ఆ రికార్డుల మిస్టరీ వీడేనా..?

by Anukaran |   ( Updated:2020-08-25 21:29:01.0  )
ఆ రికార్డుల మిస్టరీ వీడేనా..?
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ బల్దియాలో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. కార్పొరేషన్ లో విలీన గ్రామాలకు ఒక నిబంధన, పాత కాలనీలకు మరో నిబంధనలు ఉంటున్నాయి. కరీంనగర్ కార్పొరేషన్‌ను విస్తరించేందుకు చుట్టు పక్కల గ్రామాలైన సదాశివపల్లి, వల్లంపహాడ్, తీగలగుట్టపల్లి, ఆరెపల్లి, సీతారాంపూర్, రేకుర్తి, పద్మనగర్, అల్గునూరు గ్రామాలను విలీనం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆయా ప్రాంతాలను సంబంధిత డివిజన్లలో కలిపిన అధికారులు ఎన్నికలు కూడా నిర్వహించారు. కానీ రెవెన్యూ ఇన్స్‌స్పెక్టర్లకు బాధ్యతలు అప్పగించే విషయంలో అధికారులు డిఫరెంట్‌గా వ్యవహరించారు.

కరీంనగర్ పట్టణంలో విలీనం అయిన తీగలగుట్టపల్లి, రేకుర్తి, ఆరెపల్లి, సీతారాంపూర్, పద్మ నగర్ గ్రామాలకు ప్రత్యేకంగా ఆర్‌ఐని నియమించారు. కార్పొరేషన్ పరిధిలోని 1,2 డివిజన్లలో కలిసిన వల్లంపహాడ్, తీగలగుట్టపల్లి గ్రామాలకు ఆయా డివిజన్లను పరిశీలించే ఆర్‌ఐ పర్యవేక్షించాల్సి ఉంటుంది. అలాగే 15వ డివిజన్‌లో విలీనం అయిన పద్మానగర్ , 20లో ఉన్న ఆరెపల్లి, 21లో కలిసిన సీతారాంపూర్, 18,19వ డివిజన్‌లో కలిసిన రేకుర్తి గ్రామాలను సంబంధిత డివిజన్‌లను పర్యవేక్షించే ఆర్ఐలకు అప్పగించలేదు. ఈ గ్రామాలన్నింటినీ ప్రత్యేక జోన్‌గా ఏర్పాటు చేశారు. వీటికి స్పెషల్ రెవెన్యూ ఇన్స్‌పెక్టర్‌ను నియమించడం అంతు చిక్కకుండా తయారైంది. సాధారణంగా కార్పొరేషన్‌‌లో బిల్ కలెక్టర్లకు కానీ, ఆర్ఐలకు కానీ డివిజనల్ వారిగా బాధ్యతలు అప్పగించే వద్ధతి ఉంటుంది. ఇటీవల కార్పొరేషన్‌లో విలీనం అయిన గ్రామాలను ఆయా డివిజన్ల నుంచి మినహాయించి ప్రత్యేకంగా ఆర్‌ఐని నియమించే పద్దతికి శ్రీకారం చుట్టారు.

మిస్సింగ్ మిస్టరీ..

దాదాపు మూడు నెలల క్రితం కరీంనగర్ సమీపంలోని తీగలగుట్టపల్లి పంచాయతీ ఆఫీసు నుంచి ఫైళ్లు మాయం అయిన ఘటనపై విచారణ అటకెక్కింది. ఈ వ్యవహారంపై విచారణ జరుపుతున్నామని మేయర్ సునీల్‌రావు ప్రకటించినప్పటికీ నేటికి విచారణ మాత్రం పూర్తి కాలేదు. కరీంనగర్ నగరాన్ని ఆనుకుని ఉన్న తీగలగుట్టపల్లి పంచాయతీ కార్యాలయం రికార్డుల గల్లంతు వ్యవహారంపై బల్దియా యంత్రాంగం సీరియస్‌గా తీసుకోనట్టు స్పష్టం అవుతున్నది. రూ. కోట్ల ధర పలికే తీగలగుట్టపల్లి రికార్డులు మాయం కావడం కూడా మిస్టరీయేనని అంటున్నారు. 2019 ఆగస్టు 1 చుట్టు పక్కల గ్రామాలను విలీనం చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన వెంటనే అప్పటి కమిషనర్ రికార్డులను సీజ్ చేశామని ప్రకటించారు.

రాష్ట్రంలో విలీన గ్రామాలకు సంబంధించిన రికార్డులన్ని కూడా సంబంధిత మున్సిపల్ ఆఫీసులకు చేరిపోయాయి. ఈ విధానం ఇక్కడ కూడా అమలు చేసినట్టు అప్పుడు అధికారులు ప్రకటించినా కేవలం తీగలగుట్టపల్లి పంచాయితీ రికార్డులు అక్కడే ఎందుకు ఉంచారన్న ప్రశ్నకు జవాబు లేకుండాపోతున్నది. ఒకవేళ విలీనం అయిన వెంటనే తీగలగుట్టపల్లి పంచాయతీ రికార్డులు స్వాధీనం చేసుకోకపోవడంపై అప్పటి అధికారులను బాధ్యుల్ని చేయకపోవడం అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ గ్రామానికి సంబంధించిన రికార్డుల అదృశ్యం వెనక జరిగిన తతంగంపై విచారణ చేయిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Advertisement

Next Story