దుబ్బాక ఉపఎన్నికలు: ఇప్పుడిదే హాట్ టాపిక్

by Anukaran |
దుబ్బాక ఉపఎన్నికలు: ఇప్పుడిదే హాట్ టాపిక్
X

దిశ, తెలంగాణ బ్యూరో : దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో తొలుత రెండు ప్రధాన పార్టీల మధ్యనే పోరు ఉంటుందన్న వాతావరణం కనిపించింది. చెరుకు శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన తర్వాత అది త్రిముఖ పోరుగా తయారైంది. అధికార టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్, బీజేపీలు హోరాహోరీ ప్రచారం చేస్తున్నాయి. టీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లపైనే ఈ రెండు పార్టీల అభ్యర్థులు ఆశలు పెట్టుకున్నారు. ఈ ముక్కోణపు పోటీ ఎవరికి చేటు తెస్తుంది.. ఎవరికి లాభం చేకూరుస్తుందనేదానిపై స్థానికంగా ఆసక్తిక చర్చ నడుస్తోంది. టీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లలో మాత్రమే చీలిక వస్తుందా? లేక మున్ముందు మూడు పార్టీల్లో గుంభనంగా సాగే రాజకీయ క్రీడ అన్ని పార్టీల ఓట్లనూ చీలుస్తుందా? అనేది నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది.

చెరుకు శ్రీనివాసరెడ్డి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నంతవరకూ ప్రధాన పోటీ అధికార పార్టీకి, బీజేపీకి మధ్య మాత్రమే ఉంటుందని జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరో అప్పటికి ఇంకా తేలకపోవడం ఇందుకు కారణం. కానీ అనూహ్యంగా శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ గూటికి చేరడంతో ఒక్కసారిగా దుబ్బాక నియోజకవర్గంలోని వాతావరణం మారిపోయింది. చెరుకు ముత్యంరెడ్డికి ప్రజల్లో ఉన్న గుర్తింపు కలిసొస్తుందని కాంగ్రెస్ భావన. అయితే కాంగ్రెస్‌లో చేరడం ఒక వ్యూహం ప్రకారం జరిగిందా? లేక యాధృచ్చికంగా జరిగిందా అనే అనుమానాలు నియోజకవర్గంలో చక్కర్లు కొడుతున్నాయి. ఇది కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చే అంశమా? లేక అధికార పార్టీకి మేలు చేసేదా? అనేంత స్థాయిలో ప్రజల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఎరికి లాభం? ఎవరికి నష్టం?

దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీచేస్తున్న పార్టీలకు వాటివాటి సంప్రదాయ ఓటు బ్యాంకు ఉంది. టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్, బీజేపీలు పోటీ పడుతున్నాయి. ఈ రెండు పార్టీలూ ప్రభుత్వాన్ని విమర్శించడంపైనే ఫోకస్ పెట్టి అలాంటి సెక్షన్ ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాయి. తద్వారా ఓట్లలో చీలిక అనివార్యమవుతోంది. ఈ చీలిక చివరకు ఏ పార్టీకి ఉపయోగపడుతుందో తెలిందేమీ కాదు. అందువల్ల ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నది సెకండ్ ప్లేస్ ఎవరికి? థర్డ్ ప్లేస్ ఎవరికి అనేది తేల్చడానికా అనే వాదనలు తెరపైకి వస్తున్నాయి. ఇవన్నీ ఏరోజుకారోజు మారుతున్న పరిస్థితుల్లో అంచనాగా వస్తున్నవే. ఒక పార్టీ నుంచి మరొక పార్టీలోకి జంపింగ్‌లు రోజువారీ కార్యక్రమాలుగా సాగుతున్నాయి. వారి వెంట క్షేత్రస్థాయిలో ఉండే కార్యకర్తలు, ప్రజల ఓట్లు దీంతో ప్రభావితమవుతున్నాయి. నిన్నటిదాకా బీజేపీలో ఉన్న కమలాకర్‌రెడ్డిని కాంగ్రెస్‌లోకి లాక్కునే ప్రయత్నాలు మొదలయ్యాయి. కాంగ్రెస్‌లో నిన్నటివరకూ ఉన్న నర్సింహారెడ్డిని టీఆర్ఎస్ లాగేసుకుంది. టీఆర్ఎస్‌లో ఉన్న చెరుకు శ్రీనివాసరెడ్డిని కాంగ్రెస్ లాగేసుకుంది. ఇలా ప్రతీరోజూ ఆయా స్థాయిల్లోనివారిని ఇతర పార్టీలు లాక్కోవడం నిత్యకృత్యంగానే జరుగుతూ ఉంది. ఇలాంటి చేరికలతో గ్రామ స్థాయిలో వందల సంఖ్యలో ఉండే ఓట్లను సైతం వదులుకోవద్దనే ఆ పార్టీల వైఖరి అర్థమవుతోంది.

