కేసీఆరే డైరెక్టుగా ఆ పేరు ప్రకటించనున్నారు

by Shyam |   ( Updated:2020-08-28 22:08:33.0  )
కేసీఆరే డైరెక్టుగా ఆ పేరు ప్రకటించనున్నారు
X

దిశ, న్యూస్ బ్యూరో : రాష్ట్రంలో మరో ఎన్నికల వాతావరణం నెలకొంది. దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి హఠాన్మరణంతో ఉప ఎన్నిక‌ల‌కు అనివార్య‌మైంది. ఇప్పుడు రాష్ట్ర రాజకీయం మొత్తం నియోజకవర్గంపైనే కేంద్రీకృతం అయ్యింది. ప్రభుత్వ వైఫల్యాలను అనుకూలంగా మల్చుకునేందుకు ఇది సరైన సమయమంటూ ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. దుబ్బాక నియోజకవర్గంలో కచ్చితంగా పోటీకి దిగాలని నిర్ణయం తీసుకున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోయినందున కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను నిలుపుతాయా అన్నది ఆసక్తికరంగా ఉండేది. కానీ 2014లో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చనిపోతే టీఆర్ఎస్ అభ్యర్థులను నిలిపి సీట్లు కైవసం చేసుకుంది. దీంతో గతాన్ని గుర్తు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ ఉపఎన్నికకు సై అనడంతో బీజేపీ కూడా రంగంలోకి దిగింది. అన్ని పార్టీ‌ల కంటే బీజేపీ రెండడుగులు ముందుకేసి ప్రచారాన్ని సైతం మొదలుపెట్టింది. దుబ్బాకలో స్థానికంగా, సోషల్ మీడియా వేదికగా బీజేపీ ఇన్‌చార్జి రఘునందనరావు ప్రచారం చేసుకుంటున్నారు. ప్రభుత్వం దుబ్బాక నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయించలేదని, నిధులు విడుదల చేయలేదంటూ వివరిస్తున్నారు. ఈ విషయాన్ని నిరూపించేందుకు కేవలం దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి నిధులపైనే 216 పిటిషన్లను సమాచార హక్కు చట్టానికి దరఖాస్తు చేశాడు. కాగా రామలింగారెడ్డి కుటుంబానికి టికెట్ ఇస్తే ఏకగ్రీవం చేస్తామని, కాంగ్రెస్ అధిష్ఠానాన్ని ఒప్పిస్తానని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రకటించారు. కానీ తాజాగా కాంగ్రెస్ కూడా అభ్యర్థిని బరిలోకి దింపుతామని ప్రకటించింది. తాము కూడా బరిలోకి దిగుతున్నామని టీజేఎస్ అధినేత కోదండరాం కూడా ప్రకటించారు. 2018 ఎన్నికల్లో టీజేఎస్ తరపున కూడా దుబ్బాకలో పోటీ చేయడంతో ఈసారి కూడా పోటీ చేస్తామని వెల్లడించారు. దీంతో దుబ్బాక నియోజకవర్గ ఉపఎన్నికల్లో చతుర్ముఖ పోరు నెలకొంది.

అప్పుడు టీఆర్ఎస్ చేయలేదా?

వారం క్రితం టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి దుబ్బాక నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిని నిలబెడుతుందని, ఇది పార్టీ నిర్ణయమని స్పష్టం చేశారు. ఉపఎన్నికపై పార్టీలో ఇతర నేతలు మాట్లాడితే అది వారి వ్యక్తిగతం అవుతుందని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్‌కు కాంగ్రెస్ పార్టీయే ప్రత్యామ్నాయం అని మేం చెబుతుంటే అక్కడ అభ్యర్థిని నిలపకుండా ఎలా ఉంటామని కరాఖండిగా చెప్పారు. గతంలో నారాయణఖేడ్, పాలేరులో తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు చనిపోతే టీఆర్ఎస్ ఏమాత్రం ఆలోచించకుండా అభ్యర్థులను పెట్టి గెలిచిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో మండలాల వారీగా సమావేశాలు కూడా ఏర్పాటు చేయాలని అక్కడి జిల్లా అధ్యక్షుడికి ఆదేశాలు జారీ చేయడంతో పార్టీ టికెట్ ఎవరికి ఇస్తుందన్న దానిపై చర్చ మొదలైంది. గతంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన నాగేశ్వర్‌రెడ్డికి ఇస్తారా లేకుంటే కొత్తవారిని ఎంపిక చేసి బరిలో నిలుపుతారా అన్నది పార్టీలో చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో అటు రేవంత్ రెడ్డితో పాటు పలువురి నేతలను ఈ ఎన్నికపై దృష్టి పెట్టాలని కోరింది. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీజేఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన భవానీరెడ్డి ఇటీవల కాంగ్రెస్‌లో చేరడంతో ఆమెకు టికెట్ ఇస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది. పార్టీ ఇద్దరిలో ఒక్కర్ని ఎంపిక చేస్తుందా లేకుంటే మరోనేతకు టికెట్ ఇస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.

