హోమం పేరిట మోసం… ఒంటిరి మహిళలే లక్ష్యం

by Sridhar Babu |   ( Updated:2020-09-28 03:29:19.0  )
హోమం పేరిట మోసం… ఒంటిరి మహిళలే లక్ష్యం
X

దిశ, సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో మోసాలు పెరుగుతున్నాయి. జిల్లాలో కొత్తగా దొంగబాబాలు ప్రత్యక్షమయ్యారు. ‘మృత్యుదేవత తిష్టవేసింది. శాంతి హోమం చేయాలి’ అంటూ వేలాది రూపాయలు దండుకొని మాయమవుతున్న ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇళ్లలో ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారు. జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలంలో వారం రోజులుగా ఇలాంటి మోసాలు కొన్ని వెలుగులోకి వచ్చాయి. కాషాయదుస్తులు, ముఖాన తిలకాలతో దొంగబాబాలు జిల్లాలో పలు ప్రాంతాల్లో సంచరిస్తున్నారు. ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్‌, గొల్లపల్లి, వెంకటాపూర్‌గ్రామాల్లో ఇలాంటి ఘటనలే ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. మూడ్రోజుల కిందట ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్‌లో ఓ మహిళ ఇంటికి కారులో కాషాయ దుస్తుల్లో వచ్చిన ఇద్దరు బాబాలు ఇంట్లో అశాంతి నెలకొందని మాయమాటలు చెప్పారు. పూజలు చేస్తే మంచి జరుగుతుందని నమ్మించారు.

వారి మాటలతో నోరు మెదపని మహిళ ఇంట్లో ఉన్న రూ.17 వేలు అప్పగించింది. ఓ కొబ్బరి కాయ, నిమ్మకాయలు ఇచ్చి అక్కడ నుంచి జారుకున్నారు. మరసటి రోజు అదే గ్రామంలోని మరో మహిళ వద్దకు వెళ్లారు. మీ ఆయనకు దెయ్యం పట్టింది. తొలగిపోవాలంటే తాము పూజలు చేసిన ఓ తాయత్తు ఇస్తామని అందుకు రూ.25 వేలు చెల్లించాలన్నారు. దీంతో సదరు మహిళ దాచుకున్న డబ్బును ముట్టజెప్పింది. ఆమె భర్త వచ్చిన తర్వాత చేతికి కట్టేందుకు ప్రయత్నించగా వ్యతిరేకించిన అతను అందులో ఏముందోనని చూస్తే తెల్లకాగితం కనిపించడంతో మోసపోయినట్టు గ్రహించారు.

బొప్పాపూర్‌ గ్రామంలో ఓ మహిళ ఇంటి వద్ద బీడీలు చుడుతోంది. కారులో వచ్చిన దొంగ బాబాలు ఆమె వద్దకు చేరుకున్నారు. ‘ఇంటిల్లిపాది అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ధనం మీ దరిచేరడం లేదు’ అంటూ మాటలు చెప్పారు. పూజలు చేస్తే అంతా శుభం కలుగుతుందని నమ్మించి రూ.5 వేలు ఖర్చు అవుతుందన్నారు. వారి మాటలు నమ్మని మహిళ గద్దించింది. లోనికి వెళ్లి.. వ్యవసాయ పొలం వద్ద ఉన్న తన భర్తకు ఫోన్‌ చేసింది. వెంటనే దొంగ బాబాలు ఆమె ముఖంపై నీళ్లు చల్లడంతో మిన్నకుండిపోయింది. ఇంట్లోకి వెళ్లిన బాబాలు పూజలు చేస్తున్న క్రమంలో మహిళ భర్త ఇంటికి చేరుకున్నాడు. దొంగ బాబాలు అతడిపైనా నీళ్లు చల్లారు. భార్యాభర్తలు నోరు మెదపకుండా కూర్చున్నారు. రూ.5 వేలు ముట్టజెప్పారు.

తేరుకున్న అనంతరం వారు లబోదిబోమన్నారు. గొల్లపల్లిలో ఓ వ్యాపారి వద్దకు వెళ్లి వ్యాపారంలో నష్టం కలుగుతుందని ధనయంత్రం, పూజలు జరిపితే కోటీశ్వరుడివి అవుతావంటూ రూ.లక్షన్నర తీసుకెళ్లారు. ఇలా గ్రామంలో సుమారు 15 మంది వద్ద రూ.6 లక్షల వరకు వసూలు చేశారు. వెంకటాపూర్‌లో ఓ పలుకుబడి కలిగిన వ్యక్తి వద్ద నూతన ఇంటిలో పూజలు చేయాలని రూ.50 వేలు పట్టుకెళ్లారు. గ్రామాల్లో కొందరు వీరి తీరుపై అనుమానం వచ్చి నిలదీసిన సందర్భంలో పోలీసులంతా తమవారే అన్నట్లుగా పేర్లు చెప్పడంతో బాధితులు భయపడిపోయారు.

గ్రామాల్లో దొంగబాబాలు సంచారిస్తున్నారనే విషయం మా దృష్టికి రాలేదు. ఎవరైనా ముందుకొచ్చి ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. బాబాల మాటలు నమ్మి మోసపోవద్దు. గ్రామాల్లో అనుమానిత వ్యక్తులు సంచరిస్తే సమాచారం అందించాలి. ఆధునిక కాలంలో మంత్రతంత్రాలు ఏమీ లేవు. గ్రామాల్లో చైతన్య సదస్సులను నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పిస్తాం అని ఎల్లారెడ్డిపేట సీఐ బన్సీలాల్‌ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed