణామాల్లోనూ ఈటలతోనే ఉన్న ఆయన గత 20 రోజులుగా అంటీ ముట్టనట్టు వ్యవహరించారు. తిరిగి టీఆర్ఎస్ పార్టీతోనే ఉంటున్నట్టు ప్రకటించడంతో ఈటల అనుచరుడు సొంత గూటికి వెళ్లడం వల్ల ఆయనకు నష్టమా లాభమా అన్న చర్చ సాగుతోంది.

ఢిల్లీ ఎఫెక్ట్..

వాస్తవంగా రాజేందర్ బీజేపీలో చేరేందుకు వెళ్లినప్పుడు కూడా ఆయనతో పాటు ఢిల్లీ వెళ్లిన సమ్మిరెడ్డికి ప్రాధాన్యత కల్పించలేదని కినుక వహించారు. ఈటల కాషాయం కండువా కప్పుకునేందుకు వెళ్లినప్పుడు పార్టీ ఆఫీసులోకి 25 మందిని మాత్రమే అనుమతించారు. ఈ జాబితాలో సమ్మిరెడ్డి పేరు లేకపోవడంతో కినుక వహించారు. ఢిల్లీ నుంచి వచ్చిన తరువాత నేరుగా జమ్మికుంటకు వెళ్లిపోయిన సమ్మిరెడ్డి.. ఈటల రాజేందర్‌ను కలవలేదు. ఈ విషయం బయటకు పొక్కడంతో టీఆర్ఎస్ ముఖ్య నాయకులు సమ్మిరెడ్డితో చర్చలు జరిపి తిరిగి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చేందుకు ఒప్పించి సఫలం అయ్యారు.

తీగ తగిలినట్టేనా..?

హుజురాబాద్‌లో జరిగిన ఈ పరిణామంతో టీఆర్ఎస్ పార్టీకి వెతకబోయే తీగ కాలికి తగిలినట్టేనా అన్న విషయంపై తర్జన భర్జన సాగుతోంది. హుజురాబాద్‌లో ఈటలను రాజకీయంగా దెబ్బతీయాలన్న సంకల్పంతో ఎత్తులపై ఎత్తులు వేస్తున్న టీఆర్ఎస్‌కు సమ్మిరెడ్డి రీ ఎంట్రీ లాభిస్తుందా అన్నదే ఇప్పుడు అసలైన చర్చ. ఒకప్పుడు ఈటలను టార్గెట్ చేసి విమర్శలు చేసిన సమ్మిరెడ్డి ఆయన పంచన చేరడం.. ఇప్పుడు మళ్లీ ఆయనపైనే ఆరోపణలు చేస్తుండటం వల్ల టీఆర్ఎస్ పార్టీకి ఏ మేరకు లాభిస్తుందోనన్నదే అంతుచిక్కకుండా పోయిందన్న వాదన వినిపిస్తోంది. అయితే ఈటల ముఖ్య అనుచరుల్లో ఒకరైన సమ్మిరెడ్డిని తమకు అనుకూలంగా మల్చుకోవడంలో సక్సెస్ అయిన టీఆర్ఎస్ రానున్న ఎన్నికల్లో ఏ మేరకు ఓట్లను సాధించుకుంటుందోనని అనుకుంటున్నారు.

చివరికి నీ గతి అంతే.. మంత్రి హరీశ్‌రావుకు ఈటల శాపం

Advertisement

Next Story