అందరిదీ సానుభూతి మంత్రమే..

దుబ్బాక ఎమ్మెల్యేగా ఉన్న సోలిపేట రామలింగారెడ్డి మృతితో వచ్చిన ఉప ఎన్నిక కాబట్టి ఆయన భార్య పోటీచేస్తున్నందున సహజంగానే సానుభూతి పవనాలు ఉంటాయి. ఈ నియోజకవర్గంలో పట్టు కలిగిన హరీశ్‌రావు స్వయంగా దగ్గరుండి మరీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ వ్యూహ రచన చేసినందువల్ల గెలుపు ఖాయమనే నమ్మకం ఆ పార్టీ కార్యకర్తల్లో నెలకొంది. మరోవైపు ఇప్పటికే రెండుసార్లు అసెంబ్లీకి, ఒకసారి పార్లమెంటుకు పోటీచేసినా గెలవలేకపోయిన సానుభూతిపైన కూడా బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు నమ్మకం పెట్టుకున్నారు. ఈ ఒక్కసారికి తనను గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. మరోవైపు గతంలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచి మంత్రిగా పనిచేసిన చెరుకు ముత్యంరెడ్డి పలుకుబడి, ప్రజల్లో ఉన్న గుర్తింపును ఇప్పుడు ఆ పార్టీ తరఫున పోటీ చేస్తున్న ఆయన కొడుకు చెరుకు శ్రీనివాసరెడ్డి వాడుకుంటున్నారు. ఆయన సానుభూతిపై చాలా ఆశలే పెట్టుకున్నారు. అందరూ సానుభూతిపైన పెద్ద అంచనాలతోనే ఉన్నారు.

సానుభూతి పనిచేస్తుందా?

కానీ ఈ సానుభూతి ఫ్యాక్టర్ దుబ్బాకలో నిజంగానే పనిచేస్తుందా? అదే పనిచేసేటట్లయితే అందరిమీదా ఆయా స్థాయిలో ప్రభావం వేయక తప్పదు. చివరికి అది ఎవరికి మేలు చేకూరుస్తుందో అంచనా వేయడం కష్టం. నిజంగా సానుభూతికి అంత ప్రాధాన్యత ఉన్నట్లయితే గతంలో చాలా ఎన్నికల్లో ఇది పనిచేసి ఉండాలి. అనేక రాష్ట్రాల్లో ఇలాంటి సానుభూతి అంశం బెడిసికొట్టింది. తెలంగాణలో సైతం నారాయణఖేడ్, పాలేరు నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో సానుభూతి అంశం పనిచేయలేదు. ఇక పలుకుబడి విషయాన్నే చూసుకుంటే అది కూడా పెద్దగా ప్రభావం చూపింది లేదు. గతంలో ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ కూడా ఓడిపోయారు. ఏడాదిన్నర క్రితం సీఎం కేసీఆర్ కుమార్తె కవిత కూడా నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి చెందారు. సానుభూతి, పలుకుబడి లాంటివి అన్ని సందర్భాల్లో పనిచేయవనేది వీటిని బట్టి తెలిసిపోతోంది. ఇదిలావుండగా బుధవారం బీజేపీ, గురువారం కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్లు వేయనున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story