నగరంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తప్పవు: కమిషనర్ హెచ్చరిక

by Jakkula Mamatha |
నగరంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తప్పవు: కమిషనర్ హెచ్చరిక
X

దిశ, తిరుపతి: నగరంలో ఎక్కడైనా కూడళ్లు, పుట్ పాత్‌లు తదితర ప్రాంతాల్లో ఫ్లెక్సీలు, బోర్డులను ఏర్పాటు చేస్తే కఠినచర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య హెచ్చరించారు. నగరంలో ఫ్లెక్సీలు, బోర్డుల ఏర్పాటు, టి.డి.ఆర్. బాండ్ల పంపిణీ పై టౌన్ ప్లానింగ్ అధికారులతో కమిషనర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో జనన, మరణాలు, పండుగలు, రాజకీయ నాయకుల ఫ్లెక్సీలను, బోర్డులను నగరంలోని పలు కూడళ్లలో, ఫుట్ పాత్ లపై ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. దీంతో వాహన చోదకులు, ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.

నగరంలో ఫ్లెక్సీలు, బోర్డులను, ఏర్పాటు చేయరాదని అన్నారు. అనుమతులు పొందిన హోర్డింగులపై మాత్రమే ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులు, సిబ్బంది నగరంలో పర్యవేక్షణ చేసి ఎక్కడైనా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వాటిని తొలగించి వారికి అపరాధ రుసుము విధించాలని అధికారులను ఆదేశించారు. టి.డి.ఆర్. బాండ్లు పంపిణీకి అన్ని దస్త్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలని అన్నారు. అన్ని సక్రమంగా ఉన్నవారికి బాండ్లు పంపిణీ చేసేందుకు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, ఆర్.డి. సంజీవ్ కుమరన్, సబ్ రిజిస్ట్రార్ నీరజ, డిసిపి మహపాత్ర, తుడ సీపీఓ దేవి కుమారి, ఏసిపి బాలాజి, టీపీబీఓ లు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story