కాంగ్రెస్, టీజేఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం

కాంగ్రెస్ నుంచి అందరినీ ఏకతాటిపైకి తీసుకు వచ్చేందుకు ఇప్పటికే మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహకు ఆ బాధ్యతలు అప్పగించాయి. టికెట్ ఎవరికి ఇవ్వాలనే అంశంపై సీనియర్లతో రాజనర్సింహ చర్చలు జరుపుతున్నారు. అయితే గత ఎన్నికల్లో కాంగ్రెస్‌, టీజేఎస్‌, టీడీపీ, సీపీఐ ఉమ్మడిగా ఎన్నికల్లో పోటీ చేశాయి. కానీ ఇప్పుడు దుబ్బాకలో కాంగ్రెస్‌, టీజేఎస్‌ పోటీ చేస్తామని వేర్వేరుగా ప్రకటించాయి. త్వరలో జరిగే పట్టభద్రుల నియోజకవర్గాలకు జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్‌తో లోపాయికారి ఒప్పందంలో భాగంగానే టీజేఎస్ దుబ్బాకలో పోటీ చేస్తోందని భావిస్తున్నారు.

బీజేపీ నుంచి మళ్లీ రఘునందన్‌రావు

బండి సంజయ్‌ తెలంగాణ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తర్వాత జరగబోతున్న ఉపఎన్నిక కావడంతో గెలుపుపై బీజేపీ తీవ్ర కసరత్తులు ప్రారంభించింది. పార్లమెంట్ ఎన్నికల్లో 4 సీట్లు గెలిచి టీఆర్ఎస్‌కు మేమే ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటున్న తరుణంలో దుబ్బాక ఉప ఎన్నిక కమలం పార్టీకి సవాల్‌గానే మారింది. దీంతో అభ్యర్థి ఎంపికను లెక్కలోకి తీసుకున్న రాష్ట్ర బీజేపీ మరోసారి రఘునందన్‌రావుకే అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్‌కు ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను చూపించేందుకు అనువైనదిగా భావిస్తోంది. ఇప్పటికే రఘునందన్‌రావు ప్రజల్లోకి వెళ్లి సైలెంట్‌గా పనిచేసుకుంటూ పోతున్నారు. కేసీఆర్ సర్కార్‌పై తనదైన శైలిలో బీజేపీ వాణిని వినిపిస్తుండటంతో పాటు, రెండుసార్లు అక్కడి నుంచే పోటీ చేశారు. ఈ నేపథ్యంలో ఆయనకు టికెట్‌ కేటాయిస్తేనే టీఆర్ఎస్, కాంగ్రెస్‌కు గట్టి పోటీ ఇచ్చినట్లు అవుతుందని పార్టీవర్గాలు భావిస్తున్నట్లు సమాచారం.

సోలిపేట ఫ్యామిలీకే టికెట్

నాలుగుసార్లు 2004, 2008, 2014, 2018లో విజయం సాధించిన సోలిపేట రామలింగారెడ్డికి నియోజకవర్గంలో మంచి పట్టుతో పాటు క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఉన్నారు. దీంతో రామలింగారెడ్డి ఫ్యామిలీలో టికెట్ ఇస్తేనే సెంటిమెంట్ కలిసి వచ్చి కారు టాప్‌ గేరులో దూసుకెళ్లి తమ స్థానాన్ని కాపాడుకున్న వాళ్లం అవుతామని హైకమాండ్ లెక్కలు వేస్తోంది. దీనిలో భాగంగానే ఆయన కుమారుడు సతీశ్‌రెడ్డికే టికెట్ ఇచ్చే అవకాశాలను పార్టీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. రామలింగారెడ్డి భార్య సుజాత పేరును కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వీరి ఫ్యామిలీని కాదని ఇతరులకు టికెట్ ఇస్తే జనాల్లోకి నెగిటివ్ ఫీలింగ్ వెళ్లి కాంగ్రెస్, బీజేపీలకు ఛాన్స్‌ ఇచ్చినట్లు అవుతుందని అక్కడి నేతలు కేటీఆర్‌కు విన్నవించినట్లు సమాచారం. అయితే పార్టీ అభ్యర్థిని ఇప్పుడే ప్రకటించి.. ప్రచారానికి పంపుతుందా లేకుంటే నోటిఫికేషన్ వెలువడిన తర్వాతే సీఎం కేసీఆరే డైరెక్ట్‌గా పేరును ప్రకటించి రంగంలోకి దూకుతారా అన్నది కీలకంగా మారింది. కానీ ఇప్పటికే దీనిపై హరీశ్‌రావుకు బాధ్యతలను అప్పగించినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. అయితే రామలింగారెడ్డి చనిపోయిన రోజు ఇక్కడి ఎన్నిక ఏకగ్రీవం అవుతుందని లెక్కలు వేసుకున్న నేతలకు ఇప్పుడు దుబ్బాకలో చతుర్ముఖ పోటీ కనిపిస్తుండటంతో రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. ఇదే సమయంలో మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కుటుంబం గురించి కూడా చర్చ మొదలైంది. ఆయన కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి కూడా పోటీలో ఉన్నారు. మరోవైపు సునీతా లక్ష్మారెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. దుబ్బాక ఉపఎన్నికలో ఎవరి సత్తా ఏంటో అనేది ఎన్నిక జరిగితేనే తేలుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ హడావిడి లేని ఈ సమయంలో దుబ్బాక ఉప ఎన్నికలు చర్చల్లో నిలుస్తున్నాయి.

Advertisement

Next Story