షాకింగ్ న్యూస్.. ఆ ఫారెస్ట్ ఆఫీసులో ఖలేజా దొంగలు

by Anukaran |
షాకింగ్ న్యూస్.. ఆ ఫారెస్ట్ ఆఫీసులో ఖలేజా దొంగలు
X

దిశ, కొత్తగూడ: అదొక ఫారెస్ట్ రేంజ్ కార్యాలయం. ఏజెన్సీ మండలాలైన కొత్తగూడ, గంగారంలోని గ్రామాల్లో అక్రమ పోడు వ్యవసాయం ఎక్కడ చేపట్టినా సంబంధిత వాహనాల్ని సీజ్ చేసి, కొత్తగూడ మండల కేంద్రంలోని రేంజ్ కార్యాలయానికి తరలిస్తారు. రేంజ్ కార్యాలయం పరిధిలో దాదాపు 20 నుంచి 30 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. రేంజ్ కార్యాలయంలోని వాహనాలకు గట్టి భద్రత, ఫారెస్ట్ రేంజ్ అధికారి పర్యవేక్షణ నిరంతరం ఉంటుంది. అటవీ భూముల్లో అనుమతి లేకుండా వాహనాలతో ఏ పని చేయనివ్వరు. క్షేత్ర స్థాయి అటవీ సిబ్బంది నిరంతరం పోడు భూముల్ని ఓ కంట కనిపెడుతూ అక్రమంగా పనిచేసేవారిపై, వాహనాలపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు చేపడతారు.

అటవీ శాఖ ఆధ్వర్యంలో భద్రంగా సీజ్ చేసిన ట్రాక్టర్ టైర్లు, విడిభాగాలు రాత్రికి రాత్రే మాయం అయిన సంఘటన కొత్తగూడ మండల కేంద్రంలో కలకలం రేపుతోంది. ఏడాది కిందట అటవీ ప్రాంతంలో అక్రమంగా పోడు సాగు చేస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ట్రాక్టర్‌ని సీజ్ చేసి కొత్తగూడలోని రేంజ్ కార్యాలయానికి తరలించారు. ఇక్కడ భద్రంగా ఉండాల్సిన ట్రాక్టర్ విడిభాగాలు మాయమయ్యాయి. రెండు టైర్లు, సహా విడిభాగాలు గత రాత్రి నుండి కనపడట్లేదని స్థానిక పోలీసులకు ఫిర్యాదు వెళ్ళింది. వీటి విలువ దాదాపు లక్ష వరకు ఉండొచ్చని సమాచారం. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇంటిదొంగల పనే కావచ్చంటూ ప్రచారం..

కొత్తగూడ ఫారెస్ట్ రేంజ్ కార్యాలయంలో ట్రాక్టర్ విడిభాగాలు మాయమైన సంఘటనలో ఇంటి దొంగల హస్తం ఉండొచ్చని మండలంలో ప్రచారం జరుగుతోంది. కార్యాలయంలో సిబ్బంది ఎల్లవేళలా ఉండటం ఒక కారణమైతే, పోడు భూముల దగ్గర క్షేత్ర స్థాయి సిబ్బందికే భయపడే ఈ పరిస్థితుల్లో రేంజ్ కార్యాలయంలోకి చొరబడి ఈ దొంగతనానికి ఎవరు పాల్పడి ఉంటారని, ఇదెలా సాధ్యం అంటూ పలు పుకార్లు షికారు చేస్తున్నాయి.

కార్యాలయంలో సీజ్ చేసిన ట్రాక్టర్ విడి భాగాలు చోరీకి గురి కావడం బుధవారం గమనించాం. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసాం. విచారణలో ఎవరు దోషులని తేలినా కఠిన చర్యలు తీసుకుంటాం. -వజహత్, ఎఫ్. ఆర్. ఓ

Advertisement

Next Story